
హైదరాబాద్, వెలుగు : ఎటూ చూసినా కిక్కిరిసిన జనం. క్యూ కట్టి నిమజ్జనానికి తరలొచ్చిన విగ్రహాలు. ‘గణపతి బప్పా మోరియా’.. జై బోలో గణేశ్ మహరాజ్ కీ జై’.. నినాదాలు. బ్యాండ్ మేళాలు.. డప్పు చప్పుళ్లు.. ఆటలు.. పాటలు.. డ్యాన్స్‌లు.. యువత కేరింతలు.. ఇలా ట్యాంక్‌బండ్ పరిసరాలు హోరెత్తాయి.
గురువారం హుస్సేన్‌సాగర్ నిమజ్జనం చూసేందుకు చిన్నా, పెద్ద.. కుటుంబాలతో ఉత్సాహంగా ట్యాంక్‌బండ్‌కు తరలివచ్చారు. లంబోదరుడికి బై బై చెప్పారు. ట్రక్కులు, లారీలు, డీసీఎంలు, ట్రాక్టర్లు, కార్లు, బైక్‌ల మీద.. ఇలా తమ గణనాథులను తీసుకొచ్చి గంగమ్మ ఒడికి చేర్చారు. ఉదయం 6 గంటలకే ఖైరతాబాద్బడా గణేశ్ శోభాయాత్ర ప్రారంభమై సెక్రటేరియట్, తెలుగుతల్లి ఫ్లై ఓవర్, లుంబిని పార్క్, ఎన్టీఆర్ మార్గ్‌కు చేరింది. దీంతో ఆ ఏరియా జనాలు కిక్కిరిసిపోయింది.
జనం బడా గణేశ్‌ను తమ సెల్ఫోన్లలో ఫొటోలు తీసుకోగా.. కొందరు సెల్ఫీలు తీసుకుంటూ సందడిచేశారు. సాయంత్రం వాన పడుతున్నా లెక్క చేయకుండా ఎంజాయ్చేశారు. సిటీ జనాలే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.
నిమజ్జనంలో భాగంగా వెరైటీ గణనాథులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆదిపురుష్ సినిమాలో హనుమంతుడి రూపం, శివ తాండవ గణనాథుడి రూపం, హనుమంతుడు చేతిలో సంజీవని పర్వతరూపం, వసుదేవుడి తలమీద గణనాథుడు, గిటార్ వాయిస్తున్న గణపతి ఇలా బహు రూపాల్లో ఉండి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచి.. చూపరులకు కనువిందు చేశాయి. అదేవిధంగా నిమజ్జన ట్రెండ్ మారుతూ వస్తుంది.
యూత్అసోషియేషన్లు, ఫ్రెండ్స్, కాలనీవాసులు, ఇండ్లలో గ్రూప్‌గా విగ్రహాలు పెట్టిన వారు డ్రెస్‌కోడ్‌లో కనిపించారు. ఇలా డ్రెస్‌కోడ్‌తో వచ్చిన వారు ట్యాంక్‌బండ్‌పై ప్రధాన ఆకర్షణగా కనిపించారు. సాయంత్రం భారీ వర్షం పడటంతో గణనాథుల నిమజ్జనం నెమ్మదిగా సాగింది. సైబరాబాద్ పరిధిలో గణేశ్ నిమజ్జనాలు కొనసాగాయి. సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర నిమజ్జనాలు జరుగుతున్న ప్రాంతాలను పరిశీలించారు.
గురువారం 4,474 విగ్రహాలను నిమజ్జనం చేసినట్లు ఆయన తెలిపారు. కూకట్ పల్లి ఐడీఎల్ చెరువులో 281 విగ్రహాల నిమజ్జనం జరిగింది. సరూర్‌నగర్‌లోని మినీ ట్యాంక్‌బండ్ వద్ద గణనాథుల నిమజ్జనం కోలాహలంగా సాగింది. భక్తులు భారీగా తరలివచ్చారు.