కరూర్ తొక్కిసలాటపై మద్రాస్ హైకోర్టు సీరియస్.. ఘటనాస్థలం నుంచి విజయ్ వెళ్లిపోవటంపై సీరియస్

కరూర్ తొక్కిసలాటపై మద్రాస్ హైకోర్టు సీరియస్.. ఘటనాస్థలం నుంచి విజయ్ వెళ్లిపోవటంపై సీరియస్

కరూర్ తొక్కిసలాట కేసులో TVK పార్టీ అధినేత, నటుడు విజయ్ పై మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ దుర్ఘటన జరిగిన వెంటనే పార్టీ చీఫ్ విజయ్ "ఘటనా స్థలం నుంచి పారిపోయాడు" అని, కనీసం ఈ విషాదం పట్ల పశ్చాత్తాపాన్ని కూడా వ్యక్తం చేయలేదని కోర్టు తీవ్రంగా స్పందించింది. ఇది విజయ్ "మానసిక స్థితిని" ప్రతిబింబిస్తోందని న్యాయమూర్తి జస్టిస్ సెంథిల్‌కుమార్ వ్యాఖ్యానించారు. 

విజయ్ కరూర్ మీటింగ్ తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని.. ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం సరిగా నిర్వహించలేదని జస్టిస్ సెంథిల్‌కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన వ్యవహారంలో నిర్వాహకులు, పోలీసులపై హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. ఒక కార్యక్రమ నిర్వాహకుడిగా మీకు ఏమాత్రం బాధ్యత లేదంటూ విజయ్ తీరుపై జస్టిస్ సెంథిల్‌కుమార్ మండిపడ్డారు. ఘటన తర్వాత విజయ్ అక్కడి నుంచి మాయం కావటంపై అసహనం వ్యక్తం చేసింది కోర్టు. 

ఈ కేసును సమగ్రంగా దర్యాప్తు చేయడానికి సీనియర్ ఇండియన్ పోలీస్ సర్వీస్ అధికారిణి ఆస్రా గార్గ్‌ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని బెంచ్ ఆదేశించింది. అదే సమయంలో TVK నాయకులైన బస్సీ ఆనంద్, సీటీఆర్ నిర్మల్ కుమార్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లపై తీర్పును రిజర్వ్ చేసింది. మరోవైపు సమగ్ర మార్గదర్శకాలు రూపొందించే వరకు రోడ్ షోలకు అనుమతులు ఇవ్వకుండా హోం కార్యదర్శి, డీజీపీని నిరోధించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని కూడా కోర్టు విచారిస్తోంది.

బస్సీ ఆనంద్, నిర్మల్ కుమార్ తరఫున సీనియర్ న్యాయవాది వి. రాఘవాచారి వాదనలు వినిపిస్తూ.. తమ కార్యకర్తలకు హాని కలిగించాలనే ఉద్దేశం పిటిషనర్లకు లేదని, ఈ ఘటనను కల్పబుల్ హోమిసైడ్‌గా పరిగణించలేమని వాదించారు. సభ జరిగే స్థలాన్ని పిటిషనర్లు ఎంచుకోలేదని, పోలీసులే తగినంత రక్షణ కల్పించడంలో విఫలమయ్యారని ఆరోపించారు. స్థలం అభ్యంతరకరంగా ఉంటే పోలీసులు అనుమతి ఇవ్వకుండా ఉండాల్సిందని పేర్కొన్నారు. అంతేకాకుండా లాఠీఛార్జి తర్వాతే జనం అదుపు తప్పారని, అలాంటి చర్య అవసరం ఏముందని ధర్మాసనం ముందు వాదనలు వినిపించారు. 

ALSO READ : 'మన శంకర వరప్రసాద్ గారు' ఫ్యాన్స్‌లో జోష్..

దీనికి ప్రభుత్వ తరఫున న్యాయవాది జే. రవీంద్రన్ దీనికి గట్టిగా కౌంటర్ ఇచ్చారు. పోలీసుల అనుమతి మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఇస్తే.. విజయ్ పార్టీ ఈవెంట్ 12 గంటలకే ప్రారంభమవుతుందని ట్వీట్ చేసి ప్రజలను తప్పుదోవ పట్టించిందని కోర్టుకు తెలిపారు. కొద్ది రోజుల క్రితం అదే వేదికపై AIADMK చీఫ్ ఎడప్పాడి కే. పళనిసామి సభకు 137 మంది పోలీసులను మాత్రమే మోహరించగా.. TVK ర్యాలీ కోసం 559 మంది పోలీసులను కేటాయించినట్లు వెల్లడించారు. ఈ భద్రతా ఏర్పాట్లు TVK ర్యాలీకి ఇచ్చిన ప్రాధాన్యతను సూచిస్తున్నాయని స్పష్టం చేశారు. మెుత్తానికి ఎన్నికల దగ్గరపడుతున్న సమయంలో రాజకీయ పార్టీ సమావేశంలో ప్రజలు మరణించటం దీనిపై సిట్ ఏర్పాటు తమిళనాట  నటుడు విజయ్ భవిష్యత్తుపై తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. ఇదే క్రమంలో సీబీఐ విచారణకు మద్రాస్ హైకోర్టు నిరాకరిస్తూ సిట్ ఏర్పాటుకు ఆదేశించటం ఉత్కంఠగా మారింది.