అభివృద్ధి పేరుతో దోపిడీ చేసిన్రు : యెన్నం శ్రీనివాస్ రెడ్డి

అభివృద్ధి పేరుతో దోపిడీ చేసిన్రు : యెన్నం శ్రీనివాస్ రెడ్డి

పాలమూరు, వెలుగు: బీఆర్ఎస్  పదేండ్ల పాలనలో అభివృద్ధి పేరిట లక్షల కోట్లు దోచుకున్నారని మహబూబ్ నగర్  ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. బుధవారం అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్  పార్టీ కార్యాలయంలో నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాలమూరు ప్రజలు ప్రశాంతంగా ఉండాలనే ఉద్దేశంతో తనను గెలిపించారని పేర్కొన్నారు.

పాలమూరు ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పదేండ్లుగా దోపిడీ పాలన సాగిందన్నారు. చట్టానికి విరుద్ధంగా ఎవరైనా వ్యవహరిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ప్రాజెక్టుల పేరుతో లక్ష కోట్ల ప్రజల ఆస్తిని కాజేసిందన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన 6 గ్యారంటీలను ఖచ్చితంగా అమలు చేస్తామని, ప్రజా సేవ చేయడమే తమ ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్, బిక్కరి అనిత, గోపాల్ యాదవ్, సిరాజ్ ఖాద్రి పాల్గొన్నారు.