సెలవు ప్రకటించిన మహారాష్ట్ర ప్రభుత్వం

సెలవు ప్రకటించిన మహారాష్ట్ర ప్రభుత్వం

ముంబై మహానగరాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తూనే ఉన్నాయి. ఓ వైపు వర్షం.. మరోవైపు వరదతో మహానగరం కాస్త మహాసముద్రంలా మారింది. అడుగుతీసి అడుగేయలేని పరిస్థితి. రోడ్లు.. ఇళ్లు.. రైల్వే ట్రాక్ లు.. ఎటు చూసినా నడుంలోతు నీరు. లోతట్టు ప్రాంతాలన్ని జలమయమయ్యాయి. ఇప్పటికీ అక్కడక్కడా వర్షాలు పడుతూనే ఉన్నాయి. మరో 72 గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశముందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో ముంబై జనం గుండెల్లో రాయి పడినట్టైంది. ఇప్పటికే ప్రాణాలరచేత పెట్టుకుని కాలం వెల్లదీస్తోంటే.. మళ్లీ భారీ వర్షం పడితే తమ పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారు.

ముంబైలో కేవలం నిన్న ఒక్క రాత్రే.. 54 సెంటీమీటర్ల వర్షాపాతం నమోదైంది. పదేళ్లలో ఇదే అత్యధిక వర్షాపాతమని అధికారులు చెబుతున్నారు. భారీ వర్షాలు.. వరదల కారణంగా.. ఇవాళ మహారాష్ట్రలోని మూడు జిల్లాల్లో సెలవు ప్రకటించింది ప్రభుత్వం. కేవలం ఎమర్జెన్సీ సర్వీసులు మాత్రమే పనిచేస్తాయని చెప్పింది. ప్రజలు ఇళ్లలోంచి బయటకు రావొద్దని సలహా ఇచ్చింది.

రహదారులన్నీ జలమయమయ్యాయి. రోడ్డు, రైలు, విమానయాన మార్గాల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. వర్షాల కారణంగా అక్కడి విమానాశ్రయాన్ని అధికారులు మూసివేయడంతో శంషాబాద్‌ నుంచి ముంబయి వెళ్లే అన్ని విమాన సర్వీసులు రద్దయ్యాయి. ముంబయికి సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు శంషాబాద్ విమానాశ్రయ అధికారులు వెల్లడించారు.