మున్సిపోల్స్ కు రెడీ ..ఎన్నికలకు సిద్ధమవుతున్న ప్రధాన పార్టీలు

మున్సిపోల్స్ కు రెడీ ..ఎన్నికలకు సిద్ధమవుతున్న ప్రధాన పార్టీలు
  • అభ్యర్థుల ఎంపిక కోసం సీక్రెట్ సర్వేలు
  • వార్డులు, డివిజన్లలో పార్టీల మీటింగులు
  • ఓటరు లిస్టు సవరణలో అధికారులు

మంచిర్యాల, వెలుగు:  మున్సిపల్ ఎన్నికల సందడి మొదలైంది. ఓటరు జాబితా సవరణ, పోలింగ్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణకు ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు జారీ చేయడంతో ఉమ్మడి జిల్లా అధికారులు ఆ పనిలో మునిగిపో యారు. వారం, పది రోజుల్లో ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతుండడంతో ప్రధాన పార్టీలు ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. 

మంచిర్యాల జిల్లాలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు బెల్లంపల్లి, చెన్నూర్, క్యాతనపల్లి, లక్షెట్టిపేట మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. మందమర్రి మున్సిపాలిటీ ఏజెన్సీ ఏరియా పరిధిలో ఉండడం వల్ల గత రెండున్నర దశాబ్దాలుగా అక్కడ ఎన్నికల ఊసే లేదు. ఈసారి కూడా మందమర్రి మున్సిపాలిటీలో ఎలక్షన్స్ జరిగే అవకాశం లేదు. ఇక నిర్మల్​జిల్లాలో నిర్మల్, ఖానాపూర్, భైంసా, ఆసిఫాబాద్​జిల్లాలో ఆసిఫాబాద్, కాగజ్​నగర్, ఆదిలాబాద్​జిల్లాలో ఏకైక మున్సిపాలిటీ అయిన ఆదిలాబాద్​పట్టణంలో ఎన్నికలు జరగనున్నాయి.

అభ్యర్థుల కోసం సీక్రెట్ సర్వేలు

మున్సిపల్ ఎన్నికలను రాష్ట్రంలోని మూడు ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మొన్నటి పంచాయతీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను గెలుచుకొని సత్తా చాటిన కాంగ్రెస్ పార్టీ మున్సిపోల్స్​లోనూ పైచేయి కోసం పావులు కదుపుతోంది. వరుస ఓటములతో కుదేలైన బీఆర్ఎస్ పార్టీ మున్సిపాలిటీల్లో కనీస స్థానాలను దక్కించుకొని తిరిగి పుంజుకోవాలని ఆరాటపడుతోంది. అర్బన్ ఏరియాల్లో కాస్త పట్టున్న బీజేపీ సైతం ఓటు బ్యాంకు పెంచుకోవడానికి మరో అవకాశంగా భావిస్తోంది.

 జిల్లాలో ఇతర పార్టీల ప్రభావం నామమాత్రమే. ఈ క్రమంలో మూడు ప్రధాన పార్టీలు అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తున్నాయి.  గెలుపు గుర్రాల కోసం ఇప్పటికే సీక్రెట్ సర్వేలు నిర్వహిస్తున్నట్టు సమాచారం. ఇంకా రిజర్వేషన్లు ఖరారు కానప్పటికీ ఒక్కో వార్డు,  డివిజన్ కు సామజిక వర్గాల వారీగా ఇద్దరు ముగ్గురు అభ్యర్థులను సెలెక్ట్ చేస్తు న్నట్టు తెలిసింది. 

వార్డుల వారీగా మీటింగులు

మున్సిపల్ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేసేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ లీడర్లు మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో డివిజన్ల వారీగా మీటింగులు నిర్వహిస్తున్నారు. ఆయా వార్డులు, డివిజన్లలో తమ బలాబలాలను అంచనా వేస్తూ, లోపాలను గుర్తిస్తూ పార్టీ యంత్రాంగానికి దిశానిర్దేశం చేస్తున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి పథకాలు, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ లీడర్లు తమ కేడర్​కు సూచిస్తున్నారు.

 ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టి పార్టీ గెలుపు కోసం పనిచేయాలని బీఆర్ఎస్,  బీజేపీ నాయకులు మార్గనిర్దేశం చేస్తున్నారు. రిజర్వేషన్లు అనుకూలిస్తే తమ అదృష్టం పరీక్షించుకోవడానికి మాజీ కౌన్సిలర్లు, చోటామోటా లీడర్లు సిద్ధమవుతున్నారు. దీంతో మున్సిపాలిటీల్లో ఒక్కసారిగా ఎన్నికల వాతావరణం వేడెక్కింది. 

ఓటరు జాబితాకు కసరత్తు

ఓటర్ జాబితా సవరణ, పోలింగ్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పూర్తిచేసి ఈ నెల 10న ఫైనల్ లిస్ట్ రిలీజ్ చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు అధికార యంత్రాంగం కసరత్తు ముమ్మరం చేసింది. మంచిర్యాల మున్సిపాలిటీలో గతంలో 36 వార్డులు ఉండగా నస్పూర్ మున్సిపాలిటీతో పాటు ఐదు గ్రామపంచాయతీలను కలిపి కార్పొరేషన్​గా అప్​గ్రేడ్ చేయడంతో వార్డుల సంఖ్య 60కి పెరిగింది.

 దీంతో ఓటర్ జాబితా తప్పులతడకగా మారింది. ఒక డివిజన్ పరిధిలోని ఓట్లు మరో డివిజన్​లో చేరడం వల్ల గందరగోళం నెలకొంది. ఈ తప్పులను సవరించాలని కోరుతూ వినతులు వస్తున్నాయి. మిగతా మున్సిపాలిటీలోనూ పెద్ద సంఖ్యలో వినతులు  అందుతున్నాయి.