
- ఎన్ని కుట్రలు చేసినా గెలిచేది కాంగ్రెస్సే
- బీఆర్ఎస్, బీజేపీ రెండు ఒక్కటే: మల్లికార్జున ఖర్గే
- రాష్ట్రంలో అవినీతి ప్రధాని మోదీకి కనిపించడం లేదు
- ప్రజలు పోరాడితే.. సోనియా తెలంగాణ ఇచ్చారు
- ఉద్యమాల గడ్డను తాగుబోతుల అడ్డా చేసిన్రు: రేవంత్
- కుత్బుల్లాపూర్‌లో కాంగ్రెస్ విజయభేరి సభ
జీడిమెట్ల, వెలుగు: బీఆర్ఎస్, బీజేపీ నేతలు కలిసి ఎన్ని కుట్రలు చేసి నా కాంగ్రెస్ గెలుపును అడ్డుకోలేరని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే తెలంగాణలో పేదల రాజ్యం వస్తుందన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో శుక్రవారం నిర్వహించిన విజయభేరీ సభలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, కుత్బుల్లాపూర్ అభ్యర్థి కొలను హనుమంతరెడ్డితో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు రెండూ ఒక్కటే అన్నారు. కేసీఆర్ ప్రభుత్వానికి బీజేపీ అంతర్గతంగా సపోర్ట్ చేస్తుందని ఆరోపించారు. ఆ రెండు పార్టీలు కలిసి కాంగ్రెస్‌ను ఓడించాలని చూస్తున్నాయని విమర్శించారు. కానీ అది వారి వల్ల కాదని.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి తీరుతుందని చెప్పారు. ప్రత్యేక తెలంగాణ కోసం ప్రజలు కొట్లాడారు. వారి పోరాటంతోనే తెలంగాణ వచ్చింది. ఆ పోరాటం చూసి తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ అన్నారు.
మోదీ ఎందుకు జైలుకు పంపడం లేదు
కాంగ్రెస్ హయాంలో రాష్ట్రంలో పెద్ద పెద్ద పరిశ్రమలు వచ్చాయని ఖర్గే గుర్తు చేశారు. బీఆర్ఎస్ పాలనలో ఒక్కటైనా పెద్ద పరిశ్రమ తెచ్చారా అని ప్రశ్నించారు. వారి వల్ల తెలంగాణకు ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చే నాటికి తెలంగాణ ధనిక రాష్ట్రం, కానీ ప్రస్తుతం రూ.5 లక్షల కోట్ల అప్పులు చేశారని అన్నారు. ప్రజలను మోసం చేస్తున్న కేసీఆర్‌ను గద్దె దించాలని కోరారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు.
కర్నాటకలో అమలుచేస్తున్న విధంగా ఆరు గ్యారంటీ పథకాలను సైతం అమలు చేస్తామని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే దేశంలో 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ప్రధాని మోదీ యువతను మోసం చేశాడని ఆరోపించారు. రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు, మొదలుకొని ప్రతి పథకం, పనిలో అవినీతి జరుగుతున్నా కేంద్రానికి, సీబీఐ, ఐటీ, ఈడీలకు కనిపించడం లేదని విమర్శించారు. ఈ అవినీతిపరులను మోదీ ఎందుకు జైలుకు పంపడంలేదని ప్రశ్నించారు.
8 వేల మంది రైతుల అత్మహత్యలు
పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ తన పాలనలో ఉద్యమాల గడ్డను తాగుబోతుల అడ్డాగా చేశాడని విమర్శించాడు. ఈ తొమ్మిదేండ్లలో 8 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. కేసీఆర్ ఫ్యామిలీ అవినీతికి మూడేండ్లలోనే కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగాయన్నారు. అన్నారం బ్యారేజీ పగిలిందన్నారు.
కొలన్ హనుమంతరావు దివంగత నేత పీజేఆర్ లాంటివాడు ప్రజలకోసం పాటుపడుతాడు.. ఆయన్ని గెలిపించుకోవాలని ప్రజలు కోరారు. కొంతమంది కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని ప్రశ్నిస్తున్నారని.. ఆ పార్టీ హయాంలో కట్టిన ప్రాజెక్టులు రాష్ట్రంలో 70 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చి రైతులను ఆదుకుంటున్నాయని చెప్పారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా మార్చింది, అవుటర్ రింగురోడ్డు, హైటెక్‌సిటీ, అంతర్జాతీయ ఏయిర్పోర్టు, ఫార్మా కంపెనీలు, మెట్రోరైలు, పారిశ్రామికవాడలు ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీనే అన్నారు.