
మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: మండల ప్రత్యేక అధికారులు, జిల్లా అధికారులు ప్రభుత్వ పథకాల అమలుపై ఫోకస్ చేయాలని పాలమూరు కలెక్టర్ విజయేందిర బోయి ఆదేశించారు. కలెక్టరేట్ లో సోమవారం జిల్లా అధికారులతో వివిధ పథకాలపై రివ్యూ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్న పథకాలను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. గురుకుల పాఠశాలలు, వసతి గృహాలు, కేజీబీవీలు, ఆంగన్ వాడీ సెంటర్లను తనిఖీ చేయాలని ఆదేశించారు.
ఎంపీడీవోలు, తహసీల్దార్లు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, సంక్షేమ పథకాల అమలుపై దృష్టి పెట్టాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం అమలు, పరిశుభ్రత, తదితర కార్యక్రమాలు పరిశీలించి రిపోర్ట్ చేయాలని సూచించారు. అడిషనల్ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ మాట్లాడుతూ స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ్–2025 కింద గ్రామాలకు జాతీయ స్థాయిలో ర్యాంకులు వచ్చేలా సిటిజన్ ఫీడ్ బ్యాక్ ఆప్ పై అవగాహన కల్పించాలని సూచించారు. అడిషనల్ కలెక్టర్ మోహన్ రావు, డీఆర్డీవో నర్సింహులు, జడ్పీ సీఈవో వెంకట్రెడ్డి పాల్గొన్నారు.