సీఎం కేసీఆర్ కు ఎంపీ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

సీఎం కేసీఆర్ కు ఎంపీ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

ఐకేపీ సెంటర్లలో రైతులను ఇబ్బంది పెడుతున్నఅధికారులు

తడిచిన ధాన్యాన్ని మద్ధతు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేయాలి

అత్త సొమ్ముతో అల్లుడి సోకు అన్నట్లు కేసీఆర్ ప్రచారం

డిమాండ్లు పరిష్కరించకపోతే ప్రత్యక్ష కార్యచరణ

మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి

రాష్ట్రంలో రైతాంగ సమస్యలు ఎక్కువయ్యాయని మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. అత్త సొమ్ముతో అల్లుడి సోకు అన్నట్టు రాష్ట్రంలో రైతన్న కష్టాన్ని రాజకీయంగా సొమ్ము చేసుకోవడానికి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని రేవంత్ అన్నారు. రైతుల సమస్యలను ప్రస్తావిస్తూ ఎంపీ రేవంత్ సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు.

కొద్ది రోజులుగా మీరు పడుతోన్న తాపత్రయం చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతోంది. కర్షకుడి కష్టాన్ని మీ ఘనతగా ప్రచారం చేసుకోవడానికి సిగ్గుండాలి! రైతు కష్టం, ప్రకృతి దయ వల్ల పంట దిగుబడి అధికంగా వచ్చింది. రైతు కళ్లలో ఆనందం వెల్లి విరియాల్సిన ఈ సమయంలో మీ నిర్లక్ష్యం కారణంగా ఆవేదన తొణికిసలాడుతోంది. క్షేత్రంలో రైతు కష్టం-నష్టం మీ కంటికి కనిపించడం లేదు, చెవికి వినిపించడం లేదు. మీరొక ఊహా ప్రపంచంలో విహరిస్తూ.. ప్రజలంతా అలాగే విహరించాలని కోరుకుంటున్నారు. యాసంగి దిగుబడి బాగా వచ్చిందని, ప్రతి కిలో ప్రభుత్వమే కొంటుందని కొద్ది రోజుల క్రితం మీడియా సమావేశంలో మీరు చెప్పారు. దీని కోసం రూ.30 వేల కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పుడు క్షేత్రంలో చూస్తే రైతులలో దుఖం ఉప్పొంగుతోంది. ధాన్యాన్ని నడిరోడ్డుపై పోసి నిప్పుపెట్టుకుంటోన్న నిస్సహాయత కనిపిస్తోంది. పురుగుమందు డబ్బాలతో కొనుగోలు కేంద్రాల్లో నిరసన దృశ్యాలు కనిపిస్తున్నాయి. తమ కష్టాన్ని దళారీలు దోచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది చాలదన్నట్టు అకాల వర్షంతో వచ్చిన అనుకోని నష్టం రైతుల కంట కన్నీరు పెట్టిస్తోంది. ఇటువంటి కష్టసమయంలో ఆదుకోవాల్సిన ప్రభుత్వం.. ఆర్బాటపు ప్రకటనలతో సరిపెడుతోంది. మీకు తెలియకపోతే కొన్ని ఉదాహరణలు చెప్తాను.

•అకాల వర్షాలతో ఏప్రిల్ 14న ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో తీవ్ర పంటనష్టం జరిగింది.

•ఈదురు గాలులు, వడగళ్ల వర్షంతో ఏప్రిల్ 24న కుమురం భీం, భవనగిరి, ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో తీవ్ర పంట నష్టం జరిగింది.

•రాజన్న సిరిసిల్ల జిల్లాలో అకాల వర్షాలతో వేల ఎకరాల వరిపంట, 613 ఎకరాల్లో మామిడి పంటకు నష్టం జరిగింది.

•మెదక్ జిల్లాలో కొనుగోలు కేంద్రంలో 1500 క్వింటాళ్ల ధాన్యం అకాల వర్షానికి తడిసిపోయింది. 150 ఎకరాల్లో మామిడి పంటకి నష్టం జరిగింది.

•సంగారెడ్డి జిల్లా జోగిపేట మార్కెట్ యార్డులో రెండు వేల క్వింటాళ్ల ధాన్యం వర్షానికి తడిసిపోయింది. జొన్న, ఉల్లి, తెల్ల కుసుమ పంట దెబ్బతిన్నది.

