ఒంటిపై గాయాలు లేనంత మాత్రాన రేప్​ జరగలేదని అనలేం

ఒంటిపై గాయాలు లేనంత మాత్రాన రేప్​ జరగలేదని అనలేం

మద్రాస్​ హైకోర్టు కీలక కామెంట్స్‌‌

చెన్నై: బాధితురాలి ఒంటిపై గాయాల గుర్తులు లేనంతమాత్రాన ఆమెపై రేప్​ జరగలేదని నిర్ధారించడం కరెక్ట్​ కాదని మద్రాస్​ హైకోర్టు అభిప్రాయపడింది. గాయాలకు సంబంధించి ఫోరెన్సిక్​ రిపోర్టులో ఉన్న అంశాల్ని సాకుగా చూపించి నిందితుడు శిక్ష నుంచి తప్పించుకోలేడని స్పష్టంచేసింది. 12 ఏండ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ కేసులో ఓ వ్యక్తికి ఈరోడ్​ కోర్టు విధించిన 17 ఏండ్ల జైలుశిక్షను హైకోర్టు సమర్థించింది. తమిళనాడులో సంచలనం రేపిన ఈ కేసుపై ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది. నిందితుడి తరఫు లాయర్​ వాదనను జడ్జి జస్టిస్​ వైద్యనాథన్ తీవ్రంగా తప్పుపట్టారు.

‘‘బాధితురాలి వయసు10ఏండ్లు. తనపై జరుగుతున్నది లైంగికదాడే అనే విషయం తెలియకపోవడం వల్ల  ఆ చిన్నారి రిస్ట్రిక్ట్​ చేసి ఉండకపోవచ్చు. కేవలం ఒంటిపై గాయాలు లేవనే సాకును చూపి రేప్​ జరగలేదనడం తప్పుడు వాదన. ఒంటిపై గాయాలు లేకున్నా, డ్రెస్​పై నిందితుడి వీర్యం ఆనవాళ్లు, ఇతర ఆధారాలు పక్కాగా లభించాయి. ఆమె వాంగ్మూలాన్ని కోర్టు బలంగా నమ్ముతోంది’’అని జడ్జి అన్నారు. ఈరోడ్​ ప్రాంతానికి చెందిన ఓ మహిళ తన కూతుర్ని  ప్రకాశ్​ అనే యువకుడు బలవంతంగా ఎత్తుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడని 2015లో పోలీసులకు కంప్లయింట్​ చేసింది. దొరికిన ఆధారాలను బట్టి నిందితుడికి ఐపీసీ​ కింద 10 ఏండ్లు, పోక్సో చట్టం కింద మరో ఏడేండ్లు జైలు శిక్ష విధిస్తూ ఈరోడ్​ మెజిస్ట్రేట్​ కోర్టు తీర్పు చెప్పింది. అయితే ఫోరెన్సిక్​ రిపోర్టులో బాలిక ఒంటిపై గాయాలు లేవని ఉండటంతో శిక్షను సవాలు చేస్తూ నిందితుడు హైకోర్టు మెట్లెక్కాడు.