తిరుగులేని నాయకుడు రంజిత్ సింగ్

తిరుగులేని నాయకుడు రంజిత్ సింగ్

మొఘల్​ సామ్రాజ్యం విచ్ఛిన్నమైనప్పుడు పంజాబ్​ అల్లకల్లోలంగా ఉండేది. వాయవ్య దిశ నుంచి ఆప్ఘాన్​లు, దక్షిణ దిశ నుంచి మరాఠాలు దండెత్తి పంజాబ్​ను నిర్జనారణ్యంగా మార్చారు. ఇప్పటికల్లా సిఖ్ఖులు 12 తెగలుగా విడిపోయారు. గురువులు నిషేధించిన మత్తు మందులు, సురాపానం విచ్చలవిడిగా వాడేవాళ్లు. అప్పుడు పంజాబ్​లో చట్టం అంటే కత్తిదే. అలాంటి పరిస్థితుల్లో1780లో రంజిత్ సింగ్ జన్మించాడు. ఆయన తండ్రి మహాన్ సింగ్ సుకర చాకియా తెగ నాయకుడు. ఆ తెగవారు నిరంతరం తమ శత్రు తెగ అయిన ‘భంగీ’లతో పోరాడుతుండేవారు. ఆయనకు చిన్నప్పుడు మశూచికం రావడంతో ఒక కన్ను పోయింది. తన పదో ఏట తండ్రితోపాటు యుద్ధ ఏనుగు మీద కూర్చుని మొదటిసారిగా యుద్ధాన్ని చూశాడు. అప్పుడు శత్రు వర్గానికి చెందిన ఒక వ్యక్తి తన ఏనుగు దగ్గరకు వచ్చి రంజిత్ సింగ్​ను పట్టుకోబోయేలోగా అతన్ని నరికివేశారు. అలా వెంట్రుక వాసిలో చావు తప్పింది. రెండేండ్ల తర్వాత తండ్రి చనిపోయాడు. 

దాంతో 12 ఏండ్ల రంజిత్​ అస్తవ్యస్తంగా ఉన్న తమ తెగవారిని అదుపు చేసి గమ్యస్థానానికి చేర్చే బాధ్యత తీసుకున్నాడు. ఆ తర్వాత కొంతకాలానికే ఆయన గుడారాన్ని, మనుషులను, గుర్రాలను, ఒంటెలను వరద ముంచెత్తడంతో చావు అంచులదాకా వెళ్లొచ్చాడు. తన తల్లి, అత్త ఇద్దరూ వీరవనితలు. వాళ్లని వేర్వేరు కోటల్లో బంధించారు. పంజాబ్​ రాజధానియైన లాహోర్​ను ఆక్రమించుకోవడానికి అతనికి చాన్స్ దొరికింది. 1799లో లాహార్​ను ఆక్రమించుకున్నాడు. ఆ తర్వాత అమృత్​సర్​ నగరాన్ని, ప్రఖ్యాత ఫిరంగిని స్వాధీనం చేసుకున్నాడు రంజిత్ సింగ్. 

పంజాబ్​లో తిరుగులేని నాయకుడిగా ‘మహారాజా’ బిరుదు పొందాడు. రంజిత్ సింగ్ తన తరంలో గొప్ప నాయకుడు. చిన్న చిన్న సంస్థానాలను ఒక రాజ్యంగా రూపొందించాడు. ఇంగ్లిషు వాళ్లు జోక్యం చేసుకునేందుకు వీలు లేకుండా చేశాడు. తన దేశ సైన్యాన్ని అశ్వికులు, సాహసికులతో ఏర్పరిచాడు. 50వేల మంది సైనికులు, 50 వేల సాయుధ దళాలు, 300 కన్నా ఎక్కువ ఫిరంగులను సమకూర్చాడు. ఆయన జీవితమంతా యుద్ధ రంగంలో పోరాడుతూనే ఉన్నాడు. ఈ క్రమంలో వైద్యుని సలహాలు లెక్కచేయకుండా మద్యం సేవిస్తూ ఉండేవాడు. అప్పటికే ఆయనకు రెండుసార్లు పక్షవాతం వచ్చింది. చనిపోవడానికి ముందు వివిధ వజ్రాలు, గుర్రాలను, ప్రార్థనా మందిరాలను పంచిపెట్టాడు. 1839లో ఆరోగ్యం క్షీణించడంతో మరణించగా ఆయన ఇద్దరు రాణులు ఆ చితిలో దూకారు. అప్పటికి ఆయన వయసు 59 ఏండ్లు. 

- మేకల 
మదన్​మోహన్​ రావు
కవి, రచయిత