కవర్ స్టోరీ..కేరళ స్టోరీ

కవర్ స్టోరీ..కేరళ స్టోరీ

కొన్నేళ్లుగా ఇండియా వ్యాప్తంగా సినిమా ప్రేమికులు మలయాళం సినిమాల మీద విపరీతమైన ఆసక్తి చూపిస్తున్నారు. గతంతో పోలిస్తే ఓటీటీ ఫ్లాట్​ఫామ్స్​లో రిలీజ్​ అయ్యే మలయాళ సినిమాలకు వ్యూస్​ బాగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా కరోనా వచ్చినప్పటి నుంచి ఓటీటీలో మలయాళ సినిమాకు డిమాండ్​ పెరిగింది. ఇంతకు ముందు ఎవరూ పెద్దగా పట్టించుకోని మలయాళ సినిమాలను అక్కడి డైరెక్టర్స్‌‌, యాక్టర్స్‌‌ టాలెంట్, క్రియేటివిటీ, డిఫరెంట్​ కథలు మెయిన్​ స్ట్రీమ్​కి తీసుకొచ్చాయి. మలయాళ సినిమాలకి డిమాండ్​ పెరిగేలా చేశాయి. అక్కడి యాక్టర్స్​, డైరెక్టర్స్​కి అవకాశాలను తెచ్చిపెట్టాయి. ఇంతకీ మలయాళం సినిమాల్లో ఏముంది? ఎందుకు అంతలా ఆదరిస్తున్నారు? 

సినిమా చూసాను. చాలా బాగుంది.ఎక్కడ? ఏ ఓటీటీలో?గమనించండి.. వాళ్లు అడుగుతోంది. ఏ థియేటర్ లో కాదు.. ఏ ఓటీటీలో అని... మనం రోజూ వారీ వినే సంభాషణే ఇది. వాట్సాప్ చాటే ఇది. ఓటీటీలో వచ్చే చాలా సినిమాలు బాగున్నాయని మన వాళ్లు  ఫిక్స్​ అయిపోయి.. చూడటానికి రెడీ అయిపోతున్నారనేది గత కొంతకాలంగా అందరికీ అర్ధమవుతున్న విషయం. అంతలా ఓటీటీలో జనం ఎగబడి చూస్తున్నారు కదా అని ఆ ఓటీటీని టార్గెట్ చేస్తూ తెలుగు సినిమాలు తీస్తే కొనే నాధుడు లేడు. ఎన్నో సినిమాలు ఓటీటీ గుమ్మాల దగ్గర  చివరకు రెవెన్యూ షేరింగ్  మోడల్​కు కూడా నోచుకోక వెయిట్ చేస్తున్నాయి. మరి ఓటీటీలో చూస్తున్నవి ఏ  సినిమాలు అంటే....మలయాళం అని తడుముకోకుండా చెప్పేయొచ్చు.  

ఇవాళ మలయాళంలో పెద్దగా పేరు లేని ఆర్టిస్టులు కూడా మన వాళ్లకు పరిచయమే. అది ఎంతగా అంటే వాళ్లని ఇట్టే గుర్తు పట్టేసేంత. ఇదంతా చూస్తుంటే ఏమిటీ మలయాళం పిచ్చి, పొరుగింటి పుల్లకూరపై మోజా అంటే ...అదీ కాదు. ఎందుకంటే పొరుగు భాషలు మనకు చాలా ఉన్నాయి..మలయాళం ఒకటే కాదు..కదా..  పేరున్న ఓటీటీ సంస్థలు సైతం మలయాళంలో వస్తున్న సినిమాలపై ఓ కన్నేస్తున్నాయి. ఎక్కువ రేటుకు కొంటున్నాయి. కేవలం మోహన్ లాల్ లేదా మమ్ముట్టి వంటి స్టార్స్ కు మాత్రమే ఆ మార్కెట్ అనుకుంటే పొరపాటు.  ఫహద్ ఫాజిల్, పృథ్విరాజ్ సుకుమారన్, దుల్కర్ సల్మాన్, టోవినో థామస్ వంటి స్టార్స్ కు ఇక్కడ ఓటీటీలలో బ్రహ్మరథం పడుతున్నారు.

మీకు గుర్తుందో లేదో  ఒకప్పుడు మలయాళం సినిమాలు అంటే అడల్ట్​ సినిమాలు. ఆ సినిమాలను ఇక్కడ బి–గ్రేడ్ ప్రొడ్యూసర్స్ డబ్ చేసి డబ్బులు చేసుకునేవాళ్లు. మిగతావాళ్లు వాటిని పట్టించుకునే వారే కాదు. కానీ గత కొన్నాళ్లుగా కేరళ సినిమాలు అద్భుతాలు సృష్టిస్తున్నాయి. మలయాళ సినిమా అంటే అడల్ట్​ సినిమా అనుకునే స్థితి నుంచి ఇంటలెక్చువల్​ సినిమా అనే స్థాయికి వచ్చాయి. అన్ని జోనర్స్ లోను తక్కువ బడ్జెట్​లోనే భారీ హిట్ సినిమాలు రూపొందిస్తుండటం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.అందుకు  కరోనా టైం ఆజ్యం పోసిందని చెప్పాలి.  ఆ టైంలో థియేటర్స్ క్లోజ్ అయ్యి..  ఓటీటీలకు ఊపిరి పోసింది. ఒక తెలుగు ఓటీటీలో అయితే కేవలం మలయాళ డబ్బింగ్ సినిమాలకే ప్రయారిటీ ఇచ్చారు చాలాకాలం.

