తెలంగాణ ఇచ్చింది కేసీఆర్ కోసం కాదు.. ప్రజల కోసం : ఖర్గే

 తెలంగాణ ఇచ్చింది కేసీఆర్ కోసం కాదు.. ప్రజల కోసం : ఖర్గే

తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌లో ప్రకటించిన 12 హామీలు అమలు చేస్తామని ఏఐసీసీ  చీఫ్‌ మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. ప్రజల అభిష్టం మేరకే తెలంగాణ ఏర్పడిందని, సోనియాగాంధీ చొరవతోనే ప్రత్యేక రాష్ట్రం వచ్చిందన్నారు. తెలంగాణ ప్రజల కలను సోనియాగాంధీ నెరవేర్చారని చెప్పారు. రేవంత్ రెడ్డి ప్రకటించిన 12 డిక్లరేషన్లు ప్రజల కోసమే అని చెప్పారు. అంతకుముందు ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ పోస్టర్లను ఖర్గే విడుదల చేశారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల కేవీఆర్‌ మైదానంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌ పార్టీ ప్రజాగర్జన సభకు ఖర్గే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రభుత్వంపై ఖర్గే నిప్పులు చెరిగారు. 

కేసీఆర్ ను గద్దె దించడానికి ప్రజలు సిద్ధమయ్యారని ఖర్గే చెప్పారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తే ఒక వ్యక్తి చేతుల్లోకి వెళ్లిందన్నారు. తెలంగాణ ఇవ్వగానే కేసీఆర్.. తన కుటుంబ సభ్యులతో కలిసి సోనియాగాంధీతో ఫొటో దిగారని, ఆ తర్వాత బయటకు వచ్చి మాట మార్చారన్నారు. రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వాన్ని పీకి పారేయాలంటూ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కేసీఆర్ పార్టీకి బీజేపీతో దోస్తి ఉందన్నారు ఖర్గే. ఆదివారం (ఆగస్టు 27న) రోజు అమిత్ షా ఖమ్మం వస్తున్నారని, బీఆర్ఎస్, బీజేపీ పార్టీల మధ్య లోపాయికారి ఒప్పందం ఉండడం వల్లే బీఆర్ఎస్ పై అమిత్ షా విమర్శలు చేయరని అన్నారు. కర్నాటకలో ఐదు హామీలు ఇచ్చి.. వాటిని ఇప్పుడు నెరవేరుస్తున్నామన్నారు. కర్నాటక కాంగ్రెస్ సర్కార్ ను బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వాలను ప్రధాని మోదీ ఎన్నిసార్లు తిడతారని ప్రశ్నించారు ఖర్గే. దశాబ్దాలపాటు పాలించిన కాంగ్రెసేతర ప్రభుత్వాలు దేశానికి ఏం చేశాయని ప్రశ్నించారు. నెహ్రూ, పటేల్‌ కలిసి చిన్న చిన్న రాజ్యాలను ఏకం చేశారని చెప్పారు. 53 ఏళ్ల కాంగ్రెస్‌ పరిపాలనలో దేశాన్ని బలోపేతం చేశామన్నారు. ఐఐటీ, ఐఐఎం, ఇస్రో ఏర్పాటు చేసింది ఎవరని ప్రశ్నించారు ఖర్గే.  చారిత్రాత్మక డ్యామ్ లన్నీ కాంగ్రెస్ హయంలో నిర్మించినవే అన్నారు. తెలంగాణలో జమిందారీ వ్యవస్థను ఖతం చేశామన్నారు. 

ఆహార భద్రత చట్టాన్ని తామే తెచ్చామన్నారు. తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులను ఎవరు నిర్మించారని ప్రశ్నించారు. తాము చేసిన పనుల వల్లే ఆహారధాన్యాల ఉత్పత్తి పెరిగిందన్నారు. భూ సంస్కరణలు అమలు చేసి జమీందారీ వ్యవస్థను నిషేధించామన్నారు. బ్యాంకులను జాతీయరణ చేసింది కాంగ్రెస్‌ పార్టీ అని చెప్పారు. ఉపాధి హామీ పథకం చట్టం తెచ్చింది ఎవరన్నారు. హైదరాబాద్‌కు అనేక సంస్థలను కాంగ్రెస్‌ ప్రభుత్వమే ఇచ్చిందన్నారు. దేశంలోని ప్రముఖ కంపెనీలను కాంగ్రెస్‌ ఏర్పాటు చేసిందని తెలిపారు. ప్రతి ఒక్కరి చేతిలో సెల్‌ఫోన్‌ ఉందంటే రాజీవ్‌గాంధీనే కారణమన్నారు. హరిత విప్లం, శ్వేత విప్లవం కాంగ్రెస్‌ హయాంలోనే వచ్చాయన్నారు. కాంగ్రెస్ చేపట్టిన కార్యక్రమాల వల్లే మహిళా అక్షరాస్యత 65 శాతమైందన్నారు. విద్యా, వైద్య రంగాల్లో అనేక సంస్కరణలు చేపట్టామని చెప్పారు. ప్రజాస్వామ్య దేశం వల్లే తాను కాంగ్రెస్ అధ్యక్షుడిని అయ్యానన్నారు.

శిశు మరణాలు ఎక్కువగా గుజరాత్ లోనే ఉన్నాయన్నారు. చైనా దేశం ఇండియాకు చెందిన ఎంత భూభాగం అక్రమించిందో రాహుల్ గాంధీ పరిశీలించారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో గెలిచేది కాంగ్రెస్సే అని చెప్పారు. మోదీ, కేసీఆర్ ప్రభుత్వాలను గద్దె దించేందుకు ప్రజలు సిద్ధమయ్యారని తెలిపారు ఖర్గే. రాహుల్ ఏ హామీ ఇచ్చినా నెరవేర్చి తీరుతారని అన్నారు.