అంత్యక్రియల డబ్బుతో వాగుపై బ్రిడ్జి

అంత్యక్రియల డబ్బుతో వాగుపై బ్రిడ్జి

ఊళ్లో ఏవైనా సమస్యలుంటే మాకెందుకులే అని చూసీచూడనట్టు వదిలేసే వాళ్లు కొందరైతే. ఆ సమస్యలు తెలుసుకొని, వాటిని తీర్చమని అధికారులకు చెప్పేవాళ్లు ఇంకొందరు. ఇలాంటి వాళ్లు ఊరి కష్టాన్ని తమ కష్టంగా అనుకుంటారు. ఆ కోవకే చెందుతాడు మహదేవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. వాళ్ల ఊళ్లో ఉన్న వాగు దాటడం కోసం ఊరికి బ్రిడ్జి వేయమని కొన్నేండ్లుగా ఆఫీసర్ల చుట్టూ తిరిగిన మహదేవ్‌‌‌‌‌‌‌‌ ఝా గురించి...

బీహార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మధుబని జిల్లాలోని నారార్ అనే మారుమూల గ్రామం మహదేవ్‌‌‌‌‌‌‌‌ సొంతూరు. అక్కడే గవర్నమెంట్ స్కూల్‌‌‌‌‌‌‌‌ టీచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పని చేశాడు మహదేవ్‌‌‌‌‌‌‌‌. నారార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీదుగా ఒక వాగు పారుతుంటుంది. వర్షాకాలం వచ్చిందంటే చాలు ఆ ఊరికి సమస్యలు మొదలు. కరెంట్‌‌‌‌‌‌‌‌, తాగు నీటి సమస్యలకి తోడు చినుకు పడిందంటే చాలు వాగు పొంగి పొర్లుతుంది. దాంతో వేరే ఊళ్లకు రాకపోకలు ఆగిపోయేవి. హాస్పిటల్‌‌‌‌‌‌‌‌కు వెళ్లాలన్నా, ఇంటికి సరుకులు తెచ్చుకోవాలన్నా వాగు తగ్గేవరకు ఆగాల్సిందే. ధైర్యం చేసి నీళ్లలోకి దిగితే వరద నీటికి కొట్టుకుపోయిన సందర్భాలు బోలెడు. ఇలా చాలా ఏండ్లు ఇబ్బంది పడ్డారు నారార్ ఊరి ప్రజలు. అయితే ఆ వాగు మీద ఒక బ్రిడ్జి కట్టించాలని కొన్నేండ్లుగా మహదేవ్‌‌‌‌‌‌‌‌ సంబంధిత అధికారుల చుట్టూ తిరిగాడు.  ఎన్ని సార్లు అడిగినా రేపు, మాపు అంటూ దాటేసేవాళ్లు. ఇంట్లో వాళ్లు ‘ఇంత కష్ట పడటం అవసరమా’ అన్నా ఊరుకోలేదు. 2019లో మహదేవ్‌‌‌‌‌‌‌‌కు కరోనా వచ్చింది. దానివల్ల అనారోగ్య సమస్యలు వచ్చి కొన్ని రోజులకు మంచాన పడ్డాడు. అయినా పట్టు వదల్లేదు. ఇంట్లో నుంచే ఆఫీసర్లకు లెటర్లు రాసేవాడు. ఆయన గోడును ఆఫీసర్లు పట్టించుకోలేదు.   

అంత్యక్రియల డబ్బుతో..    

ఇలా 2020 వరకు తన ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు మహదేవ్‌‌‌‌‌‌‌‌. ఇక తన చివరి రోజులు దగ్గర పడ్డాయని అర్థమై ‘నేను చనిపోయాక అంత్యక్రియల కోసం డబ్బు వేస్ట్‌‌‌‌‌‌‌‌ చేయకండి. వాటికయ్యే ఖర్చుతో ఊరి బాగు కోసం వాగు పైన బ్రిడ్జి కట్టించండి’ అని తన చివరి కోరికగా భార్య మహేశ్వరీ దేవి, కొడుకు సుధీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని కోరాడు. వాళ్లు సరేనన్నారు. తన 72వ ఏట, 2020 మే నెలలో మహదేవ్‌‌‌‌‌‌‌‌ చనిపోయాడు. మహదేవ్‌‌‌‌‌‌‌‌ చివరి కోరిక తీర్చడానికి అంత్యక్రియలకు అయ్యే ఖర్చు ఐదు లక్షల రూపాయలతో బ్రిడ్జి కట్టించడం మొదలుపెట్టాడు అతని కొడుకు సుధీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. అది ఇప్పుడు పూర్తయిది. వీళ్లు చేసిన పనిని గ్రామస్తులంతా మెచ్చుకున్నారు. అంతేకాదు మహదేవ్‌‌‌‌‌‌‌‌ జ్ఞాపకార్థంగా గ్రామస్తులందరూ కలిసి బ్రిడ్జి మీద శిలా ఫలకాన్ని పెట్టించారు.