ఢిల్లీలో ఘనంగా లేడీ ఫైర్ బ్రాండ్, MP మహువా మొయిత్రా రిసెప్షన్‌ వేడుక

ఢిల్లీలో ఘనంగా లేడీ ఫైర్ బ్రాండ్, MP మహువా మొయిత్రా రిసెప్షన్‌ వేడుక

న్యూఢిల్లీ: తృణమాల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ, లేడీ ఫైర్ బ్రాండ్ మహువా మొయిత్రా, బిజు జనతాదళ్ మాజీ ఎంపీ పినాకి మిశ్రా వివాహ బంధం ద్వారా ఒక్కటైన విషయం తెలిసిందే. మంగళవారం (ఆగస్ట్ 5) న్యూఢిల్లీలోని హోటల్ లలిత్‌లో మహువా మొయిత్రా, పినాకి మిశ్రా రిసెప్షన్ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకలో మహువా మొయిత్రా సంప్రదాయ బంగారు ఆభరణాలతో అలంకరించబడిన ఎరుపు రంగు చీరలో దగదగ మెరిసిపోగా.. పినాకి మిశ్రా ఎరుపు రంగు ఎంబ్రాయిడరీ బార్డర్‌తో కూడిన తెల్లటి సాంప్రదాయ దుస్తులు ధరించారు. 

నూతన వధువరులను ఆశ్వీరదించేందుకు పార్టీలకు అతీతంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు రిసెప్షన్ వేడుకకు హాజరయ్యారు. అతిథులను హృదయపూర్వకంగా స్వాగతించిన మెయిత్రి జంట.. వారితో సరదగా గడిపారు. మహువా మొయిత్రి రిసెప్షన్ వేడుకకు కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చైర్ పర్సన్ సోనియా గాంధీ, రాజ్య సభ ఎంపీ సాగరిక ఘోష్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ సుప్రియా సులే, తృణమూల్ ఎంపీ రచనా బెనర్జీ, శివసేన (UBT) ఎంపీ ప్రియాంక చతుర్వేది, రాజ్యసభ ఎంపీ రంజీత్ రంజన్,  తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సాయోని ఘోష్, ఉత్తరప్రదేశ్ మాజీ మంత్రి వీరేంద్ర, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.

అయితే, టీఎంసీ పార్టీ చీఫ్, వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సొంతపార్టీ ఎంపీ మహువా మొయిత్రా రిసెప్షన్‎కు హాజరుకాకపోవడం చర్చనీయాంశంగా మారింది. గత కొన్ని రోజులుగా పార్టీ హైకమాండ్, మహువా మొయిత్రా మధ్య గ్యాప్ వచ్చిందని.. అందుకే ఈ రిసెప్షన్ వేడుకకు దీదీ హాజరు కాలేదని టీఎంసీ పార్టీలో ప్రచారం జరుగుతోంది. కాగా, ఎంపీ మహువా మొయిత్రా, పినాకి మిశ్రా 2025, జూన్ 5న వివాహం చేసుకున్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. పినాకి మిశ్రాకు గతంలో సంగీత మిశ్రాతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. సంగీత మిశ్రాతో విడాకులు తీసుకుని మహువా మొయిత్రాని పెళ్లాడారు పినాకి మిశ్రా.