మొదట్లో ఎక్కువ క్రైమ్ థ్రిల్లర్స్ వచ్చాయి. తర్వాత మెల్లిగా హ్యూమన్ యాంగిల్​ని ఎలివేట్ చేయటం, సహజంగా మన చుట్టూ జరుగుతున్న సంఘటనలను తెరకెక్కించటంతో అవి మనవాళ్లకు నచ్చటం మొదలయ్యాయి. ఇంట్లో ఫ్యామిలీ కూర్చుని ఫ్రీగా (ఓటీటీకు డబ్బు కట్టినా) చూస్తున్నాం అని ఫీలింగ్​కు హీరోలు అవసరం లేకపోయింది. దాంతో  మలయాళంలో ఇంత మంచి సినిమాలు వస్తున్నాయా? అని మనవాళ్లంతా  ఆశ్చర్యపోయారు. వాస్తవానికి   మలయాళం నుండి పాన్ ఇండియా మూవీస్ రావటం లేదు. అయితే కంటెంట్ పరంగా, స్క్రిప్ట్ పరంగా ది బెస్ట్ మూవీస్ అందిస్తోంది

ఆ సినిమా ఇండస్ట్రీ. ఈ మధ్యకాలంలో... ‘మాలికాపురం, ముకుందన్ ఉన్ని అసోసియేట్స్, నాన్ పాకల్ నేరతు మయక్కమ్, తంకం, పడవెట్టు, జనగణమన, ఒరు తెక్కన్ తల్లు కేస్, సెల్యూట్, వండర్ విమెన్, జయజయజయ జయహే, రొమాంచం, ప్రణయ విలాసం, ఖాళీ పర్స్ బిలియనీర్స్, పురుష ప్రేతమ్’ లాంటి సినిమాలు మనవాళ్లకు తెగ నచ్చేసాయి. వీటన్నిటిలో ఉన్నది కేవలం రొటీన్​ని బ్రేక్ చేసే కొత్త కాన్సెప్టు మాత్రమే. ఈ మలయాళం సినిమాలపై ఆసక్తి ఎంతదాకా వెళ్లిందంటే.. తెలుగులో డబ్బింగ్ చేయకపోయినా ఇంగ్లీష్ సబ్ టైటిల్స్​తో చూడటానికి జనాలు బాగా ఇష్టపడుతున్నారు.

అయితే ఇక్కడా ఓ తలనొప్పి ఉంది.  మలయాళంలో ఎప్పుడో రిలీజై యావరేజ్​గా అనిపించుకున్న సినిమాలను తెలుగులో కావాలని మరీ డబ్ చేసి ఓటీటీలలో రిలీజ్ చేస్తున్నారు. ఆ మధ్య వరస పెట్టి వచ్చిన చాలా సినిమాలు అలా వచ్చినవే. అయితే అలవాటు పడ్డ ప్రాణం కదా అందుకే ఆడియెన్స్ కూడా ఆ సినిమాల మీద ఆసక్తి చూపిస్తూ... వాటిని తెగ చూసేస్తున్నారు.

రియలిస్టిక్ మూవీస్ అక్కడే ఎందుకు?

ఇక్కడే మరో ప్రశ్న వేసుకోవాలి. ఇరాన్​లోనే చిన్న పిల్లల మీద అద్భుతమైన సినిమాలు ఎందుకు వచ్చాయి? వస్తున్నాయి? అంటే అవసరం అని చెప్పొచ్చు. కమర్షియల్ ఎలిమెంట్స్ తీసే సినిమాలకు చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి అక్కడ. అందుకే క్రియేటివిటీ పిల్లల వైపు టర్న్ అయ్యింది ఓ టైంలో. అప్పుడే అద్బుతాలు జరిగాయి. అవసరమే అన్నిటికీ మూలం. అనేక సృజనాత్మక విషయాలకు నాంది అవుతుంది. మలయాళంలో నుంచి  ఎంత మంచి లేదా గొప్ప  సినిమాలు వస్తున్నా మలయాళం సినిమా మార్కెట్ మాత్రం పెరగట్లేదు. రీసెంట్​గా  దీనిపై మలయాళం స్టార్ హీరో టోవినో థామస్ కొన్ని కామెంట్స్ చేశారు. టోవినో తాజాగా ‘2018’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. 2018లో కేరళలో వచ్చిన వరదల మీద ఈ సినిమాని తీశారు. ఈ సినిమా హిట్​ అయింది. ఈ సినిమా ప్రమోషన్స్​లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో టోవినో థామస్ మాట్లాడుతూ ‘‘మా సినిమాల బడ్జెట్ బాలీవుడ్​లో పెద్ద సినిమాల ప్రమోషన్స్​కి అయ్యే బడ్జెట్ కంటే కూడా తక్కువే. అదే మమ్మల్ని ఎక్కువ కష్టపడేలా చేసింది. సెట్​లో ఎక్కువ పనిచేసేలా చేసింది.

