మాల్దీవులు మునిగిపోతాయా!

మాల్దీవులు మునిగిపోతాయా!

మాల్దీవులు డేంజర్ జోన్​లో చిక్కుకున్నాయి. సముద్రమట్టం  ఏమాత్రం పెరిగినా మాల్దీవులు ప్రమాదంలో పడతాయంటున్నారు సైంటిస్టులు. వాతావరణంలో వస్తున్న పెను మార్పులు ఇలాగే కొనసాగితే వచ్చే 80 ఏళ్లలో మాల్దీవులు సముద్రపు నీళ్లలో కలిసిపోతాయని హెచ్చరిస్తున్నారు. పగడాల దీవులుగా పేరున్న మాల్దీవులకు ఈ ప్రమాదం ఎందుకొచ్చింది ?

ప్రపంచవ్యాప్తంగా వేడిమి  పెరుగుతోంది.దీంతో అనేక చోట్ల మంచు పర్వతాలు కరిగిపోయి సముద్రంలో కలుస్తున్నాయి.ఫలితంగా సముద్రమట్టాలు విపరీతంగా పెరుగుతున్నాయి. దీనివల్ల ప్రపంచంలో అనేక ప్రాంతాలు, నగరాలకు ముంపు పొంచి ఉంది. ఇండోనేషియా రాజధాని జకార్తా నగరానికి కూడా ఇదే ప్రమాదం ఎదురవడంతో అక్కడి వాళ్లు వేరే నగరానికి రాజధానిని షిఫ్ట్‌ చేసుకోబోతున్నారు. ఇదే లిస్టులో మాల్దీవులు కూడా చేరింది.మారుతున్న వాతావరణ మార్పులకు కు తగ్గట్టు చర్యలు తీసుకోకపోతే మరో 80 ఏళ్లలో మాల్దీవులు సముద్రంలో మునిగిపోవడం ఖాయమని లేటెస్ట్​ గా యునైటెడ్ నేషన్స్ కు చెందిన ‘ఎన్విరాన్​మెంటల్ ప్యానెల్’ తెగేసి చెప్పింది.

2012లోనే చర్యలు మొదలు ……

2012లో మాల్దీవులకు మహమ్మద్ నషీద్  ప్రెసిడెంట్​ గా సమయంలో కూడా ఇదే ఇష్యూ తెరమీదకు వచ్చింది. దీంతో నషీద్ ఈ ఇష్యూపై  వెంటనే రియాక్టయ్యారు. వాతావరణంలో వస్తున్న పెను మార్పులు చివరకు మాల్దీవులను నీటి పాల్జేస్తాయన్న భయాందోళనలు వ్యక్తం చేశారు. ఈ మార్పుల నుంచి మాల్దీవులను రక్షించుకోవడానికి తన వరకు కొన్ని  ప్రయత్నాలు చేశారు. వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి వీలుగా కొన్ని చర్యలు తీసుకున్నారు. యాక్షన్ ప్లాన్ తయారీ కోసం చొరవ చూపించారు.

సముద్రం అడుగున కేబినెట్ మీటింగ్

ఏ దేశంలోనైనా కేబినెట్ మీటింగ్ అంటే రాజధానిలోని గవర్నమెంటు ఆఫీసులు ఉండే ఓ పెద్ద బిల్డింగ్​లో పెడతారు. కానీ మాల్దీవుల కేబినెట్ మీటింగ్ మాత్రం ఒకసారి  సముద్రం అడుగున జరిగింది. 2009 అక్టోబరులో అప్పటి ప్రెసిడెంట్ మహమ్మద్ నషీద్ ఈ మీటింగ్ ఏర్పాటు చేశారు. సముద్రమట్టానికి ఆరు మీటర్లలోపల దాదాపు అరగంటపాటు ఈ సమావేశం జరిగింది.దేశానికి పెనుముప్పుగా మారిన వాతావరణ మార్పులపై  అందరికీ అవగాహన కలిగించడానికి ఈ కేబినెట్ మీటింగ్ ఏర్పాటు చేశారు. దీనికి తగ్గట్టు నిర్ణయాలు తీసుకోకపోతే ఏదో ఒక రోజున మాల్దీవులు సముద్రంలో మునిగిపోతాయని  ప్రపంచానికి చెప్పడానికే  ఈ మీటింగ్ ఏర్పాటు చేశారు నషీద్. ఈ మార్పుల రూపంలో తరుముకువస్తున్న ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి యాక్షన్ ప్లాన్ రూపొందించాలని ఆయన కోరారు.

