ఏడు విభాగాలకు ఇద్దరే !..మల్యాల కేవీకేను వేధిస్తోన్న శాస్త్రవేత్తలు కొరత

ఏడు విభాగాలకు ఇద్దరే !..మల్యాల కేవీకేను వేధిస్తోన్న శాస్త్రవేత్తలు కొరత

 

  • ఏండ్లుగా ఖాళీగా ఉంటున్న పోస్టులు
  • క్షేత్రస్థాయిలో అన్నదాతలకు అందని సలహాలు, సూచనలు
  • ఖాళీలను భర్తీ చేయాలని కోరుతున్న పలువురు రైతులు

మహబూబాబాద్, వెలుగు : మహబూబాబాద్ ​జిల్లా మల్యాల కృషి విజ్ఞాన కేంద్రం(కేవీకే), జన్నారెడ్డి వెంకటరెడ్డి, ఉద్యాన పరిశోధన కేంద్రం(జేవీఆర్ హెచ్ఆర్ఎస్)లను శాస్త్రవేత్తల కొరత వేధిస్తోంది. కొన్నేండ్లుగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రైతులకు వ్యవసాయ, అనుబంధ రంగాల్లో విస్తరణ, పరిశోధనకుగాను సేవలను అందిస్తోంది. 

వివిధ  విభాగాల్లో పరిశోధనలు చేసేందుకు, రైతులకు అవగాహన కల్పించేందుకు ఏండ్లుగా శాస్త్రవేత్తలు లేకపోవడంతో  కేవీకే పూర్తిస్థాయిలో సేవలను అందించలేని పరిస్థితి ఉంది. ఇటీవల ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ వర్సిటీ పరిధిలోని కేవీకేలకు చెందిన శాస్త్రవేత్తలను బదిలీ చేశారు. 

ఇందులో భాగంగా మల్యాల కేవీకే, జేవీఆర్ హెచ్ఏఎస్ నుంచి ఇద్దరు బదిలీపై వెళ్లారు. ప్రస్తుతం ఏడు విభాగాల్లో ఇద్దరే శాస్త్రవేత్తలు మిగిలారు. వరంగల్ కేవీకే నుంచి ముగ్గురు శాస్త్రవేత్తలు వస్తారని భావించగా, నిరాశే  మిగిలింది. ప్రస్తుతం సమన్వయకర్తతో పాటు పంట ఉత్పాదకత, ఉద్యాన విభాగ శాస్త్రవేత్తలే ఏడు విభాగాలను చూస్తున్నారు.  

సలహాలు, సూచనలు ఇచ్చేవారు లేక..

మల్యాల కేవీకే విస్తరణ విభాగ శాస్త్రవేత్త బదిలీ కావడంతో ఖాళీగా ఉంది. కేవీకేలో విస్తరణ విభాగ సేవలే ప్రధానంగా ఉంటాయి. కొత్త వ్యవసాయ విధానాలు, యాజమాన్య పద్ధతులు, కొత్త వంగడాల పరిచయం, వాటిపై క్షేత్రస్థాయిలో ప్రదర్శనలు, రైతులకు అవగాహన, శిక్షణ వంటి పలు కార్యక్రమాలను  ఈ విభాగం నిర్వహిస్తుంది.  గృహ విజ్ఞాన శాస్త్రవేత్త పోస్టు ఐదేండ్లుగా ఖాళీగా ఉంది.

 మహిళా రైతులకు ఆరోగ్యపరమైన చైతన్యం కలిగించేందుకు, విలువ ఆధారిత ఆహార ఉత్పత్తుల తయారీ, పౌష్టికాహారంపై శిక్షణ అందించాల్సి ఉంటుంది.  పశుసంవర్ధక, మత్స్య విభాగ శాస్త్రవేత్త పోస్టు పదేండ్లుగా భర్తీ కాలేదు.  దీంతో పాడి పరిశ్రమ, కోళ్ల పెంపకం, జీవాల జబ్బుల నివారణ వంటి  అంశాల్లో రైతులకు సలహాలు ఇచ్చేవారే లేరు. 

పంటల రక్షణ విభాగంలోనూ మూడేండ్లుగా పోస్టు ఖాళీగా ఉంది.  జిల్లాలో ప్రధాన పంటలైన వరి, పత్తి, మొక్కజొన్న మిర్చికి ఏటా తెగుళ్లు, చీడపీడల సమస్య తలెత్తుంది. ఆ సమస్యల పరిష్కారానికి యాజమాన్య సలహాలు ఇవ్వాల్సిన శాస్త్రవేత్త లేక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

రెండు విభాగాల్లోనూ ఇద్దరే..

జేవీఆర్ హెచ్ఎర్ఎస్ పరిశోధన స్థానంలో నలుగురు శాస్త్రవేత్తలు ఉండాలి.  కానీ  ఇద్దరే ఉన్నారు. ఉద్యాన, పైథాలజీ విభాగాల్లోనే శాస్త్రవేత్తలు ఉన్నారు.  మిరప, మామిడి, సపోటా, జామ వంటి ఇతర ఉద్యానవన పంటల్లో పరిశోధనకు పేరొందిన ఈ పరిశోధన స్థానంలో ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని రైతులు కోరుతున్నారు.

ఖాళీల భర్తీపై  ప్రభుత్వానికి నివేదించాం..

మల్యాల కృషి విజ్ఞాన కేంద్రంలో శాస్త్రవేత్తల కొరతను తీర్చేందుకు తాత్కాలిక పద్ధతిలో నియామకానికి ప్రభుత్వానికి నివేదిక పంపించాం.  అనుమతి రాగానే భర్తీ చేస్తామని మల్యాల కృషి విజ్ఞాన కేంద్రం ఇన్ చార్జ్  దిలీప్ కుమార్ తెలిపారు.