బలహీన వర్గాలు ఏకమైతేనే రాజ్యాధికారం

బలహీన వర్గాలు ఏకమైతేనే రాజ్యాధికారం
  • టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్

ఎల్బీనగర్, వెలుగు: బడుగు బలహీన వర్గాల ప్రజలందరూ ఏకమైనప్పుడే రాజ్యాధికారం సాధ్యమని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మాజీ పార్లమెంట్ సభ్యుడు మధుయాష్కీ గౌడ్ అన్నారు. ఎల్బీనగర్ సర్కిల్ పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో ఆటోనగర్ లోని హరిణ వనస్థలి అనన్య ఏకో టూరిజం పార్కులో ఆదివారం ‘పద్మశాలి దసరా మేళా’ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ ప్రోగ్రాంకు టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మధుయాష్కీని సంఘం ప్రతినిధులు ఘనంగా సన్మానించారు.

 మధుయాష్కీ గౌడ్ మాట్లాడుతూ.. స్వాతంత్య్ర సమరయోధుడు, నిజాం సర్కార్ కు ఎదురొడ్డిన కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. రాజకీయంగా ఎదిగేందుకు బలహీనవర్గాల్లో ఐకమత్యం ముఖ్యమన్నారు.  కార్యక్రమంలో మాజీ ఎంపీ గుండు సుధారాణి, మాజీ ఎమ్మెల్యే మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్,  సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి, పద్మశాలీ సంఘం ఎల్బీనగర్ సర్కిల్ అధ్యక్షుడు పున్న గణేశ్ నేత, దసరా మహిళా చైర్మన్ కౌకుట్ల రవితేజ తదితరులు పాల్గొన్నారు.