
న్యూఢిల్లీ: బెంగాల్‌లో బీజేపీ కార్యకర్తలకు పోలీసులకు మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. రాష్ట్రంలో బీజేపీ నేతలపై జరుగుతున్న వరుస హత్యలను వ్యతిరేకిస్తూ బీజేపీ నిర్వహించిన ’చలో సెక్రెటేరియట్’ ఆందోళనకరంగా మారింది. సెక్రటేరియట్ భవనమైన నబన్నాకు సమీపంలోని బారికేడ్లను దాటుకొని వెళ్లేందుకు బీజేపీ కార్యకర్తలు యత్నించారు. దీంతో బీజేపీ కార్యకర్తలు, పోలీసులకు మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు బీజేపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్‌కు దిగారు. టియర్ గ్యాస్, వాటర్ కెనాన్స్‌ను కూడా ప్రయోగించారు.
‘పోలీసులు మా కార్యకర్తలపై లాఠీచార్జ్ చేస్తున్నారు. ఖిదిర్‌పూర్ వైపు నుంచి మాపై రాళ్లు రువ్వుతున్నారు. ఇది పోలీసులకు కనిపించడం లేదా?’ అని బీజేపీ నేత లాకెట్ ఛటర్జీ చెప్పారు. ఈ ఘటనలో బీజేపీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ రాజు బెనర్జీ, ఎంపీ జ్యోతిర్మయి సింగ్ మహతోతోపాటు పలువురు బీజేపీ నాయకులకు గాయాలయ్యాయి. పోలీసులు నిరసనలను అణచివేయడంతో హౌరా జిల్లాలో బీజేపీ కార్యకర్తలు టైర్లు తగులబెట్టారు.