జడ్పీ సీట్లే టార్గెట్గాఅభ్యర్థుల వేట..పలుకుబడి, సామాజికవర్గాల బలాల ఆధారంగా ఎంపిక

జడ్పీ సీట్లే టార్గెట్గాఅభ్యర్థుల వేట..పలుకుబడి, సామాజికవర్గాల బలాల ఆధారంగా ఎంపిక
  • టికెట్ కోసం ఆశావహుల పోటీ
  • స్థానిక ఎన్నికలపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్న పార్టీలు
  • గ్రామాల్లో ఎన్నికల సందడి

ఆదిలాబాద్, వెలుగు:  స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రధాన రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. జడ్పీ పీఠాన్ని కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాయి. ఈ క్రమంలో బలమైన అభ్యర్థులను ఎంపిక చేసి బరిలో దింపేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. కాగా ఒక్కో స్థానం నుంచి ముగ్గురు, నలుగురు టికెట్ ఆశిస్తున్నారు. కాగా పార్టీలు అందరికీ ఓకే చెబుతున్నప్పటికీ.. ఫైనల్​గా పలుకుబడి, సామాజికవర్గ బలాబలాలు దృష్టిలో ఉంచుకొని అభ్యర్థిని ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ 9 నుంచే జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణ మొదలు కానుండగా.. అభ్యర్థుల ఎంపిక పార్టీలకు కత్తిమీద సాములా మారింది. కోర్టు తీర్పు అనుకూలిస్తే రెండు మూడు రోజుల్లో అభ్యర్థులను ప్రకటించేందుకు పార్టీలు సిద్ధమవుతున్నాయి.

కార్యకర్తలకు దిశానిర్దేశం..

ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ప్రధాన పార్టీలు​తమ పార్టీల కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ లీడర్లు ఇప్పటికే మండలాల వారీగా కార్యకర్తలతో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తూ బిజిబిజీగా గడుపుతున్నారు. అభ్యర్థుల ఎంపిక, క్షేత్రస్థాయిలో పర్యటన, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలను కార్యకర్తలతో చర్చిస్తూ సూచనలు చేస్తున్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్​ ఎలాగైన జడ్పీ పీఠం కైవసం చేసుకోవాలని భావిస్తోంది. 

ఆరు గ్యాంరటీలతో పాటు రుణమాఫీ, అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రచారం చేయాలని ఆ పార్టీ​నేతలు సూచిస్తున్నారు. అటు బీజేపీ నేతలు సైతం కేంద్ర ప్రభుత్వం పథకాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లి, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆదిలాబాద్ నియోజకవర్గంలో బీజేపీ ఎమ్మెల్యే ఉండటంతో ఇక్కడ మెజార్టీ స్థానాలను ఎలాగైనా దక్కించుకోవాలని చూస్తున్నారు. బీఆర్​ఎస్​ సైతం పూర్వ వైభవాన్ని సాధించాలని గట్టి పట్టుదలతో ఉంది.

అభ్యర్థుల ఎంపికపై ఫోకస్..

జిల్లాలో రిజర్వేషన్ల ఖరారుతో చాలా మంది రాజకీయ నేతల తలరాతలు మారాయి. పోటీకి నిలబడుదామనుకున్న స్థానంలో రిజర్వేషన్లు తారుమారు కావడంతో బలమైన, సీనియర్ నేతలు సైతం పోటీకి దూరమవుతున్నారు. దీంతో 80 శాతం స్థానాల్లో కొత్తవారికే అవకాశం దక్కుతుండడంతో అభ్యర్థుల ఎంపిక పార్టీలకు ఒకింత తలనొప్పిగా మారింది. దీంతో ఒక్కో స్థానంలో ముగ్గురు, నలుగురు పేర్లను పరిశీలిస్తున్నారు. ఆయా సామాజికవర్గంలో పలుకుబడితో పాటు ప్రజల్లో మంచి గుర్తింపు ఉన్న వారినే బరిలో దింపాలని ప్రధాన పార్టీలు చూస్తున్నాయి. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పార్టీల గుర్తుల మీద పోటీ చేయాల్సి ఉండడంతో పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి. ముఖ్యంగా నాలుగు జిల్లాల్లో జెడ్పీ పీఠం కైవసమే లక్ష్యంగా అభ్యర్థులను ఎంపికకు కస రత్తు జరుగుతోంది.

ఇన్​చార్జి మంత్రి ఫోకస్..

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వహిస్తున్న మొదటి ఎన్నికలు కావడంతో ఈ ఎలక్షన్​పై ఆ పార్టీ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఉమ్మడి ఆదిలాబాద్ ఇన్​చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ఇప్పటికే ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ నేతలతో స్థానిక సంస్థల ఎన్నికలపై సోమవారం హైదరాబాద్​లో సన్నాహక సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని, ఏకాభిప్రాయంతో అభ్యర్థులను ఎంపిక చేయాలన్నారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ స్థానాలన్నీ కైవసం చేసుకునేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. ఎన్నిక ప్రచారం కోసం క్షేత్రస్థాయిలో నేతలు చేపట్టాల్సిన కార్యక్రమాలను, ప్రజలకు తీసుకెళ్లాల్సిన పథకాలు, అభివృద్ధి పనుల గురించి మంత్రి వివరించారు.