ఖర్గేకే గెలుపు చాన్స్ ..!

ఖర్గేకే గెలుపు చాన్స్ ..!
  • కాంగ్రెస్ చీఫ్​రేసులోకి ఖర్గే
  • గెహ్లాట్, దిగ్విజయ్ తప్పుకోవడంతో రంగంలోకి కర్నాటక నేత 
  • ఖర్గేతో పాటు బరిలో థరూర్, కేఎన్ త్రిపాఠి 
  • గాంధీలు, పార్టీ నేతల మద్దతు ఉండటంతో ఖర్గేకే గెలుపు చాన్స్ 
  • ముగిసిన నామినేషన్ల గడువు.. ఈ నెల 17న ఓటింగ్, 19న రిజల్ట్

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఎన్నిక అనూహ్య మలుపు తిరిగింది. పార్టీ చీఫ్​ రేసు నుంచి రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ తప్పుకోవడంతో పార్టీ సీనియర్ నేతలు దిగ్విజయ్ సింగ్, శశిథరూర్ మధ్య పోటీ ఉంటుందని అంతా భావించారు. కానీ శుక్రవారం నామినేషన్లకు చివరిరోజున అనూహ్యంగా రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే రంగంలోకి దిగారు. ఖర్గేతో పాటు తిరువనంతపురం ఎంపీ శశి థరూర్, జార్ఖండ్ మాజీ మంత్రి కేఎన్ త్రిపాఠి శుక్రవారం నామినేషన్లు దాఖలు చేశారు. ఢిల్లీలోని ఏఐసీసీ హెడ్ ఆఫీసులో కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ చైర్మన్ మధుసూదన్ మిస్త్రీకి వీరు నామినేషన్ డాక్యుమెంట్లను అందజేశారు. శుక్రవారం నాటితో నామినేషన్ల స్వీకరణకు గడువు ముగిసిపోవడంతో ఖర్గే, థరూర్, త్రిపాఠి బరిలో నిలిచారు. ఈ నెల 17న దేశవ్యాప్తంగా 9,100 మంది పార్టీ డెలిగేట్లు ఓటింగ్ లో పాల్గొననున్నారు. ఎన్నిక ఫలితాలు19న విడుదల కానున్నాయి.     

పోటీ నుంచి తప్పుకున్న దిగ్విజయ్ 

కాంగ్రెస్ ప్రెసిడెంట్ రేసు నుంచి ఆ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ తప్పుకున్నారు. తాను నామినేషన్ వేయడంలేదని, ఖర్గేకు మద్దతు ఇస్తున్నానని ఆయన శుక్రవారం వెల్లడించారు. ‘‘ఖర్గేజీ నా సీనియర్. ఆయనపై పోటీ చేయలేను. ఖర్గేకే నా మద్దతు తెలుపుతున్నా” అని చెప్పారు. 

ఖర్గేకే గెలిచే చాన్స్ 

గాంధీ కుటుంబం మద్దతుతో పార్టీ చీఫ్​రేసులోకి దిగిన ఖర్గేకు పార్టీలోని అసమ్మతి గ్రూపు(జీ 23) నేతలు ఆనంద్ శర్మ, పృథ్వీరాజ్ చవాన్, మనీశ్ తివారీ, భూపీందర్ హుడాతో పాటు అశోక్ గెహ్లాట్, దిగ్విజయ్ సింగ్, ఏకే ఆంటోనీ, ముకుల్ వాస్నిక్ వంటి సీనియర్ నేతలు మద్దతు పలికారు. దీంతో ఈ ఎన్నికలో ఆయన ఈజీగా గెలిచే అవకాశాలు కన్పిస్తున్నాయి. మళ్లీ 25 ఏండ్ల తర్వాత గాంధీ కుటుంబానికి వెలుపలి వ్యక్తి పార్టీ ప్రెసిడెంట్ అవ్వడం ఖాయమని స్పష్టమవుతోంది. ఇక పార్టీ పెట్టుకున్న ‘వన్ మ్యాన్, వన్ పోస్ట్’ రూల్ మేరకు పార్టీ చీఫ్​గా ఎన్నికైన వెంటనే రాజ్యసభలో ప్రతిపక్ష నేత పదవికి ఖర్గే రాజీనామా చేయనున్నారు. నామినేషన్ల తర్వాత ఖర్గే మాట్లాడుతూ.. గాంధీలు తనతో సహా ఎవరికీ మద్దతు ఇవ్వడం లేదన్నారు. థరూర్ కూడా ఇదే విషయం చెప్పారు. ఈ ఎన్నికలో గాంధీ కుటుంబం డైరెక్ట్ గా లేదా ఇన్ డైరెక్ట్ గా ఎవరికీ సపోర్ట్ చేయడం లేదన్నారు.