•కామారెడ్డి, సిద్ధిపేట, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల జిల్లాలలో అకాల వర్షానికి పిడుగుపడి ఐదుగురు రైతులు మృత్యువాత పడ్డారు.

•కొనుగోలు కేంద్రాల్లో రైతులను దగా చేస్తున్న సంఘటనలు కోకొల్లలు. తాలు, తేమ, తరుగు పేరుతో రైతులను వ్యాపారులు నిలువునా దోచేస్తున్నారు. దీంతో అనేక చోట్ల రైతులు నిరసనలకు దిగుతున్నారు.

•రాజన్న సిరిసిల్ల జిల్లా, తంగళ్ల పల్లి మండలం, లక్ష్మీపూర్ ఐకేపీ కేంద్రంలో ధాన్యానికి రైతులు నిప్పు పెట్టి నిరసనకు దిగారు. పెద్దపల్లి జిల్లా, మంథని మండలం, ఎగ్లాస్ పూర్ లో క్వింటాల్ కు రెండున్నర కేజీలు అధికంగా తీసుకోవడాన్ని నిరసిస్తూ రైతులు ధాన్యాన్ని రోడ్డుపై పోసి తగలబెట్టి నిరసన వ్యక్తం చేశారు. జగిత్యాల జిల్లా, పెగడపల్లి మండలం, త్యాగలమర్రి కొనుగోలు కేంద్రంలో పురుగుల మందు డబ్బాలతో రైతులు నిరసన తెలిపారు. కరీంనగర్ జిల్లా పోరండ్ల వ్యవసాయ మార్కెట్ యార్డులో తరుగు పేరుతో దోపిడీని నిరసిస్తూ రైతులు ధర్నాలు చేశారు. చొప్పదండిలో ధాన్యాన్ని రోడ్డుపై పోసి నిరసన తెలిపారు. ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్ర వ్యాప్తంగా అనేక సంఘటనలు ఉన్నాయి.

•నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల జిల్లాల్లో 1.30 లక్షల ఎకరాల్లో పసుపు పంట పండింది. లాక్ డౌన్ కంటే ముందు క్విటాల్ పసుపు ఏడు వేలకు కొన్న వ్యాపారులు.. ఇప్పుడు రూ. 4,500 కు మించి కొనబోమంటున్నారు. పొరుగున మహా రాష్ట్రలో క్వింటాల్ రూ.7,500 పలుకుతోంది.

•లాక్ డౌన్ పేరుతో వ్యవసాయ అనుబంధ పరిశ్రమలైన జిన్నింగ్ మిల్లులను మూసి వేశారు. దీంతో పత్తి కొనుగోలు నిలిచిపోయింది. పత్తిని ఇళ్లలో నిల్వ చేసుకోలేక, అమ్ముకునే అవకాశం లేక రైతులు సతమతం అవుతున్నారు. మహారాష్ట్ర, గుజరాత్ లలో జిన్నింగ్ మిల్లులను వ్యవసాయం అనుబంధ పరిశ్రమలుగా గుర్తించి లాకౌ డౌన్ లో కూడా నడుపుకునేందుకు అనుమతులు ఇచ్చారు. మీరు ఆ వైపుగా కనీస శ్రద్ధ కనబరచడం లేదు.

•రాష్ట్రంలో అధిగ దిగుబడి రాబోతోందని మీకు నిజంగా అంచనా ఉండి ఉంటే ఆ మేరకు గన్నీ బ్యాగులను ఎందుకు సిద్ధం చేసుకోలేదు? ధాన్యం సేకరణ మొదలు పెట్టిన తర్వాత ఆగ్రోస్ ద్వారా టార్పాలిన్ల కొనుగోలుకు టెండర్లు పిలిచారు. లాక్ డౌన్ నేపథ్యంలో సదరు కాంట్రాక్టర్ వాటిని సరఫరా చేయలేనని చేతులెత్తేశారు. దీంతో మీరు సమస్యను జిల్లా కలెక్టర్ల పై తోసేసి మిన్నకుండిపోయారు. ఫలితంగా కొనుగోలు కేంద్రాల్లో వేల క్వింటాళ్ల ధాన్యం అకాల వర్షాలతో తడిసిపోయి, రైతుకు తీవ్ర దుఖాన్ని మిగిల్చింది. రైతులు తెచ్చిన ధాన్యంలో తేమ ఉంటే ఆరబెట్టుకునేందుకు టార్పాలిన్లు లేని పరిస్థితి వచ్చింది. ఇది మీ విజనరీ లీడర్ షిప్ ఘనతే కదా!

