
న్యూఢిల్లీ: దేశంలో యువతకు ఉపాధి లేకుండా చేయడమే ప్రధాని మోదీ మిషన్అని ఏఐసీసీ చీఫ్ ఖర్గే విమర్శించారు. దేశంలో పెరుగుతున్న నిరుద్యోగ సమస్యను ప్రస్తావిస్తూ కేంద్రంలోని బీజేపీ సర్కారుపై విరుచుకుపడ్డారు. నిరుద్యోగంపై సిటీ గ్రూప్‌లాంటి స్వతంత్ర ఎకనామిక్ రిపోర్ట్‌లను బీజేపీ సర్కారు ఖండిస్తున్నా.. ప్రభుత్వ లెక్కలను ఎలా తిరస్కరిస్తుందని మంగళవారం ఆయన ట్వీట్ చేశారు.
గత పదేండ్లలో మోదీ సర్కారు దేశ యువత కలలను ఛిద్రం చేసిందని మండిపడ్డారు. నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్(ఎన్ఎస్ఎస్వో) వార్షిక సర్వే ప్రకారం..2015–23 మధ్య కాలంలో తయారీ రంగంలో 54 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారని చెప్పారు. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ ప్రకారం నిరుద్యోగ రేటు 9.2 శాతానికి చేరుకున్నదని, మహిళల్లో నిరుద్యోగ రేటు 18.5 శాతంగా ఉందని తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్, సంఘటిత, అసంఘటిత.. ఇలా ఏ రంగం తీసుకున్నా యువతకు ఉద్యోగాలు లేకుండా చేయడమే మోదీ లక్ష్యమని మండిపడ్డారు.