కాళేశ్వరం, ధరణి అవినీతిపైసీబీఐతో ఎంక్వైరీ జరిపించాలి : మహేశ్వర్ రెడ్డి

కాళేశ్వరం, ధరణి అవినీతిపైసీబీఐతో ఎంక్వైరీ జరిపించాలి : మహేశ్వర్ రెడ్డి
  • రిపోర్టులు పబ్లిక్ డొమైన్​లో పెట్టాలి

హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం, ధరణిలో జరిగిన అవినీతిపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. సర్కార్​కు చిత్తశుద్ధి ఉంటే ఎంక్వైరీ రిపోర్టులను పబ్లిక్ డొమైన్​లో పెట్టాలని కోరారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతిపై విచారణ జరిపిస్తామని ఎన్నికల ముందు చెప్పిన కాంగ్రెస్.. ఆ దిశగా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. 

అవినీతిపరులను జైలుకు పంపిస్తామన్న కాంగ్రెస్ హామీ ఏమైందన్నారు. బీజేపీ స్టేట్ ఆఫీస్​లో గురువారం మహేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘‘గత బీఆర్ఎస్ సర్కార్ 15 ఎకరాలను హెటిరో పార్థసారథి రెడ్డికి చెందిన సాయి సింధు ట్రస్టుకు లీజుకు ఇచ్చింది. 30 ఏండ్ల పాటు ఎకరానికి రూ.2లక్షల రేటు ఫిక్స్ చేస్తే అప్పట్లో కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం చెప్పింది. లీజును రద్దు చేయాలని డిమాండ్ చేసింది. 

అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ ప్రభుత్వం.. మళ్లీ అదే భూమిని ఎకరానికి కేవలం రూ.5 లక్షలకు పెంచి అప్పగించింది’’అని ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు.. ప్రస్తుత పాలనకు అసలు పొంతనే లేదని విమర్శించారు. అవినీతిపరులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఏక్​నాథ్ షిండేలు ఉన్నారని విమర్శించారు. నాలుగు నెలలు దాటినా ఆరు గ్యారంటీలను అమలు చేయలేదన్నారు.