•రాష్ట్రంలో ఈ ఏడాది 50 లక్షల టన్నుల బత్తాయి దిగుబడి వచ్చినట్టు ఓ అంచనా. సాధారణంగా టన్ను బత్తాయి రూ.40 వేలు పలుకుతుంది. బత్తాయి ఎగుమతి నిషేదిస్తూ మీరు తీసుకున్న మతిలేని నిర్ణయంతో అది ఒక్కసారిగా రూ.8,500 లకు పడిపోయింది. ఆ తర్వాత ఎగుమతులకు అనుమతి ఇచ్చినా వ్యాపారులు ముందుకు రాలేదు.

•టన్ను రూ.18,500 వరకు ఉండాల్సిన మామిడి ధర ఒక్కసారిగా రూ.10 వేలకు పడిపోయింది. ఓ వైపు అకాల వర్షాలతో కాయలు రాలిపోయి, మరోవైపు ధర లేక రెండు విధాలుగా మామిడి రైతు నష్టపోయాడు.

•కందులు, ఇతర వాణిజ్య పంటలు, ద్రాక్ష లాంటి ఇతర ఫలాల విషయంలో సైతం మీ వద్ద ఎలాంటి కార్యచరణ లేదు. కేవలం ధాన్యం కొనుగోళ్ల కోసం కొన్ని కేంద్రాలు తెరిచి, రైతులందరినీ ఆదుకుంటున్నట్టు ప్రకటనలు గుప్పించడం మినహా మీరు చేసింది శూన్యం. ఇదీ రాష్ట్రంలో రైతాంగ పరిస్థితికి వాస్తవ దృశ్యం.

కాబట్టి ఇప్పటికైనా మీరు స్పందించి.. రైతన్న బాగుకోరి ఈ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతున్నాను.

1. అకాల వర్షాలతో పంట నష్టం జరిగిన ప్రాంతాలకు తక్షణం అధికార బృందాన్ని పంపి పంట నష్టం అంచనా వేయించాలి. నష్ట పరిహారం చెల్లించాలి.

2. టీఆర్ఎస్ ఎన్నికల హామీ అయిన రూ.లక్ష రుణమాఫీ తక్షణం అమలు చేయాలి.

3. కొనుగోలు కేంద్రాల్లో నిబంధనలకు విరుద్ధంగా తరుగు, తేమ పేరుతో రైతులను దోపిడీ చేస్తోన్న వ్యాపారులపై క్రిమినల్ కేసులు పెట్టాలి.

4. పిడుగుపాటుతో చనిపోయిన రైతుల ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలి.

5. మిర్చీ, పత్తి, పసుపు ఇతర వాణిజ్య పంటల కొనుగోలు, మద్ధతు ధరపై తక్షణం కార్యచరణ రూపొందించాలి.

6. మామిడి, బత్తాయి, ఇతర పండ్ల రైతులను ఆదుకోవడానికి ప్రత్యేక కార్యచరణ రూపొందించాలి.

7. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా కొనుగోలు కేంద్రాల్లో తడిసిపోయిన రైతుల ధాన్యాన్ని మద్ధతు ధరకే కొనుగోలు చేయాలి.

8. ధాన్యంలో తేమ లేకుండా, తాలు లేకుండా కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలన్న నిబంధనను సడలించాలి.

తక్షణం ఈ డిమాండ్ల పరిష్కారానికి చొరవ తీసుకోని పక్షంలో ప్రత్యక్ష కార్యచరణకు దిగాల్సి వస్తుందని ఎంపీ రేవంత్ రెడ్డి హెచ్చరించారు.

For More News..

లాక్డౌన్ తర్వాత ఉద్యమం చేస్తాం

చికిత్స లేకుండానే కరోనాను జయించిన చిన్నారి

లాక్డౌన్ డ్యూటీలో తోటి పోలీసుకు హెయిర్ కట్ చేసిన మరో పోలీస్

రాజ్ భవన్ లో నలుగురికి కరోనా..

మరణశిక్షను రద్దు చేసిన సౌదీ అరేబియా