- అప్పుడు ఆయన చదివిన పుస్తకాల సంఖ్య 80,001 అవుతుందని ఎద్దేవా
- మూడు నెలల్లో తెలుగులో సోనియా బుక్
- మీడియాతో చిట్‌చాట్‌లో పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్
హైదరాబాద్, వెలుగు: సోనియా గాంధీ ఆత్మకథ పుస్తకాన్ని మాజీ సీఎం కేసీఆర్‌కు అందిస్తానని పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. దీనివల్ల ఆయన చదివిన పుస్తకాల సంఖ్య 80 వేల నుంచి 80,001 కి చేరుతుందని ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. శనివారం మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీలో ఆయన మీడియాతో చిట్‌చాట్ చేశారు. ఈ సందర్భంగా మహేశ్ గౌడ్ మాట్లాడుతూ.. సోనియా ఆత్మకథ పుస్తకాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కూడా పంపిస్తానని తెలిపారు. ప్రస్తుతం ఇంగ్లీషులో ఉన్న ఈ పుస్తకం మరో మూడు నెలల్లో తెలుగులోనూ అందుబాటులోకి వస్తుందని, సామాన్య కార్యకర్తలు సైతం దీనిని చదవాలనే ఆసక్తిని చూపిస్తున్నారని పేర్కొన్నారు.
ఈ క్రమంలోనే రాహుల్ గాంధీపై ప్రశంసలు కురిపించారు. సంపన్న కుటుంబంలో పుట్టినప్పటికీ పేదల సంక్షేమంపై రాహుల్‌కు ఉన్న చిత్తశుద్ధి గొప్పదని కొనియాడారు. గిగ్ వర్కర్ల బిల్లు అమలయ్యే వరకు ఆయన పట్టువదలకుండా కృషి చేసిన తీరు ఆశ్చర్యకరమన్నారు. గతంలో గిగ్ వర్కర్ల ర్యాలీ సందర్భంగా జరిగిన తోపులాటలో తన బైక్ కిందపడిపోవడంతో రాహుల్ కోసం పరుగెత్తాల్సి వచ్చిందని గుర్తుచేసుకున్నారు. తాను కుర్తా-పైజామా ధరించాలని రాహుల్‌ను కోరగా, ఆయన నవ్వుతూ తనకు చాక్లెట్ ఇచ్చారని సరదాగా చెప్పారు. ప్రస్తుతం తానే కాదు, యావత్ దేశం రాహుల్ మత్తులో ఉందని వెల్లడించారు. భారత్ సమిట్ సూపర్ సక్సెస్ అయిందని మహేశ్ గౌడ్ వివరించారు.
