Ghaati: యాక్షన్ సినిమాలకు అనుష్కనే ఎందుకు..? 'ఘాటీ'పై రానా ప్రశ్నకు స్వీటీ షాకింగ్ రిప్లై !

Ghaati: యాక్షన్ సినిమాలకు అనుష్కనే ఎందుకు..? 'ఘాటీ'పై రానా ప్రశ్నకు స్వీటీ షాకింగ్ రిప్లై !

భారతీయ సినిమా చరిత్రలో అరుంధతి, బాహుబలి వంటి చిత్రాలతో యాక్షన్ క్వీన్ గా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది అనుష్క శెట్టి. కేవలం పురుష హీరోలకే పరిమితమైన యాక్షన్ చిత్రాల్లో..  మహిళా కథానాయికగా ఆమె రాణించడం అరుదైన విషయం.  మహిళా ప్రధాన యాక్షన్ చిత్రాలకు ఎక్కువగా ఎంపికయ్యే కొద్దిమంది నటీమణులలో ఒకరిగా అనుష్క నిలిచారు.  లేటెస్ట్ గా ఆమె నటించిన 'ఘాటీ' సినిమా సెప్టెంబర్ 5న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ జోరుగా సాగుతుంది. ఈ సందర్భంగా రానా దగ్గుబాటితో ఆమె జరిపిన ఇంటర్యూ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

యాక్షన్ సినిమాలకు అనుష్కనే ఎందుకు..?
ఈ ఇంటర్వ్యూలో అనుష్కను రానా ఒక ఆసక్తికరమైన ప్రశ్న అడిగాడు. మీరు ఎప్పుడూ ఇలాంటి పవర్ ఫుల్ పాత్రలకే ఎందుకు మొదటి ఎంపిక అవుతారు? అని ప్రశ్నించారు. దీనికి అనుష్క నవ్వుతూ..  అది నాకే తెలియదు రానా...  నేనే దాని గురించి ఆలోచిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చింది. అంతే కాదు తన సినిమాల్లో హింసాత్మక సన్నివేశాల గురించి కూడా సరదాగా చర్చించింది. అరుంధతి, బాహుబలి, ఇప్పుడు ఘాటీ... ఈ చిత్రాల్లో హింస చాలా ఎక్కువగా ఉందని, ఈ విషయం గురించి తాను దర్శకుడు క్రిష్‌తో కూడా చెప్పానని తెలిపింది. ఒక హిట్‌మ్యాన్‌లా, తాను ఒక హిట్‌వుమెన్‌గా మారిపోగలనేమో అని చమత్కరించింది. అందుకు రానా.. ఇలాంటి కథలకు మిమ్మల్ని కాకుండా ఇంకెవరిని తీసుకుంటారు? అని తిరిగి ప్రశ్నించాడు. దీనికి అనుష్క  ఈ సంభాషణ యాక్షన్ సినిమాల్లో అనుష్క పాత్ర ఎంత కీలకమో తెలియజేస్తుంది.

ఇక అరుదుగా కాదు..  ఎక్కువగా కనిపిస్తా..
యాక్షన్ సినిమాలతో ఆమెకు ఎంత పేరు వచ్చినా..  సినిమాకు సినిమాకు మధ్య ఎక్కువగా గ్యాప్ తీసుకుంటుంది. ఈ సుదీర్ఘ విరామం గురించి సినీ ఇండస్ట్రీలో తీవ్ర చర్చకూడా నడుస్తోంది. అటు అభిమానులు  ఎప్పటి నుంచో ఆందోళన చెందుతున్నారు. దీనిపై అనుష్క స్పందిస్తూ..  నిజంగానే నేను ఇంకా ఎక్కువ సినిమాలు చేయాలి. మంచి కథలను ఎంచుకుంటా..  మరిన్ని ఎక్కువ సినిమాల్లో కనిపించాలని కోరుకుంటున్నాను. వచ్చే సంవత్సరం నుంచి మీరు నన్ను ఇంకా ఎక్కువగా చూస్తారు అని వాగ్దానం చేసింది. 

దర్శకుడు క్రిష్ పై ప్రశంసలు..
అనుష్కకు 'ఘాటీ' సినిమాలో ఒక విలక్షణమైన పాత్ర లభించింది. ఈ చిత్రానికి దర్శకుడు క్రిష్ జాగర్లమూడి. ఈ సినిమా చిత్రీకరణలో దర్శకుడిని పొగడ్తలతో ముంచెత్తింది అనుష్క.  నాకు ఇలాంటి ప్రత్యేకమైన పాత్రలు కేవలం క్రిష్ మాత్రమే ఇవ్వగలరు. వేదం సినిమాలో సరోజ పాత్రను ఆయన ఎంతో అమాయకంగా చూపించారు. అది ఇప్పటికీ నా ఉత్తమ పాత్రలలో ఒకటిగా నిలిచిపోయింది. ఘాటీలో కూడా షీలా పాత్ర..  ఇతర సినిమాల్లో పాత్రలకు చాలా భిన్నంగా చూపించారు. ఈ పాత్ర చాలా ప్రత్యేకంగా ఉంటుందని పేర్కొంది.

►ALSO READ | తీన్మార్ స్టెప్పులతో దుమ్మురేపిన హీరోయిన్.. గణేష్ నిమజ్జన వేడుకల్లో ఇదే బెస్ట్ పెర్ఫార్మెన్స్

భారీ అంచనాలతో తెరకెక్కిన 'ఘాటీ' చిత్రం సెప్టెంబర్ 5న థియేటర్లలో విడుదల కానుంది.  ఈ మూవీతో అనుష్కతో పాటు విక్రమ్ ప్రభు, చైతన్య రావు మడది, జగపతి బాబు, రాఘవ్ రుద్ర ముల్పూరు, జిష్షు సేన్‌గుప్త వంటి ప్రముఖ నటీనటులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. డ్రగ్ మాఫియాకు వ్యతిరేకంగా ఒక సమాజం సాగించే తిరుగుబాటు ఈ చిత్ర ప్రధాన కథాంశం. మరి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టించనుందో చూడాలి మరి.