SSMB29: 120 దేశాల్లో మహేష్ బాబు 'SSMB29' విడుదల.. సరికొత్త రికార్డుకు రాజమౌళి సిద్ధం!

SSMB29: 120 దేశాల్లో మహేష్ బాబు 'SSMB29' విడుదల.. సరికొత్త రికార్డుకు రాజమౌళి సిద్ధం!

భారతీయ సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి మరో భారీ ప్రయోగానికి సిద్ధమయ్యారు. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ 'పఠాన్' సినిమా రికార్డును అధిగమించే దిశగా ఆయన అడుగులు వేస్తున్నారు. 'పఠాన్' 100కు పైగా దేశాల్లో విడుదలైన మొదటి భారతీయ సినిమాగా నిలిచింది. ఇప్పుడు మహేష్ బాబుతో కలిసి చేస్తున్న 'SSMB29' తో ఈ రికార్డును బద్దలు కొట్టాలని లక్ష్యంగా రాజమౌళి పెట్టుకున్నారు. లేటెస్ట్ గా ఈ మూవీకి సంబంధించిన అప్ డేట్ అభిమానుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. సోషల్ మీడియాలో ఈ వార్త హల్ చల్ చేస్తోంది.

కెన్యాలో  రాజమౌళి టీమ్ ..
'SSMB29' చిత్రీకరణలో భాగంగా రాజమౌళి టీం ఇటీవల కెన్యాలో అడుగుపెట్టింది. ఈ విషయం కెన్యా విదేశాంగ మంత్రి ముసాలియా ముదావాడి ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన తన ఎక్స్ ఖాతాలో రాజమౌళిని ప్రశంసిస్తూ ఒక సుదీర్ఘ పోస్ట్ చేశారు. రాజమౌళి బృందం కెన్యాను ఎంచుకోవడం తమ దేశానికి గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. ప్రపంచంలోని గొప్ప చిత్రనిర్మాతలలో ఒకరైన రాజమౌళి.. తన 120 మంది సభ్యుల బృందంతో తూర్పు ఆఫ్రికాలో విస్తృతంగా పరిశీలనలు జరిపి మా కెన్యాను ఎంచుకోవడం శుభసూచికం అన్నారు. ఆఫ్రికాలో చిత్రీకరించాల్సిన సన్నివేశాల్లో 95 శాతం ఇక్కడే పూర్తయ్యాయి అని ఆయన తెలిపారు. మసాయి మారా మైదానాలు, నైవాషా సరస్సులు, సంబురు అడవులు, అంబోసెలి జాతీయ పార్క్ వంటి అందమైన ప్రదేశాలు 'SSMB29' ద్వారా ప్రపంచానికి పరిచయం కానున్నాయని ఆయన అన్నారు.

120 దేశాల్లో 'SSMB29'  విడుదల.. 
అంతే కాదు 'SSMB29' చిత్రాన్ని ఏకంగా 120కి పైగా దేశాల్లో విడుదల కానుందని  కెన్యా మంత్రి తన పోస్ట్ లో తెలిపారు.  దీంతో ఈ సినిమా ద్వారా కెన్యా గొప్పదనం ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల మంది ప్రేక్షకులను చేరుతుందని ఇది ఎంతో సంతోషకరమైనది అన్నారు. ఇప్పుడు ఈ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  ఈ ప్రకటనతో 'పఠాన్' రికార్డును రాజమౌళి అధిగమించడం ఖాయమని స్పష్టమైంది. 'పఠాన్' విడుదలైన మొదటి రోజు రూ.104.80 కోట్లు వసూలు చేయగా, ఈ చిత్రం మొత్తం రూ.1,050 కోట్లు సాధించింది. రాజమౌళి చిత్రాలకు ఉన్న క్రేజ్ దృష్ట్యా 'SSMB29' ఈ రికార్డులను సునాయాసంగా బద్దలు కొట్టగలదని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో రాజమౌళి బిగ్ ప్లాన్ అదిరిందంటూ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.  

ALSO READ : యాక్షన్ సినిమాలకు అనుష్కనే ఎందుకు..?

యాక్షన్-అడ్వెంచర్ కథతో..
'ఇండియానా జోన్స్' తరహాలో ఒక యాక్షన్-అడ్వెంచర్ కథతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ భారీ ప్రాజెక్టులో మహేష్ బాబుతో పాటు, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి అంతర్జాతీయ తారాగణం కూడా భాగం కావడం సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ఈ సినిమాకి విడుదల తేదీ ఇంకా ఖరారు కానప్పటికీ, నవంబర్ 2025లో ఈ సినిమా టైటిల్ రివీల్ ఉంటుందని సమాచారం. కెన్యాలో చిత్రీకరణ పూర్తి చేసుకున్న 'SSMB29' బృందం ఇప్పుడు తదుపరి షెడ్యూల్ కోసం భారతదేశానికి తిరిగి వచ్చింది.  2027 మార్చిలో ఈ మూవీని విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తు్న్నట్లు సమాచారం.  భారీ బడ్జెట్ తో తెరకెక్కతున్న ఈ చిత్రం భారతీయ సినిమా చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని లిఖించడం ఖాయమని అభిమానులు, సినీ విశ్లేషకులు నమ్మకంగా ఉన్నారు.