సింగరేణి కార్మికులను మరింత చైతన్యపర్చండి

సింగరేణి కార్మికులను మరింత చైతన్యపర్చండి
  •  సంస్థను అగ్రస్థానంలో నిలపండి
  • అధికారుల సంఘం నేతలకు సీఎండీ సూచన  

హైదరాబాద్‌‌, వెలుగు:  సింగరేణి అభివృద్ధిలో కార్మికులతో పాటు అధికారులది కూడా అత్యంత కీలకమైన పాత్ర అని సింగరేణి చైర్మన్‌‌ అండ్‌‌ మేనేజింగ్‌‌ డైరెక్టర్‌‌ (సీఎండీ) ఎన్‌‌. బలరామ్  అన్నారు. కార్మికులను మరింత చైతన్యపరిచి సంస్థను అగ్రస్థానంలో నిలపాలని అధికారుల సంఘం నేతలకు సూచించారు. బుధవారం హైదరాబాద్ సింగరేణి భవన్ లో సింగరేణి వ్యాప్త అధికారుల సంఘం (కోల్ మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా) నాయకులతో సీఎండీ మాట్లాడారు.  కంపెనీ ఉత్పత్తి వ్యయం, బొగ్గు అమ్మకం, ప్రస్తుతం కంపెనీ ఎదుర్కొంటున్న ఆర్థిక పరిస్థితులను కూలంకశంగా వివరించారు.

 పోటీ మార్కెట్లో సంస్థ నిలదొక్కుకోవాలంటే ఉత్పాదకత మరింత పెంచుకోవడానికి అధికారులు, కార్మికులు పూర్తి పని గంటలు సద్వినియోగం చేయాలని కోరారు. కంపెనీకి సంబంధించిన అన్ని విషయాలు ప్రతి కార్మికుడికి తెలియాలన్న ఉద్దేశంతోనే మల్టీ డిపార్ట్మెంట్ టీమ్ లను ఏర్పాటు చేసి ప్రతి మైన్‌‌కి పంపిస్తున్నామని తెలిపారు. వీటిని మరింత విస్తృత పరచాల్సిన అవసరం ఉందన్నారు.

 కంపెనీని లాభదాయకంగా నడిపిస్తే కార్మికులతో పాటు అధికారులకు కూడా తగిన ప్రోత్సాహకాలు ఇవ్వటానికి రెడీగా ఉన్నామని బలరామ్  పేర్కొన్నారు. ఈ సందర్భంగా అధికారుల సంఘం కొత్త అధ్యక్షుడు లక్ష్మీపతి గౌడ్, జనరల్ సెక్రటరీ పెద్ది నరసింహులు ఇతర నేతలు చైర్మన్ ను ఘనంగా సన్మానించారు.