బీసీలకు ఎక్కువ సీట్లు ఇచ్చినం.. పూలే ఆశయాలు ఆచరించిన నేత కేసీఆర్: కేటీఆర్

బీసీలకు ఎక్కువ సీట్లు ఇచ్చినం.. పూలే ఆశయాలు ఆచరించిన నేత కేసీఆర్: కేటీఆర్

హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధికంగా బీసీలకు సీట్లు ఇచ్చిన ఏకైక పార్టీ బీఆర్ఎస్ అని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ప్రస్తుతం 17 లోక్​సభ స్థానాల్లో ఎస్సీ, ఎస్టీ ఐదు రిజర్వేషన్ సీట్లు పోనూ.. మిగతా 12 సీట్లలో 50 శాతం స్థానాలను బీసీలకు ఇచ్చామన్నారు. గురువారం తెలంగాణ భవన్‌‌‌‌లో మహాత్మా జ్యోతిరావు పూలే 197వ జయంతి ఉత్సవాలు జరగ్గా.. కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సమాజంలోని అన్ని వర్గాలు పూలే వారసత్వాన్ని ముందుకు తీసుకుపోవాలని పిలుపునిచ్చారు. 

ఉపాధి కల్పన, అందరికీ సమాన హక్కులు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నదని, ఈ విషయంలో ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇస్తామని చెప్పారు. 75 సంవత్సరాల భారత స్వాతంత్ర్య చరిత్రలో పూలే ఆశయాలను ఆచరణలోకి తీసుకొచ్చిన నాయకుడు కేసీఆర్ అని అన్నారు. రాబోయే మూడేళ్లలో పూలే ద్విశతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని ఆయన సమున్నత విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్నారు. బడుగు బలహీన వ ర్గాల కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప సంఘసంస్కర్త జ్యోతిరావు పూలే అని మాజీ స్పీకర్ మధుసూదనాచారి పేర్కొన్నారు.