ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

19న కార్తీక దీపోత్సవం

కరీంనగర్ టౌన్, వెలుగు: పట్టణంలోని టీటీడీ కల్యాణ మండప ఆవరణలో ఈనెల 19న కార్తీక దీపోత్సవం నిర్వహిస్తున్నట్టు  బీజేపీ సీనియర్ ‌‌ ‌‌ నేత, కార్తీకదీపోత్సవ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు పొల్సాని సుగుణాకర్ రావు తెలిపారు. టీటీడి కల్యాణమండపంలో దీపోత్సవ పోస్టర్​ను బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలో చీకటిని తొలగించి మంచి వెలుతురు నింపుకోవడమే దీపోవ్సత లక్ష్యమని చెప్పారు. బ్రహ్మశ్రీ పురాణం మహేశ్వర శర్మతో పాటు ఇతర ప్రవచనాలు ఉంటాయని చెప్పారు. ప్రజలందరూ ఉత్సవంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో హరికుమార్ గౌడ్, ములుగూరికిశోర్ శంకర్, భూపతిరావు, మహిపాల్, ఓదెలు, నందు పాల్గొన్నారు.

రూల్స్​ పాటించని 13 వెహికల్స్​ సీజ్

కోరుట్ల, వెలుగు: పట్టణంలో ఆర్టీసీ , రవాణా అధికారులు బుధవారం ప్రైవేట్​ వెహికల్స్​ను తనిఖీ చేశారు. కోరుట్ల-, వేములవాడ, జగిత్యాల రూట్లో సరైన డాక్యుమెంట్లు లేకుండా, లిమిట్​కు మించి ప్యాసింజర్లతో వెళ్తున్న ఆటో, జీపు, టాటాఏస్​లను చెక్​ చేశారు. రూల్స్​ పాటించని 13 వాహానాలను సీజ్​ చేసి, రూ.1.5 లక్షల జరిమాని విధించినట్టు ఎంవీఐ రంజిత్​కుమార్​ తెలిపారు. కార్యక్రమంలో ఆర్టీసీ ఎస్​టీఐ జీపీ సింగ్ నాయక్ ,సెక్యూరిటీ హెడ్ గార్డ్ మహేందర్ రెడ్డి , కార్గో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ రమేశ్ పాల్గొన్నారు. 

వీటీడీఏ పనుల్లో వేగం పెంచాలి

వేములవాడ, వెలుగు: వీటీడీఏ అభివృద్ది పనుల్లో వేగం పెంచాలని ఎమ్మెల్యే రమేశ్​ బాబు అధికారులను ఆదేశించారు. వేములవాడ టెంపుల్ అతిథి గృహంలో పనుల పురోగతి పై ఎమ్మెల్యే, కలెక్టర్ అనురాగ్ జయంతి, వీటీడీఏ వైస్ ‌‌ చైర్మన్ ‌‌ పురుషోత్తం రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు. గుడి చెరువు బండును పూర్తి చేసి సుందరీ కరణ చేపట్టాలన్నారు . బండ్ వద్ద 800 మీటర్ల రిటైనింగ్ వాల్ పూర్తయిందని, భక్తులు పుణ్య స్నానాలు ఆచరించేందుకు బాతింగ్ ఘాట్ లను ఏర్పాటు చేయాలన్నారు. పట్టణానికి ఈశాన్యంలో బస్టాండు నిర్మాణం చేపట్టాలని, ప్రాంగణం సమీపంలో 20 ఎకరాల భూ సేకరణను పూర్తి చేసి పనులను ప్రారంభించేందుకు ప్రణాళికల రూపొందించాలన్నారు. పట్టణం నుంచి కోరుట్ల బస్టాండ్ జంక్షన్ వరకు, వేములవాడ నుంచి వట్టెంల వరకు చేపట్టనున్న రోడ్డు విస్తరణ అభివృద్ధి పనులను పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్ పర్సన్ రామతీర్థపు మాధవి, వీటీడీఏ సెక్రెటరీ భుజంగ రావు, ఆలయ ఈఓ కృష్ణ ప్రసాద్, ఆర్డీఓ పవన్ కుమార్ పాల్గొన్నారు. 

కరీంనగర్​ను బ్యూటిఫుల్ సిటీగా మారుద్దాం
మేయర్ యాదగిరి సునీల్ రావు

కరీంనగర్ కార్పొరేషన్,వెలుగు: కరీంనగర్ ను బ్యూటిఫుల్ సిటీగా మార్చుకుందామని మేయర్ యాదగిరి సునీల్ రావు అన్నారు. 54వ డివిజన్ లో బుధవారం పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. సిటీ వ్యాప్తంగా రూ.10కోట్ల తో 4 ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు అందుబాటులోకి తెస్తున్నామన్నారు. కశ్మీర్ గడ్డ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులను ప్రారంభించాలని అధికారులకు ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్ఈ నాగమల్లేశ్వర్ రావు,డీఈ మసూద్ అలి,ఈఈ లు మహేందర్, కిష్టప్ప, లచ్చిరెడ్డి,కార్పొరేటర్లు, తదితరులు పాల్గొన్నారు. 

వరి కొనుగోళ్లను వేగవంతం చేయాలి

జగిత్యాల, వెలుగు : జిల్లాలో వరి కొనుగోళ్లను వేగవంతం చేయాలని బీజేపీ నియోజకవర్గ నాయకులు పన్నాల తిరుపతి రెడ్డి డిమాండ్​ చేశారు. జిల్లా కేంద్రంలోని చల్గల్ ప్రధాన వ్యవసాయ మార్కెట్ లో వడ్ల కొనుగోళ్ల కేంద్రాలను బుధవారం సందర్శించారు. వరి ధాన్యాన్ని శుభ్రపరిచే యంత్రాల కొరత ఉందని, ఆధునిక యంత్రాలు అందుబాటులో ఉన్నప్పటికీ ప్రభుత్వం అందుబాటులోకి తేవడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో రైతు నాయకులు కొట్టాల మోహన్ రెడ్డి, గడ్డం చంద్రశేఖర్ రెడ్డి, కోల నారాయణ, బందెల మల్లయ్య పాల్గొన్నారు.

ఎంపీ సంజయ్​ను కలిసిన తపస్ బాధ్యులు

కరీంనగర్ టౌన్, వెలుగు: ఎంపీ బండి సంజయ్ ను తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్) జిల్లా బాధ్యులు బుధవారం స్థానిక ఆఫీస్​లో కలిసి, సమస్యల్ని వివరించారు. స్కూళ్ల మెయింటెనెన్స్ నిధులు మంజూరు , స్కావెంజర్ ఏర్పాటు సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఎంపీ సానుకూలంగా స్పందించినట్టు చెప్పారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష కట్ట రాజేశ్వర్ ,ప్రధానకార్యదర్శిగన్నమనేని రంగారావు,తదితరులు పాల్గొన్నారు.

అలరించిన ఫ్యాన్సీ డ్రెస్​ కాంపిటిషన్​

పట్టణంలోని భగత్​నగర్​లోని భగవతీ స్కూల్​లో విద్యార్థులకు ఫ్యాషన్​ డ్రెస్​ కాంపిటీషన్​ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఫ్యాన్సీ డ్రెస్సులతో ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్​ కళావతి, భూమ్​రావ్​, శ్రీలత, శిరీష, కల్యాణి పాల్గొన్నారు.