తక్కువ రెమ్యునరేషన్స్ తీసుకుంటాం. అంత కష్టపడితేనే ఇలాంటి సినిమాలు వస్తున్నాయి. అలాగే మేము ప్రమోషన్స్​కి ఎక్కువ డబ్బు కేటాయించం. సినిమా బాగుంటే అదే ప్రజల్లోకి వెళ్తుంది అని నమ్ముతున్నాం” అని కొన్ని ఆసక్తికర  వ్యాఖ్యలు చేశాడు. టోవినో థామస్ చేసిన ఈ వ్యాఖ్యలే రియలిస్టిక్​ మూవీస్​ మలయాళం ఇండస్ట్రీలోనే ఎందుకు అనే ప్రశ్నకు సమాధానం. వాళ్లకి క్రియేటివిటీ చూపటం తప్పించి వేరే దారి లేదు. మార్కెట్ తక్కువ. దాంతో బడ్జెట్ లేదు. బాలీవుడ్, టాలీవుడ్​లు లగ్జరీ ఇండస్ట్రీలు. మార్కెట్, డబ్బూ రెండూ ఎక్కువ. ఇలాంటి పరిస్థితుల్లో మిగతా అంశాలకు చోటు ఎక్కడుంది. ఇదే విషయం గురించి అనురాగ్ కశ్యప్  మాట్లాడుతూ ‘‘మలయాళ సినిమాని గమనిస్తే.. కథ డిమాండ్ చేస్తే తప్ప రాష్ట్రం దాటరు. మరీ అవసరమైతే తప్ప దేశం దాటరు. తమ చుట్టుపక్కల లొకేషన్స్ లోనే షూటింగ్స్​ పూర్తిచేస్తారు. పెద్ద సెట్స్ వేయని కథలే ఎంచుకుంటారు. స్టూడియోలు, గెస్ట్ హౌసుల్లో సీన్స్ నడిచిపోతుంటాయి. అందుకే సినిమా బడ్జెట్‌‌ఎప్పుడూ అదుపులోనే ఉంటుంది. నిజానికి అదే సరైన పద్ధతి.

చిన్న బడ్జెట్‌‌ సినిమాలయితే ఎక్కువ ఎక్స్​పరిమెంట్స్​ చేయడానికి ఉపయోగపడుతుంది. బడ్జెట్ ఎప్పుడైతే పెంచుకుంటూ పోతామో అప్పుడు లిమిటేషన్స్ ఏర్పడతాయి” అన్నాడు.ఈ కారణాలన్నింటితో పాటు వాళ్లకున్న పెద్ద అడ్వాంటేజ్ అక్కడ చదువుకున్న జనం ఎక్కువ ఉండటం. చదువుకున్న జనం కేవలం నరాలను ఉద్రేకపరిచే సినిమాలను మాత్రమే ఇష్టపడరు. అందుకే మొదటి నుంచీ మలయాళ పరిశ్రమలో మంచి రైటర్స్ ఉంటూ వచ్చారు. మలయాళంలో వచ్చిన చిన్న సినిమాలు డబ్బింగ్ కాకపోవడం వల్ల ఆ సినిమాలన్నీ మనం చూడలేదు. కానీ ఇంతకుముందు కూడా మంచి సినిమాలు చాలానే వచ్చాయి. మలయాళ ప్రేక్షకులు భారీ సినిమాలు, హీరోయిజం ఉన్న మాస్ ఫిల్మ్ లు కావాలనుకున్నప్పుడు మన హీరోలను సైతం ఆదరించారు. ఆదరిస్తున్నారు. దాంతో అక్కడ సినిమా అంటే దాదాపు చిన్న సినిమా.

అదీ కేరళ జీవితాన్ని ప్రతిబింబించేది అయి ఉండాలి అన్న ప్రాతిపదికన సినిమాలు చేస్తూ వచ్చారు. అలాగే ఓ టైంలో కేరళ సినిమాలన్నీ వాళ్ల సాహిత్యం, నవలల నుంచి పుట్టుకొచ్చాయి. వైకోమ్, మొహమ్మద్ బషీర్, ఎమ్.టి. వాసుదేవన్ నాయర్, ఎస్​.కె. పొట్టెక్కట్, ఎమ్​ ముకుందన్, కమలా సూరయ్య, తకళి శివశంకర పిళ్లై ఇలా ఎందరో మలయాళ రచయితల ప్రభావం అక్కడ సినిమాపై ఉంది.నోస్టాలజీ నే నావల్టీమరో విషయం మలయాళ సినిమాల్లో రెగ్యులర్ గా  కనపడుతుంది. అది నోస్టాలజీ. ప్రేమమ్ వంటి సినిమాలు చూసి మనం గత జ్ఞాపకాల్లోకి వెళ్లిపోతాం. ఇలాంటి స్క్రీన్​ప్లే ఫిల్మ్ లు అక్కడ వస్తూనే ఉంటాయి. ఇక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్​తో వచ్చే సినిమాలకు అయితే లోటే లేదు.

