ఎంపీలో చిన్నారిపై రేప్​ ఘటన.. నిందితుల ఇండ్లు కూల్చివేత

ఎంపీలో చిన్నారిపై రేప్​ ఘటన.. నిందితుల ఇండ్లు కూల్చివేత

సత్నా: మధ్యప్రదేశ్​లోని సత్నా జిల్లా మైహర్​లో 12 ఏండ్ల చిన్నారిపై పాశవికంగా అత్యాచారానికి పాల్పడిన నిందితులు రవీంద్ర కుమార్, అతుల్  భదోలియా ఇండ్లను స్థానిక అధికారులు శనివారం కూల్చివేశారు. మైహర్​లోని అటవీ ప్రాంతంలో బాలికపై ఆ ఇద్దరు అత్యాచారం చేశారు. ఈ ఘోరం అనంతరం నిందితుల ఇండ్లను కూల్చివేసేందుకు మైహర్  మునిసిపల్  కౌన్సిల్  చీఫ్​ ఆదేశాలు జారీచేశారు. దీంతో అధికారులు శనివారం నిందితుల ఇండ్లకు వెళ్లారు. ఇండ్లు, ల్యాండ్ కు సంబంధించిన డాక్యుమెంట్లు ఇవ్వాలని నిందితుల కుటుంబ సభ్యులను అడిగారు. ఇండ్లను, డాక్యుమెంట్లను పరిశీలించారు. నిర్మాణాలు చట్టవిరుద్ధంగా ఉన్నాయని తేల్చారు. వ్యవసాయేతర పనుల కోసం ఉద్దేశించిన ప్రభుత్వ భూమిలో ఉందని అతుల్  భదోలియా ఇంటిని, అనుమతి తీసుకోకుండా కట్టారని రవీంద్ర కుమార్ ఇంటిని కూలగొట్టారు.  

ఉద్యోగం నుంచి తొలగింపు..

నిందితులు రవీంద్ర కుమార్, అతుల్  భదోలియాలను శారదా టెంపుల్  మేనేజ్ మెంట్ ఉద్యోగం నుంచి  తొలగించింది.  నిందితులను పోలీసులు స్థానిక కోర్టులో ప్రవేశపెట్టగా.. కోర్టు 14 రోజుల జుడీషియల్ రిమాండ్ విధించింది. క్రిమినల్ కేసులు నమోదైన నేపథ్యంలో వారిని ఉద్యోగం నుంచి తొలగించామని టెంపుల్ మేనేజ్ మెంట్  కమిటీ తెలిపింది. ఆ ఇద్దరూ హీనమైన చర్యకు పాల్పడి ఆలయ పేరుకు మచ్చ తెచ్చారని కమిటీ మండిపడింది. కాగా, బాధితురాలి పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. ప్రస్తుతం ఆమె డివిజనల్  హెడ్ క్వార్టర్స్ లోని రేవా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నది. అవసరమైతే మెరుగైన చికిత్స కోసం బాధితురాలిని ఢిల్లీ లేదా భోపాల్ కు తరలిస్తామని అధికారులు తెలిపారు.