యూరియా పక్కదారి పట్టకుండా చూడాలి : కలెక్టర్ విజయేందిర బోయి

యూరియా పక్కదారి పట్టకుండా చూడాలి : కలెక్టర్  విజయేందిర బోయి

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: పంటల సాగుకు కాకుండా ఇతరత్రా అవసరాలకు యూరియా మళ్లించకుండా నిరంతరం పర్యవేక్షించాలని పాలమూరు కలెక్టర్  విజయేందిర బోయి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లో జిల్లా అధికారులతో వివిధ అంశాలపై రివ్యూ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్  మాట్లాడుతూ యూరియా, ఎరువుల స్టాక్  వివరాలను ఎప్పటికప్పుడు  పరిశీలించాలన్నారు. మండల ప్రత్యేక అధికారులు ఫర్టిలైజర్​ షాపులను తనిఖీ చేయాలన్నారు. వర్షాలు, వరదలతో ఇబ్బందులు కలగకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. మండలాల్లో అందుబాటులో ఉన్న ర్యాపిడ్  రెస్పాన్స్  టీమ్ లను అప్రమత్తం చేయాలని సూచించారు. 

అన్ని పీహెచ్ సీల్లో లేబర్ రూమ్​లు వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు. వర్షాకాలంలో వచ్చే వ్యాధుల పట్ల ప్రజల్లో అవగాహన కలిగించాలన్నారు. హాస్టళ్లలో నీటి సమస్య, లీకేజీలు, ఇతర సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించాలని  బీసీ, ఎస్సీ వెల్ఫేర్​ ఆఫీసర్లను ఆదేశించారు. అడిషనల్  కలెక్టర్ శివేంద్ర ప్రతాప్  మాట్లాడుతూ కాజ్ వేల వద్ద వాగులు పొంగి ప్రవహిస్తుంటే, ట్రాఫిక్  మళ్లించాలని సూచించారు. ప్రభుత్వ కార్యాలయాలు, అంగన్ వాడీ సెంటర్లు, స్కూళ్లు, ఆసుపత్రులు శిథిలావస్థకు చేరిన బిల్డింగుల్లో నిర్వహించవద్దని సూచించారు. అడిషనల్  కలెక్టర్  ఏనుగు నర్సింహారెడ్డి, డీఆర్డీవో నర్సింహులు, ఆర్డీవో నవీన్, జడ్పీ సీఈవో వెంకట్​రెడ్డి పాల్గొన్నారు.