‘ఓం శాంతి ఓషానా, ఉస్తాద్ హోటల్, ఛార్లీ, బెంగుళూరు డేస్, విక్రమాదిత్య, యాక్షన్ హీరో బిజు, సాల్ట్ అండ్ పెప్పర్​’ వంటి చిన్న సినిమాల ప్రయాణం కొనసాగుతూనే ఉందక్కడ . మోహన్ లాల్, మమ్ముట్టి వంటి స్టార్స్ కూడా కాన్సెప్టు ఓరియెంటెడ్​గా నడిచే సినిమాలు చేస్తున్నారు.  ‘దృశ్యం,  రొర్​ష్యాక్​​’ వంటి సినిమాలు అలా వచ్చి హిట్​ అయినవే.  మలయాళ సినిమా కథల్లో  ఎక్కువగా మనకు కనపడేది పర్సనల్​ స్ట్రగుల్స్​, సామాన్యుడి డైలమాలు. ‘powerful vs. powerful’అనే కాన్​ఫ్లిక్ట్స్ మనకు అంతగా కనపడదు. తెరపై కనపడే హీరోలు మనమే. మన సమస్యలు, సంతోషాలు గురించే మాట్లాడుతున్నారు అనిపించేలా చేయటమే వారి సక్సెస్.

కొన్ని సర్వేలు లేదా లెక్కల్లో తేల్చింది ఏమిటంటే...46% మలయాళ సినిమాలు రీజనల్ ఐడెంటిటీ, కల్చర్ చుట్టూ తిరుగుతాయి. అదే మన తెలుగు, తమిళంకు వచ్చేసరికి 32% , కన్నడ అయితే 8% కనపడుతుంది. అర్బన్ సెట్టింగ్స్, ఫారిన్ లొకేషన్స్ తరచుగా కనపడవు. ఇలాంటివన్నీ మలయాళ సినిమాకు ఓ ప్రత్యేకతను తెచ్చిపెట్టాయి.    

కథలు విలక్షణంగా..

వాస్తవానికి మలయాళ కథలు విలక్షణంగా ఉంటాయా? అంటే.. ఉంటాయి కాబట్టే జనాలకు నచ్చుతున్నాయి. కొన్నేండ్ల నుంచి దక్షిణాది​ సినిమా ఇండస్ట్రీ బాగా డెవలప్​ అవుతోంది. అందులోనూ తెలుగు సినిమా ఇండస్ట్రీకి బాగా గుర్తింపు వస్తోంది. మన సినిమాలు పాన్​ ఇండియా వైడ్​గా ఆడుతున్నాయి. కాకపోతే.. వాటిలో భారీ బడ్జెట్​ సినిమాలే ఎక్కువ. అయితే.. చిన్న సినిమాలకు ఓటీటీల్లో పాన్​ ఇండియా వైడ్​గా వ్యూస్​ వస్తున్నాయి. కానీ.. ఈ కేటగిరీలో మాత్రం మలయాళ సినిమాకు ఎక్కువ క్రేజ్ ఉంటోంది. తెలుగు, తమిళ సినిమాల్లా కాకుండా మలయాళ సినిమాలకు పెద్దగా బడ్జెట్​ ఉండదు. కాబట్టి.. వాళ్లకున్న బడ్జెట్​తోనే క్రియేటివ్​గా సినిమాలు తీస్తుంటారు. అందుకే కొత్త కథలు, కథాంశాలు కనిపిస్తుంటాయి. అవే మలయాళ సినిమాల విజయానికి పునాదులు వేశాయి. వాళ్ల సినిమాల్లో కథే హీరో.  సినిమాను కథే నడిపిస్తుంది.

అంతెందుకు హీరోకు పెద్దగా ఎలివేషన్లు కూడా ఉండవు. అందుకే మలయాళంలో అసలు హీరోనే లేకుండా వచ్చిన సినిమాలు కూడా చాలానే ఉన్నాయి. కొన్ని లీడ్ రోల్స్​ కథను నడిపిస్తాయి. పైగా ఎక్కువ మలయాళ సినిమాల్లో కథలు వాస్తవికతకు దగ్గరగా ఉంటాయి. నమ్మలేని విషయాలను నమ్మించే జిమ్మిక్కులు చేయడం చాలా తక్కువ. అందుకే మలయాళ సినిమాల కంటే కూడా వాటిలోని కథలకు ఎక్కువగా కనెక్ట్‌‌ అవుతారు ప్రేక్షకులు. కుంబలాంగి నైట్స్​, కప్పేలా, పురుష ప్రేతమ్.. ఈ మధ్య వచ్చిన రోమాంచం సినిమాలన్నీ ఈ కోవకు చెందినవే. 

