ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధం

ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధం

న్యూఢిల్లీ, వెలుగు: ఎస్సీ వర్గీకరణ అంశం రాజ్యాంగ వ్యతిరేకమని పీవీ రావు మాల మహానాడు అధ్యక్షుడు పండు అశోక్ కుమార్ అన్నారు. అన్నదమ్ములుగా ఉన్న మాల, మాదిగలను విడగొట్టి రాజకీయ పార్టీలు పబ్బం గడుపుకోవాలని చూస్తున్నాయని ఫైర్ అయ్యారు. ఎస్సీ వర్గీకరణ ప్రయత్నాలకు వ్యతిరేకంగా మంగళవారం ఢిల్లీలోని జంతర్ మంతర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పీవీ రావు మాలమహానాడు ఆధ్వర్యంలో భారీ ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో మాలమహానాడు కార్యకర్తలు తరలివచ్చారు. 

అస్సాం ఎంపీ నవీన్ కుమార్ షర్మియా పాల్గొని మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి పొందాలనే ఉద్దేశంతోనే మంద కృష్ణ మాదిగ నిర్వహించిన మాదిగల విశ్వరూప మహాసభకు ప్రధాని మోదీ హాజరయ్యారని విమర్శించారు. సుప్రీంకోర్టు పరిధిలో ఉన్న ఎస్సీ వర్గీకరణ అంశంపై మాట్లాడిన ప్రధాని.. అనంతరం ఎస్సీ వర్గీకరణపై కమిషన్ వేయడం దారుణమని వాపోయారు. ఎన్నికల్లో లబ్ధి కోసం ఒక వర్గానికి కొమ్ముకాయడం అంటే, మిగతా వర్గాలు విస్మరించడమేనని మండిపడ్డారు. ఇప్పటికైనా ఎస్సీ వర్గీకరణ ప్రయత్నాలను ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయన హెచ్చరించారు.