మలేసియాకు పోవాల్నంటే వీసా అక్కర్లే .. ఇండియన్లు వీసా లేకున్నా 30 రోజులు ఉండొచ్చు

మలేసియాకు పోవాల్నంటే వీసా అక్కర్లే .. ఇండియన్లు వీసా లేకున్నా 30 రోజులు ఉండొచ్చు
  • డిసెంబర్ 1 నుంచి అమల్లోకి
  • ఇటీవల ఇండియన్లకు వీసా ఫ్రీ ఎంట్రీ ప్రకటించిన థాయ్​లాండ్, శ్రీలంక

కౌలా లంపూర్: ఇండియా, చైనా పౌరులకు 30 రోజుల వీసా ఫ్రీ ఎంట్రీని మలేసియా ప్రకటించింది. డిసెంబర్ 1 నుంచి ఇది అమల్లోకి వస్తుందని మలేసియన్ ప్రధాని అన్వర్ ఇబ్రహీం వెల్లడించారు. తమ దేశాల్లో టూరిజాన్ని ప్రమోట్ చేసేందుకు ఇటీవల శ్రీలంక, థాయ్​లాండ్​  దేశాలకు ఇండియన్లకు వీసా ఫ్రీ ఎంట్రీ కల్పిస్తామని ప్రకటించగా.. తాజాగా ఆ జాబితాలోకి మలేసియా కూడా చేరింది. ‘‘వీసా మినహాయింపు అనేది టాప్ సెక్యూరిటీ స్క్రీనింగ్‌‌కు లోబడి ఉంటుంది. మలేసియాకు వచ్చే టూరిస్టులకు ప్రాథమిక స్క్రీనింగ్స్‌‌ నిర్వహిస్తాం. నేర చరిత్ర లేదా టెర్రరిజం రిస్క్ ఉందనుకుంటే.. వారిని మా దేశంలోకి అనుతించబోం” అని స్పష్టం చేశారు.

30 రోజుల వీసా ఫ్రీ ఎంట్రీని 8 ఆసియా దేశాల పౌరులకు మలేసియా కల్పిస్తున్నది. 1.6 కోట్ల మంది విదేశీ టూరిస్టులు రావాలని ఆ దేశం టార్గెట్‌‌గా పెట్టుకున్నది. ఇక ఈ దేశంలో పర్యటించే వారిలో ఇండియన్లు కూడా ఎక్కువగా ఉంటారు. మలేసియా టూరిజం ప్రమోషన్ బోర్డు లెక్కల ప్రకారం.. 2022లో 3,24,548 మంది ఇండియన్లు అక్కడ పర్యటించారు. 2023 ఫస్ట్ క్వార్టర్‌‌‌‌లో 1,64,566 మంది వెళ్లారు. ఇండియా, మలేసియా మధ్య డైలీ 158 విమానాలు నడుస్తున్నాయి.

వీటిలో 30 వేలకు పైగా సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇటీవల ఇండియా, మరో ఆరు దేశాలకు శ్రీలంక వీసా ఫ్రీ ఎంట్రీని ప్రకటించింది. వచ్చే ఏడాది మార్చి 31 దాకా దీన్ని కొనసాగించనున్నట్లు చెప్పింది. థాయ్​లాండ్ కూడా ఇండియా, తైవాన్ దేశాలకు వీసా నిబంధనను వచ్చే ఏడాది మే 10 వరకు సడలించింది. దీని ప్రకారం ఇండియన్లు థాయ్​లాండ్‌‌కు వీసా లేకుండానే వెళ్లొచ్చు. గరిష్ఠంగా 30 రోజుల వరకు అక్కడ పర్యటించవచ్చు.