ప్యాండెమిక్​లో బాగా పెరిగింది 

మలయాళ చిత్ర పరిశ్రమ చాలా చిన్నది. చాలా సినిమాలు తక్కువ బడ్జెట్​తో తీస్తారు. వాటిలో రిచ్​ కంటెంట్​ ఉన్నా.. ఇండియా వైడ్​గా రిలీజ్​ చేసేంత బడ్జెట్​ ఉండదు. అందుకే వాళ్లు ఎక్కువగా ఓటీటీని నమ్ముకుంటారు. అంటే సినిమాలను డబ్​ చేసి ఓటీటీలో రిలీజ్​ చేస్తుంటారు. అలా కరోనా టైంలో కూడా రిలీజ్​ అయ్యాయి. థియేటర్లకు వెళ్లి సినిమాలు చూడలేని వాళ్లు తెలుగు, తమిళ సినిమాలతోపాటు మలయాళ సినిమాలు చూడడం కూడా మొదలుపెట్టారు. వాస్తవానికి ఇండియాలో మలయాళం ఒక మైనారిటీ భాష. అయినా.. ఓటీటీ వల్ల ఇండియా అంతటా  మాలీవుడ్‌‌ సినిమాలు చూస్తున్నారు. భాష అర్థం కాకపోయినా సబ్​టైటిల్స్​ చదువుతూ కొందరు చూశారు.

ఓటీటీలో వాళ్ల సినిమాలకు మంచి రెస్పాన్స్​ రావడంతో రెట్టించిన ఉత్సాహంతో సినిమాలు తీశారు. 2021లో దాదాపు 45 మలయాళ సినిమాలు డైరెక్ట్‌‌గా ఓటీటీలో రిలీజ్​ అయ్యాయి. రిచ్​, ఒరిజినల్ కంటెంట్‌‌, ఆశ్చర్యపరిచే పర్ఫార్మెన్స్ వల్ల మలయాళ సినిమాలు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి. పైగా అప్పటివరకు చాలామందికి తెలియని టాలెంటెడ్​ మలయాళ యాక్టర్స్ పర్ఫార్మెన్స్​ చూడ్డానికి ఎక్కువమంది ఇష్టపడ్డారు. ​

ఎప్పటినుంచో.. 

ఇప్పుడే కాదు..ఎప్పటి నుంచో మాలీవుడ్​ డైరెక్టర్లు ఢిఫరెంట్​ కథలతో సినిమాలు తీయడం మొదలుపెట్టారు. నార్త్‌‌లో బెంగాల్ డైరెక్టర్లు సత్యజిత్ రే, రిత్విక్ ఘటక్‌‌, మృణాల్ సేన్, బుద్ధదేవ్ దాస్‌‌గుప్తా, రితుపర్ణో ఘోష్ లాంటి వ్యక్తులు ఉంటే.. సౌత్​ ఇండియాలో  ముఖ్యంగా మాలీవుడ్​లో జాన్ అబ్రహం, అరవిందన్, అదూర్ గోపాలకృష్ణన్ లాంటి మాస్టర్స్ ఉన్నారు. వాళ్లు అప్పట్లోనే అద్భుతమైన సినిమాలు తీసి ఆశ్చర్యపరిచారు. 70వ దశకంలో అదూర్ గోపాలకృష్ణన్ సామాజిక సమస్యలపై రియలిస్టిక్ సినిమాలు తీశారు. 

కనెక్టింగ్​ పీపుల్​

హీరో బాగా డబ్బున్నవాడు. కాస్ట్‌‌లీ సూట్​ వేసుకుని ఫెరారీలో తిరుగుతుంటాడు. అతనికి పెద్ద సమస్య వస్తుంది. దాన్ని ఎదుర్కోవడానికి కష్టపడుతుంటాడు. చివరికి కథ సుఖాంతం. ఇలాంటి సినిమాలు చూడడానికి జనాలు బాగా ఇష్టపడతారు. కానీ.. ఆ సినిమాల్లో ప్రేక్షకులు వాళ్లను వాళ్లు చూసుకోలేరు. కానీ..  మలయాళ సినిమాల్లో హీరో ఎక్కువగా కామన్​ మ్యాన్​ అయి ఉంటాడు. అతనికి  ఏ పవర్స్​ ఉండవు. పెద్ద పెద్ద కార్లు ఉండవు. అందుకే సినిమాల్లో కొన్ని క్యారెక్టర్లను చూస్తుంటే మనల్ని మనం చూసుకున్నట్టు ఉంటుంది. అందుకే ఈ  సినిమాలను చాలామంది ఇష్టపడుతున్నారు. 

కొన్ని భాషల సినిమాల్లో  హీరోయిన్లు మైక్రో–మినీ వేసుకుని హీరోతో డ్యుయెట్​ పాడుకోవడానికి  స్విట్జర్లాండ్‌‌ వెళ్తుంటారు. 20 మంది గూండాలతో ఒక్క హీరోనే ఫైట్‌‌ చేసి చితకబాదుతాడు. కానీ.. మలయాళం సినిమాల్లో ఇలాంటివి తక్కువ. నాలుగు పాటలు, మూడు రొమాన్స్​ సీన్లు, రెండు ఫైట్లు.. అన్నట్టు కాకుండా ఈ సినిమాల్లో కనిపించే హీరోలు చాలామంది సగటు భారతీయ యువకులు ఎలా ఉంటారో..  అలానే ఉంటారు. అందుకే కొన్ని మలయాళ సినిమాల్లో సగం సినిమా చూసేవరకు కూడా హీరో ఎవరో తెలియదు. ఎందుకంటే.. హీరోకి పెద్దగా ఎలివేషన్లు ఉండవు.     

*   *   *

బడ్జెట్​ - ప్రాఫిట్

మలయాళంలో తక్కువ బడ్జెట్​ సినిమాలతో ఎక్కువ ప్రాఫిట్స్ సంపాదిస్తారు. దానికి ఉదాహరణ ఇవే..  ‘అయ్యప్పయుమ్ కోషియుమ్’ 6 కోట్ల బడ్జెట్​ 60 కోట్ల ప్రాఫిట్. మోహన్​లాల్​ ‘పులిమురుగన్’ సినిమా152 కోట్ల కలెక్షన్స్​తో రికార్డ్​ సెట్ చేసింది. అయితే, ఈ మధ్య కేరళ వరదల కాన్సెప్ట్​తో వచ్చిన ‘2018’ సినిమా 200 కోట్లు కొల్లగొట్టింది. టొవినో థామస్​ లీడ్​ రోల్​లో నటించిన ఈ సినిమా మలయాళ సినిమాల్లో ప్రపంచవ్యాప్తంగా చాలా ఫాస్ట్​గా వందకోట్లు సంపాదించింది. ఇప్పటి వరకు ఎక్కువ బడ్జెట్​ పెట్టి తీసిన సినిమా అంటే ‘మరక్కార్​ : అరబికడలింతె సింహమ్’. 2021లో విడుదలైన ఈ సినిమా వందకోట్ల భారీ బడ్జెట్​తో తెరకెక్కింది. ఈ సినిమాలో మోహన్​లాల్, ఆయన కొడుకు ప్రణవ్ మోహన్​లాల్, అర్జున్ సర్జా, మంజు వారియర్, ప్రభు, సునీల్ శెట్టి, అశోక్ సెల్వన్, సుహాసిని, కీర్తి సురేష్​ వంటి ప్రముఖ నటీనటులు నటించారు.

కథాబలమున్న సినిమాలు 

కథా బలమున్న సినిమాలు మలయాళంలో ఎక్కువగా ఉంటాయి. మనవాళ్లకి బాగా తెలిసిన సినిమా ఒకటి చెప్పాలంటే ‘దృశ్యం’ సినిమా. దీని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆ సినిమాకి సీక్వెల్​ చేస్తే అది కూడా ఒక రేంజ్​లో హిట్​ అయింది. నిజానికి సీక్వెల్ సినిమాల్లో హిట్​ అయినవి చాలా తక్కువ. అయితే, సీక్వెల్​ సినిమాలు తీయడంలో డైరెక్టర్ జీతు జోసెఫ్​ దిట్ట అని ప్రూవ్ చేసుకున్నాడు. అంతటితో ఆగకుండా మూడోసారి దృశ్యం సీక్వెల్​తో రాబోతున్నాడు. మొదట్లో ఈ సినిమా వచ్చినప్పుడు చాలామంది మలయాళం రాకపోయినా సబ్​టైటిల్స్​తో చూసేశారు. సినిమా స్లో నెరేషన్ ఉండడంతో కొంత లాగ్ అవుతుంది అనుకున్నారు. కానీ, సెకండాఫ్ నుంచి ఆడియెన్స్ బాగా కనెక్ట్​ అయ్యారు. నిజానికి సినిమా పరంగా చూస్తే మొదటి పార్ట్​లో పెద్ద సెట్టింగ్స్, లొకేషన్స్ కనిపించవు. ఒక ఫ్యామిలీ, వాళ్ల ఇల్లు, ఊరు, సిటీ. సినిమా మొత్తం ఇవే కనిపిస్తాయి. కానీ, ప్రేక్షకులకు ఎక్కడా బోర్​ కొట్టదు. ఎందుకంటే కథలో నెక్స్ట్​ ఏం జరగబోతుంది? అనే క్యూరియాసిటీని పెంచేస్తాడు డైరెక్టర్. అందువల్ల చూసేవాళ్ల కాన్సన్​ట్రేషన్ మొత్తం కథ మీదే ఉంటుంది. చెప్పాలంటే ఇదేమీ కమర్షియల్, కామెడీ, యాక్షన్ సినిమా కాదు. ఇదొక క్రైమ్, సస్పెన్స్​ థ్రిల్లర్ సినిమా. అయినా ఆడియెన్స్ ఎందుకు కనెక్ట్​ అయ్యారంటే దానికి కారణం క్రైమ్​ని కథగా చూపించిన విధానం. అందులో స్టార్ హీరో మోహన్​లాల్ ఉన్నప్పటికీ ఆయన కూడా కథలో భాగమే. రక్తపాతాలు, అరుపులు, ఫైటింగ్స్ వంటివి ఏం కనిపించవు. కాబట్టి కథ, దాన్ని చూపించే విధానమే ప్రేక్షకుడ్ని కట్టి పడేస్తుందనడంలో అతిశయోక్తిలేదు. తెలుగులో వెంకటేశ్, తమిళంలో కమల్ హాసన్, హిందీ అజయ్ దేవగన్​ వంటి పెద్ద హీరోలు వాటిని రీమేక్ చేశారంటే అర్థం చేసుకోవచ్చు కథాబలం ఎంతగా ఉందో. పైగా ఈ సినిమాని ఏ భాషలో చూసినా ఒకే కథ, ఒకే టేకింగ్ ఉంటాయి. కానీ, ఎన్నిసార్లు చూసినా బోర్​ కొట్టదు.ఇదే కాకుండా మరెన్నో సినిమాలు కథతోనే కనెక్ట్ అవుతాయి.

‘ఆపరేషన్ జావా’ ఈ సినిమాలో ఒక స్టార్​ హీరో ఉండడు. ఈ సినిమాలో కూడా కథే హీరో. సైబర్ సెల్​లో ఆఫీసర్స్ ఎలా పనిచేస్తారు? ఆన్​లైన్ ఫ్రాడ్​ వల్ల ఒక పర్సన్​ లైఫ్​ ఎలా ఎఫెక్ట్ అవుతుంది? అనేది అందరికీ అర్థమయ్యేలా తెరకెక్కించారు. ‘తిరికే’ సినిమాలో చిన్నప్పుడే పేరెంట్స్ చనిపోవడంతో అన్నని ఒక ఫ్యామిలీ దత్తత తీసుకుంటుంది. తమ్ముడు అప్పుడప్పుడు అన్నని చూసి వస్తుంటాడు. అయితే చిన్నప్పుడు వాళ్లు సరిగా ఎంజాయ్ చేయలేదనే కారణంతో అన్నని కిడ్నాప్ చేస్తాడు తమ్ముడు. వాళ్లిద్దరు కలిసి ట్రిప్​కి వెళ్తారు. ఇందులో ఇద్దరు అన్నదమ్ముల అనుబంధాన్ని చాలా బ్యూటిఫుల్​గా చూపించారు.  ‘బిర్యానీ : ఫ్లేవర్స్ ఆఫ్​ ఫ్లష్’​ ఈ సినిమా ఒక ముస్లిం యువతి కథ. ఈ సినిమా చూసిన రెండు రోజుల వరకు ఆడియెన్స్​ను వెంటాడుతూనే ఉంటుంది. బిర్యానీ సినిమాకి నేషనల్ అవార్డ్​తో పాటు స్టేట్, ఇంటర్నేషనల్ అవార్డ్​లు వచ్చాయి. 

‘ది గ్రేట్ ఇండియన్ కిచెన్’ ఈ సినిమా ప్రతి ఒక్కరిని కదిలిస్తుంది. ఒక ఇల్లాలి కథ ఇది. ఇంట్రెస్టింగ్​ విషయమేంటంటే.. ఈ సినిమాని ఏ ప్లాట్​ఫాం తీసుకోకపోవడంతో మలయాళం రీజనల్ ఓటీటీ ప్లాట్​ఫామ్​లో రిలీజ్ చేశారు. అందులో కంటెంట్ చూసి ఆ తరువాత అమెజాన్​ ప్రైమ్​ ఓటీటీ కొనుక్కుంది.‘కుంబళాంగి నైట్స్’ సినిమాలో కథే హీరో. నలుగురు అన్నదమ్ముల మధ్య ఉండే ప్రేమానుబంధాల, ఈర్ష్యాద్వేషాల గురించి ఈ సినిమాలో చూపిస్తారు. ఇందులో ఫహాద్ ఫాజిల్ ఫ్రాడ్ క్యారెక్టర్​లో జీవించేశాడు.ఫహాద్ ఫాజిల్ నటించిన ‘మహెశింటె ప్రతీకారమ్’ ఈ సినిమా తెలుగులో ‘ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య’గా రీమేక్ చేశారు. ​ఆ తర్వాత ‘ట్రాన్స్’ సినిమాలో ఫహాద్ ఫాజిల్ నటనకు ఫిదా అయిపోతారు. ‘ఆండ్రాయిడ్ కుంజప్పన్ వెర్షన్ 5.25’ ఈ సినిమాలో విదేశంలో ఉన్న కొడుకు ఒంటరిగా ఉన్న తండ్రికి రోబోని గిఫ్ట్​ ఇస్తాడు. మెషిన్​లంటే పడని ఆయన రోబోతో ఎలా కనెక్ట్​ అవుతాడు అనేది ఇంట్రెస్టింగ్​గా ఉంటుంది. సినిమా మొత్తం హ్యూమన్ ఎమోషన్స్ మీదే ఉంటుంది. ‘టేకాఫ్​’ 2014లో ఇరాక్​లో ఒక యుద్ధం జరగడం, దాంతో అక్కడున్న మలయాళీ నర్సులు తిరిగి కేరళ రాలేకపోతారు. వాళ్లు ఇండియాకి ఎలా వచ్చారు? అనేది స్టోరీ. 
‘అంగమలై డైరీస్’ సినిమాని కూడా తెలుగులో ‘ఫలక్​ నామా దాస్​’గా రీమేక్​ చేశారు.

ఇది కొత్త ఫ్లేవర్ ఉన్న యూత్ సినిమా. ఈ సినిమా డైరెక్టర్​ ‘జ​ల్లికట్టు’ తీశాడు. ఈ సినిమాలో మనుషుల్లో ఉండే రకరకాల క్యారెక్టర్స్​​ని చూపిస్తాడు డైరెక్టర్ లిజో జోస్. సుదాని ఫ్రమ్​ నైజీరియా, వైరస్, ఫోరెన్సిక్, చార్లీ, లూసిఫర్, ఉయరే, కమ్మట్టి పాదం, హెలెన్, జనగణమన, మిన్నల్ మురళి, జయ జయ జయ జయహే, కన్నుమ్ కన్నుమ్ కొల్లయడితాల్.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో మలయాళ సినిమాలు మన మనసును దోచేస్తాయి. వీటన్నింటి వెనకున్న సీక్రెట్​ స్టోరీనే. కేవలం కథను నమ్మి మాత్రమే వాళ్లు సినిమా తీస్తారు.    

- సూర్య ప్రకాష్​ జోశ్యుల

వాస్తవ కథలు

మలయాళీ సినిమాలు ఆదరణ పొందడానికి వాస్తవ సంఘటనల ఆధారంగా సినిమాలు తీయడం కూడా ఒక కారణమే. వాస్తవానికి బాలీవుడ్​లో కూడా ఇలాంటి సినిమాలు తీస్తారు. కానీ.. వాళ్లు ఎక్కువగా బయోపిక్​లకే పరిమితం అయ్యారు. కానీ.. మాలీవుడ్​లో నిజంగా జరిగిన సంఘటనలను ఆధారంగా చేసుకుని చాలా సినిమాలు వచ్చాయి. ఈ మధ్య వచ్చిన రాజేష్ పిళ్లై సినిమా ‘ట్రాఫిక్’ అలాంటిదే. హృదయాన్ని కరిగించే ఒక వాస్తవ కథ ఆధారంగా రాసుకున్న స్టోరీ ఇది. 2017లో వచ్చిన టేకాఫ్​, 2019లో వైరస్​ సినిమాలు కూడా ఇలా వచ్చినవే. ఇవేకాదు.. ఇలాంటి సినిమాలు ఇంకా చాలానే ఉన్నాయి. 

జానర్స్ మార్పు

మలయాళ సినిమాల్లో మనం గమనించాల్సిన విషయం. అక్కడ అనేక జానర్స్​లో సినిమాలు తియ్యటం. థ్రిల్లర్స్, లవ్ స్టోరీలు, స్లైస్ ఆఫ్ లైఫ్, కామెడీ ఇలా ప్రతీది ఆ సినిమాల్లో కనపడుతుంది. ‘జల్లికట్టు, వైరస్’ వంటి సినిమాలను అక్కడ మాత్రమే ఊహించగలం.

విమెన్​ సెంట్రిక్​

ఇప్పటివరకు ‘మహిళ’ ప్రధాన అంశంగా మలయాళంలో చాలా సినిమాలు వచ్చాయి. ఈ సినిమాల్లో ఆడవాళ్ల కష్టాలను చెప్పకనే చెప్తారు. చిన్న చిన్న విషయాలను తీసుకుని అద్భుతమైన కథలుగా మలిచిన సినిమాలు కూడా ఉన్నాయి. మలయాళ ఇండస్ట్రీలో ఇలాంటి సినిమాలు ఎప్పటినుంచో వస్తున్నాయి. జెండర్​ డిస్క్రిమినేషన్​, జెండర్​ బేస్​డ్​ క్రైమ్స్​, విమెన్​ లైఫ్​లోని విభిన్న కోణాలు చూపించే అనేక సినిమాలు మాలీవుడ్​ నుంచి వచ్చాయి. వాటిలో ముఖ్యంగా ద గ్రేట్​ ఇండియన్​ కిచెన్​, ఉయరే, హౌ ఓల్డ్​ ఆర్ యూ, 22 ఫిమేల్​ కొట్టయన్​, వారథన్, జయ జయ జయ జయహే... లాంటి సినిమాలు ఎక్కువగా ఇంపాక్ట్‌‌ చూపించాయి.