అమ్మ ఆదర్శ పాఠశాలల పనులను గడువులోగా పనులు పూర్తి చేయాలి : అద్వైత్ కుమార్ సింగ్

అమ్మ ఆదర్శ పాఠశాలల పనులను గడువులోగా పనులు పూర్తి చేయాలి :  అద్వైత్ కుమార్ సింగ్

మహబూబాబాద్/ భూపాలపల్లి అర్బన్/ జనగామ అర్బన్/ ​ములుగు, వెలుగు: అమ్మ ఆదర్శ పాఠశాలల పనులను గడువులోగా పూర్తిచేయాలని మహబూబాబాద్ కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఆఫీసర్లను ఆదేశించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని వీరారం తండా, గుండ్లబండ తండా, శ్రీరామ్ తండా మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలను సందర్శించి,పనుల నాణ్యతను పరిశీలించారు. ట్రైబల్ వెల్ఫేర్ ఏఈ ప్రశాంత్, మున్సిపల్ ఏఈ సురేశ్​ఉన్నారు.

కార్పొరేట్​కు దీటుగా సిద్ధం చేస్తాం

కార్పొరేట్ కు దీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దేందుకు పనులు చేపట్టినట్లు భూపాలపల్లి కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు. బుధవారం భూపాలపల్లి మండలంలోని ప్రైమరీ, అప్పర్​ ప్రైమరీ స్కూళ్లలో జరుగుతున్న మరమ్మతు పనులను పరిశీలించారు. ఆయా పాఠశాలల్లో చేపట్టిన మరమ్మతు పనులు పరిశీలించి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆఫీసర్లను ఆదేశించారు. 

కార్యక్రమంలో పంచాయతీ రాజ్ డీఈ వెంకటేశ్వర్లు, ఏఈ సురేశ్​ కుమార్, ఎంపీవో నాగరాజు ఉన్నారు. అంతకుముందు ఐడీవోసీ కార్యాలయంలో ఆరోగ్య ఉప కేంద్రాలు నిర్మాణం తదితర అంశాలపై ఆఫీసర్లతో మీటింగ్ నిర్వహించారు. ఆరోగ్య ఉప కేంద్రాల నిర్మాణాల్లో వేగం పెంచాలన్నారు. నిర్మాణం పూర్తయిన భవనాలకు సంబంధిత మెడికల్ అధికారి నుంచి ధ్రువీకరణలు తీసుకోవాలన్నారు.  మీటింగ్​లో డీఎంహెచ్​వో మధుసూదన్, టీజీఎండీసీ డీఈ నాగిరెడ్డి పాల్గొన్నారు.

పనులు సకాలంలో పూర్తి చేయాలి

అమ్మ ఆదర్శ పాఠశాలల పనులు నాణ్యతతో చేపట్టి, సకాలంలో పూర్తి చేయాలని జనగామ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని కొత్తబస్తీ ఎంపీయూపీఎస్, ఉర్దూ మీడియం ఎంపీయూపీఎస్ పాఠశాలలు, శామీర్​పేట లోని జడ్పీహెచ్ఎస్, ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు, ఎల్లంల ఎంపీపీఎస్, బాణాపురం ఎంపీపీఎస్ పాఠశాలల్లో కొనసాగుతున్న పనులను ఆయన పరిశీలించారు. 

ఆయా పాఠశాలల్లోని పనుల పురోగతిపై ఆరా తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 291 పాఠశాలల్లో అభివృద్ధి పనులు చేపట్టగా, ఇప్పటికే 93 పాఠశాలల్లో పూర్తయ్యాయని, మిగితా వాటిలో పనులను త్వరగా పూర్తిచేయాలని సూచించారు. డీఈవో కె.రాము, డీసీఎస్​వో రోజారాణి, డీఆర్డీవో మొగులప్ప, డీఎంసీఎస్ ప్రసాద్, డీటీ సీఎస్ శ్రీనివాస్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలి 

అమ్మ ఆదర్శ పాఠశాల పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ములుగు అదనపు కలెక్టర్​శ్రీజ సూచించారు. బుధవారం కలెక్టరేట్ లో డీఈవో పాణిని, ఐటీడీఏ డీడీ పోచంతో కలిసి పాఠశాలల్లో చేపట్టిన పనులపై సమీక్ష నిర్వహించారు. సమావేశంలో డీడబ్ల్యూవో స్వర్ణలత, డీసీపీవో ఓంకార్, ఏఈలు తదితరులు పాల్గొన్నారు.