శతాబ్దాల నుంచి ఆదుకున్న చేపల పరిశ్రమ

టూరిజం డెవలప్ కావడానికి ముందు  మాల్దీవులను ఆదుకున్నది ఫిషింగ్ ఇండస్ట్రీనే. కొన్ని శతాబ్దాల పాటు ఇక్కడి ప్రజలకు తినడానికి తిండి  పెట్టింది చేపల పరిశ్రమనే. దీంతో మాల్దీవుల పాలకులు ఇప్పటికీ ఫిషింగ్ ఇండస్ట్రీకి టాప్ ప్రయారిటీ ఇస్తారు. జాలర్లకు అవసరమైన సదుపాయాలు కల్పిస్తారు. తొలిరోజుల్లో అందరిలా  పడవల్లో వెళ్లి చేపలు పట్టేవాళ్లు. 1974లో ‘ధోని’ పేరుతో మరబోట్లు ఎంటరయ్యాయి. దీంతో ఫిషింగ్ ఇండస్ట్రీ రూపురేఖలే మారిపోయాయి. రాబడి విపరీతంగా పెరిగింది. 1979లో ఈ ఇండస్ట్రీకి సంబంధించి ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వడానికి ఒక ‘అడ్వైజరీ బోర్డు’ ఏర్పాటు చేశారు. ఆ తరువాత జాలర్లకు చేపలు పట్టడంలో  స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చారు. స్కూళ్ల సిలబస్​లో ఫిషరీస్​కు సంబంధించిన అంశాలను పొందుపరిచారు. చేపల పరిశ్రమకు సంబంధించి ప్రత్యేకంగా ఒక ‘ఎకనమిక్ జోన్’ను ఏర్పాటు చేశారు. 2010 లెక్కలను తీసుకుంటే మాల్దీవుల జీడీపీలో 15 శాతం చేపల పరిశ్రమ నుంచే వస్తోంది. దేశంలోని 30 శాతం మంది కార్మికులు ఈ పరిశ్రమలోనే ఉన్నారు. టూరిజం తరువాత  అతి పెద్ద మొత్తంలో ఫారిన్ ఎక్స్ఛేంజ్ తీసుకువస్తున్నది ఫిషింగ్ ఇండస్ట్రీనే.

లిటరసీ రేట్ 98 శాతం ..

మాల్దీవుల్లో చదువుకున్న వాళ్లు బాగా ఎక్కువ. లిటరసీ రేట్ 98 శాతం ఉంటుంది. డిగ్రీ పూర్తి చేసిన వాళ్లు 90 శాతం మంది ఉంటారు. ఇక్కడ మెజారిటీ ప్రజలు సున్నీ ముస్లింలు. మాల్దీవియన్ దైవేహి అనే భాష ఎక్కువగా మాట్లాడతారు. సహజంగా శని, ఆదివారాలను వీకెండ్ గా ప్రపంచం అంతా భావిస్తుంది. అయితే ఇక్కడ వీకెండ్ అంటే శుక్ర, శనివారాలు. మొత్తం దీవుల్లో 80 కి పైగా ఐలాండ్స్ లో టూరిజం డెవలప్ అయింది.

గార్మెంట్స్, హ్యాండీ క్రాఫ్ట్స్ పరిశ్రమలు కూడా..

ఫిషింగ్ పైనే కాకుండా ఇసుక మైనింగ్, గార్మెంట్స్, హ్యాండీ క్రాఫ్ట్స్ , కొబ్బరి పరిశ్రమలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడి ప్రజలు పడవలు తయారు చేయ డంలో కూడా నిపుణులే. మాల్దీవుల ఎగుమతుల్లో చేపలు, డ్రస్సులు ఎక్కువగా ఉంటాయి. ఇక దిగుమ తుల విషయానికొస్తే  ఫుడ్ ఐటమ్స్,  పెట్రోలియం ఉత్పత్తులు, ఇతర వస్తువులు ఉంటాయి.

అతిచిన్న దేశం

మాల్దీవులకు ఓ స్పెషాలిటీ ఉంది. ఆసియాలోనే అతి చిన్న దేశం…మాల్దీవులే. ప్రపంచవ్యాప్తంగా చూస్తే అత్యంత చిన్న దేశాల్లో మాల్దీవులది తొమ్మిదో ప్లేస్. 300 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది ఈ దేశం.  దాదాపు నాలుగు లక్షల జనాభా ఉన్న ఈ దీవుల రాజ్యానికి మాలె రాజధానిగా ఉంది. 2,500 ఏళ్ల నుంచి ఈ దీవులు ఉన్నట్లు చరిత్ర చెబుతోంది.1953 ప్రాంతంలో మహమ్మద్ అమీన్ దీదీ మాల్దీవులకు తొలి ప్రెసిడెంట్ గా పనిచేశారు. మాల్దీవుల్లో పుట్టిన తొలి రాజకీయ పార్టీ ‘ఆర్ ఎంపీ’ కి ఆయన లీడర్ గా ఉన్నారు. ఆయన మంచి విద్యావేత్త. రాజకీయాల్లోకి రాకముందు ఆయన ఓ ప్రముఖ విద్యా సంస్థకు ప్రిన్సిపల్​గా పనిచేశారు. దేశాన్ని ఆధునీకరించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. 1953వరకు మాల్దీవులు బ్రిటిష్ వాళ్ల కంట్రోల్లో ఉన్నాయి. సుల్తాన్ ఇబ్రహీం నాసిర్ హయాంలో 1965 జూలై 26న బ్రిటిష్ వాళ్లలో మాల్దీవులు ఒక ఒప్పందం కుదిరింది. ఆ తరువాత అనేక రాజకీయ పరిణామాలు సంభవించాయి. ఈ పరిస్థితుల్లో 1968 నవంబరు 11న మాల్దీవులు ఒక రిపబ్లిక్ గా అవతరించాయి.

