eSIM పేరుతో మోసం..క్షణాల్లో రూ.4లక్షల కాజేసిన సైబర్ నేరగాళ్లు

eSIM పేరుతో మోసం..క్షణాల్లో రూ.4లక్షల కాజేసిన సైబర్ నేరగాళ్లు

సైబర్ నేరగాళ్లు రూటు మార్చారు. రోజుకో విధంగా మోసాలకు పాల్పడుతున్నారు. ఇప్పుడు eSIM మోసాలకు తెరలేపారు. నేరగాళ్లు మీ  మొబైల్ నంబర్ ను హ్యాక్ చేయడం ద్వారా మీ ఖాతా ఖాళీ చేస్తారు. eSIM  మోసం అంటే ఏమిటీ.. సైబర్ నేరగాళ్లు ఎలా ఈ మోసాలకు పాల్పడతారు.. ఏవిధంగా డబ్బు దొంగిలిస్తారో తెలుసుకుందాం.. 

eSIM మోసం అనేది సైబర్ నేరగాళ్లు అనుసరించే ఒక కొత్త రకం మోసం. ఈ మోసంలో నేరగాళ్లు మీ మొబైల్ నెంబర్‌ని హ్యాక్ చేసి, మీ ఫోన్‌కి రావలసిన కాల్స్, SMSలు, ముఖ్యంగా OTPలను తమకి మళ్లించుకుంటారు. దీని వల్ల మీ బ్యాంక్ అకౌంట్, ఇతర ముఖ్యమైన ఆన్‌లైన్ ఖాతాలను సులభంగా యాక్సెస్ చేసి డబ్బు దొంగిలిస్తారు.

eSIM మోసం ఎలా జరుగుతుంది?

మోసగాళ్లు కస్టమర్ కేర్ ప్రతినిధుల వలె నటిస్తూ మీకు కాల్ చేస్తారు లేదా SMS పంపుతారు. మీ సిమ్ కార్డ్ పనిచేయడం లేదు లేదా  మీ సిమ్‌ని 24 గంటల్లో బ్లాక్ చేస్తామంటూ మేసేజ్ లు పంపించి భయపెడతారు. మీ సిమ్‌ను eSIMలోకి మార్చడానికి కొన్ని దశలు పాటించమని లేదా ఒక కోడ్‌ని షేర్ చేయమని అడుగుతారు. ఈ కోడ్‌ని షేర్ చేస్తే మీ ఫోన్ వాళ్ల చేతికి చిక్కినట్టే. 

కొన్ని సందర్భాల్లో మోసగాళ్లు మీకు ఒక లింక్ లేదా APK ఫైల్‌ని పంపి, దానిని డౌన్‌లోడ్ చేయమని కోరతారు. ఈ ఫైల్‌ని ఇన్‌స్టాల్ చేస్తే, మీ ఫోన్‌లోని ముఖ్యమైన డేటా బ్యాంక్ వివరాలు, పాస్‌వర్డ్‌లు, మొదలైనవి వారికి అందుబాటులోకి వెళతాయి. 

మీ వివరాలను ఉపయోగించి నేరగాళ్లు మీ మొబైల్ నెంబర్‌ను వారి ఫోన్‌లోని eSIMలో యాక్టివేట్ చేసుకుంటారు. దీని వల్ల మీ సిమ్ పని చేయడం ఆగిపోతుంది.

డబ్బు ఎలా దొంగిలిస్తారంటే..

మీ ఫోన్ నెంబర్‌పై వారికి పూర్తి నియంత్రణ ఉంటుంది కాబట్టి మీ బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు బదిలీ చేయడానికి అవసరమైన OTPలు వారికి వస్తాయి. దీనితో పాటు మీ సోషల్ మీడియా ఖాతాలను కూడా వారు యాక్సెస్ చేయగలరు.

eSIM మోసాన్ని అరికట్టేందుకు కొన్ని చిట్కాలు..

  • టెలికాం కంపెనీల నుంచి కాల్ చేస్తున్నామని చెప్పే అపరిచితుల కాల్స్‌కు స్పందించవద్దు. 
  • మీ సిమ్‌ గురించి ఏవైనా సమస్యలు ఉంటే నేరుగా మీ నెట్‌వర్క్ ప్రొవైడర్‌ను సంప్రదించాలి.  
  • మీ ఫోన్‌కి వచ్చిన ఏ కోడ్‌ని కూడా ఇతరులతో షేర్ చేయొద్దు. 
  • ఏ టెలికాం కంపెనీ కూడా కస్టమర్ల నుంచి ఈ విధంగా కోడ్ అడగదు.
  • అపరిచిత వ్యక్తులు లేదా అనుమానాస్పద SMSలు, వాట్సాప్ మెసేజ్‌లలో వచ్చే లింకులను క్లిక్ చేయొద్దు. 
  • OTPలను ఎప్పుడూ చెప్పవద్దు.. బ్యాంక్ లావాదేవీలకు సంబంధించిన OTPలను ఎవరికీ చెప్పొద్దు.
  • ఒకవేళ మీ సిమ్ కార్డ్ హఠాత్తుగా పని చేయడం ఆగిపోతే వెంటనే మీ టెలికాం ప్రొవైడర్‌ను సంప్రదించి విషయం ఏమిటో తెలుసుకోవాలి. 

ఈ జాగ్రత్తలు పాటిస్తే eSIM మోసం నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. ఏదైనా మోసం జరిగినట్లు అనుమానం ఉంటే వెంటనే మీ టెలికాం సర్వీస్ ప్రొవైడర్‌తో పాటు పోలీసులకు కూడా ఫిర్యాదు చేయాలి. మీరు 'సంచార్ సాథీ' పోర్టల్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు.