లీచెట్ ​ట్రీట్​మెంట్ ప్లాంట్​తో ఫాయిదా లేనట్లేనా?

లీచెట్ ​ట్రీట్​మెంట్ ప్లాంట్​తో ఫాయిదా లేనట్లేనా?
  • నేటికీ పూర్తికాని మల్కారం చెరువు క్లీనింగ్
  • పర్యావరణ దినోత్సవం రోజు చూసేందుకు రాని మంత్రి కేటీఆర్
  • రూ.251కోట్లు ఖర్చు చేసినా ప్రయోజనం లేదంటున్న స్థానికులు

హైదరాబాద్, వెలుగు: మురుగు నీటి ప్రాసెసింగ్ కోసం జవహర్ నగర్ డంపింగ్ యార్డు వద్ద ఏర్పాటు చేసిన లీచెట్ ట్రీట్ మెంట్​ప్లాంట్ తో పెద్దగా ఉపయోగం లేనట్లు తెలుస్తోంది. డంపింగ్​యార్డు పరిసర ప్రాంతాల్లో ఎలాంటి మార్పు కనిపించడం లేదని స్థానికులు చెబుతున్నారు. ఈ ప్లాంట్ తో యార్డు చుట్టుపక్కల మురుగు, కలుషిత సమస్య లేకుండా చేస్తామని ప్రభుత్వం, అధికారులు ప్రకటించినప్పటికీ ఫలితం కనిపించడం లేదు. కేవలం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, కోర్టులను తప్పుదారి పట్టించేందుకు హడావిడి చేస్తున్నట్లు ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. డంపింగ్​యార్డు వద్ద ఈ ఏడాది ఏప్రిల్​15న రూ.251కోట్లతో 2 వేల కేఎల్ డీ సామర్థ్యం గల లీచెట్ ట్రీట్ మెంట్ ప్లాంట్ ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. పదేళ్లపాటు దీని నిర్వహణ బాధ్యతలను రాంకీ సంస్థకి అప్పగించారు.

ప్రారంభం రోజున మొదటగా ప్లాంట్​ద్వారా 30 ఎకరాల్లో విస్తరించి ఉన్న మల్కారం చెరువును శుద్ధి చేస్తామని, 2024 ఏప్రిల్ నాటికి డంపింగ్​యార్డు పరిసర ప్రాంతాల్లో లీచెట్ లేకుండా చేస్తామని రాంకీ ప్రతినిధులు చెప్పారు. మే నెలాఖరు లోపు మల్కారం చెరువుని పూర్తిగా శుద్ధి చేయాలని, జూన్​5న పర్యావరణ దినోత్సవాన్ని చెరువు సమీపంలో నిర్వహించేందుకు మళ్లీ వస్తానని కేటీఆర్ తెలిపారు. చెప్పిన విధంగా మల్కారం చెరువు క్లీన్​కాకపోవడంతో కేటీఆర్ ఇక్కడకు రాలేదు.

దుండిగల్ యార్డు ఊసే లేదు

నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ) ఆర్డర్స్​ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్30 నాటిని దుండిగల్ లో డంప్ యార్డు అందుబాటులోకి రావాలి. ఏర్పాటు చేస్తామని ఎన్జీటీకి చెప్పిన జీహెచ్ఎంసీ చేయలేదు. జవహర్​నగర్​డంపింగ్​యార్డుకు వచ్చే చెత్తలో 25 శాతం అక్కడికి వెళ్లాల్సి ఉంది. అధికారుల నిర్లక్ష్యంతో జవహర్​నగర్​యార్డుపై భారం పడుతోంది. మొదట్లో గ్రేటర్​సిటీ నుంచి డైలీ 2,500 నుంచి 3 వేల టన్నుల చెత్త డంపింగ్ యార్డుకి వచ్చేది. అప్పట్లో అందుకు తగ్గట్లు రాంకీ సంస్థ ఏర్పాట్లు చేసుకుంది. ప్రస్తుతం డైలీ 7 వేల టన్నుల చెత్త వస్తుండటంతో సమస్య తీవ్రమైంది. చేసేదేం లేక రాంకీ సంస్థ రోజువారీ చెత్తను డప్పింగ్‌‌ ఫ్లోర్‌‌పై బహిరంగంగా పడేస్తోంది. ఇప్పటికే యార్డులో14 మిలియన్‌‌ టన్నులకుపైగా చెత్త పేరుకుపోయింది. సంగారెడ్డి జిల్లాలోని లక్డారం(దుండిగల్ సమీపంలో), మెదక్ జిల్లా ప్యారేనగర్‌‌(జిన్నారం)లో డంపింగ్​యార్డుల కోసం స్థలాలను ఎంపిక చేసినట్లు రెండేళ్ల కిందట కేటీఆర్​చెప్పినప్పటికీ నేటికీ ప్రారంభించలేదు.

ఓపెనింగ్ రోజు హంగామా

లీచెట్ ట్రీట్ మెంట్ ప్లాంట్ ప్రారంభించే టైంలో అక్కడ శుద్ధి చేస్తున్న నీటిని బయటకు పంపుతున్నట్లు చూపించారు. మురుగునీటిని పూర్తిగా మంచినీటిగా మార్చి చెరువులోకి వదులుతున్నట్లు చెప్పారు. ఆ నీటితో ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉండవని బాతులను కూడా వదిలారు. ఇదంతా ప్రారంభం కోసం చేసిన హంగామా అని స్థానికులు విమర్శిస్తున్నారు. ప్లాంట్​ప్రారంభించి దాదాపు రెండు నెలలు అవుతున్నా మల్కారం చెరువు పూర్తిగా క్లీన్​కాలేదంటే పని తనం ఏమిటో అర్థమవుతోందంటున్నారు. 

18 ప్రాంతాల్లో తీవ్రమైన సమస్య

జవహర్​నగర్​డంపింగ్‌‌యార్డు 351 ఎకరాల విస్తీర్ణంలో ఉండగా, దాని చుట్టుపక్కల 15 నుంచి18 ప్రాంతాలను దుర్గంధం వెంటాడుతోందని స్థానికులు చెబుతున్నారు. జవహర్‌‌నగర్‌‌, దమ్మాయిగూడ, కార్మికనగర్‌‌, బాలాజీనగర్‌‌, గబ్బిలాలపేట, అంబేద్కర్‌‌నగర్‌‌, మల్కారం, రాజీవ్‌‌గాంధీ నగర్‌‌, శాంతి నగర్‌‌, ప్రగతి నగర్‌‌, హరిదాసుపల్లి, చెన్నాయిపల్లి, బీజేఆర్‌‌నగర్‌‌, అహ్మద్‌‌గూడ, తిమ్మాయపల్లి, నాగారం, బండ్లగూడ, రాంపల్లి ప్రాంతాలతోపాటు యాప్రాల్, సైనిక్ పురి, ఈసీఎల్ ప్రాంతాల్లో సాయంత్రం అయిందంటే భరించలేని కంపు కొడుతోందని అంటున్నారు. దీంతో డంపింగ్ యార్డు చుట్టుపక్కల ఇండ్లను జనం ఖాళీ చేస్తున్నారు. కొత్తవారు ఇక్కడకు వచ్చే ధైర్యం చేయడం లేదు.

దమ్మాయిగూడ చెరువుకు మురుగు ఆగలే

ఇదంతా ఓట్ల కోసం చేస్తున్న హడావిడి. ఏండ్లుగా ఏదో ఒక ముచ్చట చెబుతూ బీఆర్ఎస్​ప్రభుత్వం దాటుకుంటోంది. జవహర్​నగర్​పరిసరాల్లోని కలుషిత సమస్యకు పరిష్కారం చూపడంలేదు. రూ.251కోట్లతో ట్రీట్ మెంట్ ప్లాంట్ పెట్టినా ఎలాంటి మార్పు కనిపించడం లేదు. దమ్మాయిగూడ  చెరువులోకి లీచెట్ వచ్చి చేరుతూనే ఉంది. చివరకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ని కూడా జీహెచ్ఎంసీ తప్పుదారి పట్టిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ 30 లోపు దుండిగల్ లో మరో ప్లాంట్ ఏర్పాటు చేస్తామని చెప్పి చేయలేదు. – పద్మాచారి,  వ్యవస్థాపక అధ్యక్షుడు, ఫోరం ఫర్ మేడ్చల్–

మల్కాజిగిరి డిస్ట్రిక్ట్ డెవలప్ మెంట్ నిర్వహణ లోపంతో ఆగమాగం

చెత్త, వ్యర్థాల నిర్వహణ లోపాలతో తమ బతుకులు ఆగమవుతున్నాయని జనం లబోదిబోమంటున్నారు. కొందరు అధికార పార్టీ నేతలు సైతం దుర్గంధంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెత్త నుంచి వచ్చే మురుగుతో మల్కారం చెరువు ఇప్పటికే పూర్తిగా పాడైంది. భూగర్భ జలాలు కలుషితం అవుతున్నాయి. దమ్మాయిగూడ, నాగారం పరిధిలోని సీఎన్ఆర్ కాలనీ, అంజనాద్రి కాలనీ, అంజనాద్రి ఎక్స్ టెన్షన్, ఎంఎల్ఆర్ కాలనీ, సాయి శ్రీనివాస కాలనీల్లోకి డంపింగ్ యార్డు నుంచి మురుగు వస్తోంది. గ్రౌండ్​ వాటర్​ వాడుకోలేకపోతున్నామని, వాటర్ ట్యాంకర్లు పంపించాలని జనం కోరుతున్నారు.