మహబూబ్‌నగర్, వెలుగు: క్రీడాకారులకు ఆహార సరఫరా చేసిన క్యాటరింగ్ సంస్థకు సంబంధించిన బిల్లుల చెల్లింపు కోసం రూ.లక్ష లంచం తీసుకుంటూ జిల్లా యువజన, క్రీడల అధికారి జక్కు రాజశేఖర్ రెడ్డి, కాంట్రాక్ట్ టైపిస్ట్ గోరె ఉమేశ్గురువారం ఏసీబీకి పట్టుబడ్డారు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు ఇద్దరినీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ఏసీబీ ఆఫీసర్ల వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్‌లోని ఎస్ఏటీజీ వాలీబాల్ హాస్టల్లో ఉన్న క్రీడాకారులకు ఆగస్టు నెలలో ఓ క్యాటరింగ్ సంస్థ ఆహారం సరఫరా చేసింది. ఈ పెండింగ్ బిల్లులను ఆమోదించి, రూ.3.10 లక్షల చెక్కు విడుదల చేయించేందుకు రాజశేఖర్ రెడ్డి రూ.లక్ష లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు.
ఈ మేరకు ట్రాప్ నిర్వహించిన ఆఫీసర్లు, బాధితుడి నుంచి లంచం తీసుకుంటుండగా రాజశేఖర్ రెడ్డి, ఉమేశ్‌ను పట్టుకున్నారు. అనంతరం అరెస్ట్ చేసి హైదరాబాద్‌కు తరలించారు. నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం ఆదేశాలతో చంచల్‌గూడ జైలుకు రిమాండ్‌పై తరలించారు.
