మంచిర్యాల జిల్లాలో నడి రోడ్డుపై ఓ యువకుడిని రాయితో కొట్టి కొట్టి చంపేసిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఘటన వెనక కారణాలు ఏమైనా ఉండొచ్చుకానీ.. జరిగిన తీరు మాత్రం సంచలనంగా మారింది. ఏప్రిల్ 25వ తేదీ ఉదయం.. అందరూ చూస్తుండగా జరిగిన ఈ హత్యపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. జైపూర్ మండలంలోని ఇందారం గ్రామంలో హత్యకు గురైన యువకుడు మహేష్ తల్లి ఆవేదన అంతా ఇంతా కాదు.. నా కొడుకును అన్యాయం పొట్టనపెట్టుకున్నారంటూ కన్నీటి పర్యంతం అవుతుంది.
తన కొడుకు ఎలాంటి తప్పు చేయలేదని, అనవసరంగా పొట్టన పెట్టుకున్నారంటూ వాపోయింది. తన కడుపు కోతకు వాళ్లే కారణమని తెలిపింది. ఇలాంటి పరిస్థితి ఏ కన్న తల్లికి కూడా రావొద్దంటూ కన్నీళ్ల పెట్టుకుంది. మహేష్‌ను చంపిన నలుగురిని తమకు అప్పగించాలంటూ మహేష్ బంధువులు ఆందోళనకు దిగారు. అటు ఈ ఘటనపై పోలీసులు మాట్లాడుతూ పూర్తిగా విచారణ జరిపిన తర్వాతే నిందితులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
మహేష్ హత్య వెనుక ప్రేమ వేధింపులే కారణమని తెలుస్తోంది. ఇందారం గ్రామానికి చెందిన ఓ అమ్మాయికి, మహేష్‌కు గతంలో ప్రేమ వ్యవహారం నడిచిందని తెలుస్తోంది. అయితే యువతికి మరో యువకుడితో వివాహం జరిపించారు. అయినప్పటికీ మహేష్ అ అమ్మాయిని వేధింపులకు గురిచేశాడని తెలుస్తోంది. ప్రేమించుకున్న టైమ్ లో దిగిన ఫొటోలను అమ్మాయి భర్తకు షేర్ చేసి వేధింపులకు గురి చేస్తున్నాడని తెలుస్తోంది.
దీంతో సంవత్సరం క్రితం ఆమె భర్త అత్మహత్య చేసుకన్నాడని సమాచారం. అయితే అప్పటినుంచి ఇంటివద్దే ఉంటున్న ఆ అమ్మాయికి మళ్లీ మహేష్ ఫోన్ ద్వారా అసభ్య మెసేజ్‌లు పెట్టి వేధిస్తుండడంతో భరించలేక అమ్మాయి తల్లిదండ్రులతో పాటుగా సోదరుడితో మాటువేసి ఈరోజు ఉదయం మహేష్‌ను చంపేసినట్లుగా సమాచారం.