ఒకప్పుడు పేద దేశం

1970ల నాటి లెక్కల ప్రకారం ప్రపంచంలోని 20 అతి పేద దేశాల్లో మాల్దీవులు కూడా ఉన్నాయి. అప్పటికి చేపల పరిశ్రమ ఉన్నా మరబోట్లు జాలర్లకు అందుబాటులోకి రాలేదు. సంప్రదాయ పద్ధతుల్లోనే ఇక్కడి జాలర్లు చేపలు పట్టేవాళ్లు. దీంతో  దేశానికి రాబడి పెద్దగా వచ్చేది కాదు. అంతేకాదు అప్పటికి టూరిజం కూడా అభివృద్ధి చెందలేదు. 1980ల్లో దేశంలో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. ఈ సంస్కరణలు బాగా సక్సెస్ అయ్యాయి. ప్రైవేటు సెక్టార్ కు ప్రభుత్వం ద్వారాలు తెరిచింది. ఫలితంగా  మాల్దీవులు అభివృద్దిలో దూసుకుపోయాయి. ఇక్కడ వ్యవసాయానికి పనికొచ్చే భూమి తక్కువ. దీంతో అగ్రికల్చర్ పెద్దగా డెవలప్ కాలేదు.

మాల్దీవులకు ప్రమాదం ఎందుకంటే……

పగడాల దీవులుగా అందరూ పిలిచే మాల్దీవుల్లో మొత్తం 1,192 దీవులున్నాయి. వీటిలో 200 దీవులు మాత్రమే మనుషులుండటానికి వీలున్నవి. ప్రపంచంలోనే అత్యంత పల్లపు దేశంగా మాల్దీవులను  పేర్కొంటారు. ఇక్కడి నేల సముద్ర మట్టానికి యావరేజ్​గా ఒక మీటరు ఎత్తున ఉంటుంది. ఇలా ఉండటం చాలా అరుదు. వాతావరణంలోకి కార్బన్ విపరీతంగా విడుదల అవుతుండడంతో సముద్రమట్టాలు పెరిగే అవకాశం ఉంది. ఇలా సముద్రమట్టాలు పెరిగితే  తీరం వెంబడి ఉండే ప్రాంతాలు నీళ్లలో కలిసిపోయే డేంజర్ ఉందంటున్నారు సైంటిస్టులు. వీటిలో మాల్దీవులూ ఉన్నాయి. ప్రమాదం ఇంతలా పొంచి ఉండటంతో దానిని తప్పించుకోవడానికి వెంటనే వేరే  ఏర్పాట్లు చేయాలంటున్నారు. పకడ్బందీ యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవాలంటున్నారు.

టూరిజంతోనే రాబడి

మాల్దీవులకు టూరిజమే ప్రధాన రాబడి. అంతేకాదు  ప్రపంచంలోనే ‘సేఫెస్ట్ టూరిస్టు ప్లేస్​’గా మాల్దీవులకు పేరుంది. చుట్టూ బ్లూ కలర్ లో సముద్రం కనిపిస్తూ ఉంటుంది. ఆహ్లాదకరమైన వాతావరణం, స్వచ్ఛమైన గాలి, రిసార్టులు, అందులో సందడి చేసే టూరిస్టులు, ఇవీ మాల్దీవుల్లో  ప్రతిరోజూ కనిపించే దృశ్యాలు. కొంతమంది టూరిస్టులు  సముద్రం అడుగున ఉన్న అందాలను చూడాలని ఉబలాటపడతారు. అలాంటి వాళ్ల కోసం స్కూబా డైవింగ్ ఏర్పాట్లు కూడా ఉన్నాయి. నిజానికి మాల్దీవులు 1970 వరకు బయటి ప్రపంచానికి తెలియదు. ఆ తరువాతే టూరిస్టుల దృష్టి  ఈ పగడాల దీవులపై పడింది. మాల్దీవులకు టూరిస్టులు రావడం మొదలై, 80 దీవుల్లో టూరిజం బాగా అభివృద్ధి చెందింది.