గాంధీ సింపుల్ లైఫ్​స్టైల్​.. ఆరోగ్యంగా ఎలా ఉండాలో అప్పుడే చెప్పిండు

గాంధీ సింపుల్ లైఫ్​స్టైల్​..  ఆరోగ్యంగా ఎలా ఉండాలో అప్పుడే చెప్పిండు

ఇప్పటి టెక్నాలజీ యుగంలో ఆరోగ్యం బాగుండడం ఎంతో అవసరం. ఏదైనా రోగం వచ్చినప్పుడు డాక్టర్​ దగ్గరికో, డైటీషియన్​ వద్దకో వెళ్లినప్పుడు వాళ్లు చెప్పేమాట.. మంచి పోషకాలు ఉన్న నేచురల్​ ఫుడ్​ తినమని. ఇదే విషయాన్ని గాంధీజీ ఎప్పుడో చెప్పారు. ఆరోగ్యంగా ఉండాలంటే పండ్లతోపాటు పచ్చి కూరగాయలు తినమన్నారు. అలాగే చిరుధాన్యాలు.. అంటే సజ్జలు, జొన్నలు, రాగులు వంటి వాటిని ఎక్కువగా తీసుకోమన్నారు. 

ఇది ఇటీవల బాగా పాపులర్​ అయిన ‘సూపర్​ఫుడ్​’ లాంటిదే. అలాగే అప్పుడప్పుడు ఉపవాసం ఉండాలంటూ ఇప్పటి డాక్టర్లు చెప్తున్న మాటను ఎప్పుడో పాటించి చూపారు గాంధీజీ. ఆరోగ్యంగా ఉండడమే కాదు సింపుల్​గా బతకడం ఎలాగో కూడా నేరుగా అర్థమయ్యేలా చేశారు. తాను పుట్టుకతోనే ధనవంతుడైనప్పటికీ కేవలం ధోతీ, కండువాతో కనిపిస్తూ ఆదర్శంగా నిలిచారు. ఆడంబరంగా బట్టలు వేసుకోలేదు. కారణం.. తాను కోట్ల మందికి ప్రతినిధి. వాళ్లలో కట్టుకోవడానికి సరైన బట్టలు లేనివాళ్లు కూడా ఉన్నారు. తానూ వాళ్ల మనిషినేనని చెప్పడానికి ఆయన ఎంచుకున్న మార్గమిది. ఇప్పటి తరంలో ఇలాంటివాళ్లు అరుదుగా కనిపిస్తారు. 

Also Read :- తెలుగు నేర్చుకోవాలనుకున్న మహాత్మా గాంధీ

వనరులు తక్కువ వాడుకోవాలి

సహజ వనరులు తగ్గడం, గ్లోబల్​ వార్మింగ్​, క్లైమేట్ ఛేంజ్ ఇప్పుడు ప్రపంచం ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్యలు. వీటిని దాదాపు వందేండ్ల కిందటే గుర్తించారు గాంధీజీ. అందుకే ‘ప్రకృతి ఉండేది అందరి అవసరాలు తీర్చడానికి. అంతేకానీ, ఎవరో కొంతమంది కోరికలు తీర్చడానికి కాదు’ అన్నారు. అంటే సహజ వనరులను అవసరమైనంత వరకే వాడాలని, విచ్చలవిడిగా వాడి భవిష్యత్​ తరాలకు వాటిని దూరం చేయొద్దని చెప్పారు. పరిశ్రమలు పెరిగితే కాలుష్యం ఎక్కువవుతుందని, కొత్త కొత్త రోగాలు వస్తాయని కూడా ఆయన అప్పుడే ఊహించారు. అలా జరగకుండా ఉండాలంటే చేయాల్సిన పనులు కూడా చెప్పాడు. దాన్నే సస్టైనబుల్​ డెవలప్​మెంట్​(సుస్థిరాభివృద్ధి) అన్నారు. 

అంటే.. మన దగ్గరున్న సహజ వనరులను అవసరమైనంత మేరకే వాడుకోవడం. భవిష్యత్​ తరాలకు వనరులను మిగల్చడం. గ్లోబల్​ వార్మింగ్​, వాతావరణ మార్పులతో ప్రపంచమంతా ఇబ్బంది పడుతున్న ఈ టైంలో గాంధీజీ చెప్పిన సూత్రాన్ని పాటించడం ఎంతో అవసరం. అందుకే ఇప్పటి వాతావరణ ఒప్పందాలు, పర్యావరణ పరిరక్షణ అగ్రిమెంట్స్​, సస్టెయినబుల్​ డెవలప్​మెంట్​ గోల్స్​ ఫాలో అవ్వాలని చాలా దేశాలు, అంతర్జాతీయ సంస్థలు నిర్ణయించుకున్నాయి.