ఇంకో 3 నెలల్లో మామాఎర్త్ ఐపీఓ..సేల్స్ రూ.1,000 కోట్లు దాటాయన్న కంపెనీ ఫౌండర్ ఘజల్‌‌ అలగ్‌‌ 

ఇంకో 3 నెలల్లో మామాఎర్త్ ఐపీఓ..సేల్స్ రూ.1,000 కోట్లు దాటాయన్న కంపెనీ ఫౌండర్ ఘజల్‌‌ అలగ్‌‌ 

హైదరాబాద్‌‌, వెలుగు: పర్సనల్ కేర్ సెగ్మెంట్‌‌లో ఉన్న  హోనాస (మామాఎర్త్‌‌)  ఇంకో మూడు నుంచి నాలుగు నెలల్లో ఐపీఓకి  వస్తామని ప్రకటించింది. కంపెనీ ఇప్పటికే  ఐపీఓ పేపర్లను సెబీ దగ్గర సబ్మిట్ చేసింది. మామాఎర్త్‌‌ గురువారం హైదరాబాద్‌‌లోని ఎల్ అండ్ టీ మెట్రో మాల్‌‌లో తమ ఫ్లాగ్‌‌షిప్‌‌ స్టోర్‌‌‌‌ను ఓపెన్ చేసింది. ఈ స్టోర్ మొత్తం 504 చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉంది.  దేశం మొత్తం మీద 85 స్టోర్లను ఆపరేట్ చేస్తున్నామని,  మరిన్ని స్టోర్లను ఏర్పాటు చేస్తామని కంపెనీ ఫౌండర్‌‌‌‌ ఘజల్‌‌ అలగ్‌‌ అన్నారు.

2022–23 లో  తమ సేల్స్ మార్క్ రూ. వెయ్యి కోట్లు దాటిందని, ప్రాఫిట్‌‌లో ఉన్నామని వివరించారు. చివరిసారిగా 1.2 బిలియన్ డాలర్ల వాల్యుయేషన్ దగ్గర ఫండ్స్ సేకరించామని చెప్పారు. 2016 లో స్టార్ట్‌‌ అయిన ఈ కంపెనీ మొదట బేబి కేర్ ప్రొడక్ట్‌‌లను మాత్రమే అమ్మేది. ఆ తర్వాత మెన్‌‌, వుమెన్‌‌ కోసం పర్సనల్‌‌ కేర్ ప్రొడక్ట్‌‌లను తీసుకురావడం ప్రారంభించింది. ప్రస్తుతం 350 ప్రొడక్ట్‌‌లను మామాఎర్త్‌‌ మార్కెట్‌‌లో అమ్ముతోంది.

హైదరాబాద్‌‌లో ఓ  రీసెర్చ్‌‌ అండ్ డెవలప్‌‌మెంట్ సెంటర్‌‌‌‌ను పెట్టే ఆలోచనలో ఉన్నామని ఘజల్ అన్నారు. కాగా, ఐపీఓకి ముందు ఫిడిలిటీ, జీఐసీ, ఖతర్‌‌‌‌ ఇన్వెస్ట్‌‌మెంట్ అథారిటీ (క్యూఐఏ) వంటి ఇన్వెస్టర్ల నుంచి 150 మిలియన్ డాలర్లను మామాఎర్త్ సేకరించనుందనే  రూమర్స్ వస్తున్నాయి. దీనిపై ఘజల్ స్పందిస్తూ  తాము ప్రాఫిట్‌‌లో ఉన్నామని, ఇన్వెస్టర్ల నుంచి ఫండ్స్‌‌ సేకరించడం లేదని చెప్పారు.