దేశంలో పేదరికం ఎక్కడ తగ్గింది? : ఖర్గే

దేశంలో పేదరికం ఎక్కడ తగ్గింది? : ఖర్గే

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన హౌస్ హోల్డ్ ఎక్స్ పెండిచర్ సర్వే రిపోర్టు తప్పుల తడక అని, అదొక ఎన్నికల స్టంట్ అని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే విమర్శించారు. ‘‘సర్వే రిపోర్టు ప్రకారం దేశంలో పేదరికం 5 శాతానికి తగ్గిందని నీతిఆయోగ్ అధికారులు చెబుతున్నారు. కానీ ఇదే నీతిఆయోగ్ ‘మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్’ రిపోర్టులో దేశంలో పేదరికం 11.28 శాతం ఉన్నదని పేర్కొంది. ఇవి రెండు సర్వేలు కూడా 2022–23కు సంబంధించి చేసినవే” అని మంగళవారం సోషల్ మీడియా ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ‘‘దేశంలో పెరిగిన ద్రవ్యోల్బణాన్ని దాచేందుకు కేంద్రం తప్పుడు డేటా ఇచ్చింది. 

మోదీజీ.. ఇలా తప్పుడు రిపోర్టులతో అంతర్జాతీయంగా దేశం పరువు తీయకండి. మీరిచ్చిన రిపోర్టు ప్రకారం దేశంలో అంతా బాగుంటే.. పేద ప్రజలు రోజుకు కేవలం రూ.46 మాత్రమే ఖర్చు పెడుతున్నారెందుకు? రైతుల నెలవారీ ఇన్ కమ్ రూరల్ ఇండియా సగటు ఆదాయం కంటే తక్కువ ఎందుకు ఉన్నది? దేశంలో కేవలం 5 శాతమే ఉన్న పేదలకు ప్రభుత్వం నుంచి వివిధ స్కీమ్ ల కింద నెలకు రూ.68 మాత్రమే అందుతున్నది ఎందుకు? మరి మిగతాదంతా మీ క్యాపిటలిస్ట్ ఫ్రెండ్స్ కు పోతున్నదా?” అని ప్రశ్నించారు. దేశంలో కులగణనతో పాటు జనగణన చేస్తేనే అసలు నిజాలు బయటకొస్తాయని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ పని పూర్తి చేస్తామని చెప్పారు.

కట్టుకథల రిపోర్టు: సుప్రియ 

దేశంలో పేదరికాన్ని తగ్గించి చూపేందుకు కేంద్రం కట్టుకథతో రిపోర్టు రూపొందించిందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనటే విమర్శించారు. ‘‘దేశంలో పేదరికం 5 శాతానికి తగ్గిందా? అంటే కేవలం 7 కోట్ల మందే పేద ప్రజలు ఉన్నారా? మరి అలాంటప్పుడు 80 కోట్ల మందికి ఫ్రీ రేషన్ ఎందుకిస్తున్నట్టు?” అని ప్రశ్నించారు. రూరల్ ఇండియాలో ఆర్థిక సంక్షోభం నెలకొన్నదని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరాం రమేశ్ అన్నారు. గత 50 ఏండ్లలో మొదటిసారి రూరల్ కన్జంప్షన్ ఎక్స్ పెండిచర్ 8.8% తగ్గిందని పేర్కొన్నారు.