కంపెనీ పెట్టిన రెండేండ్లలోనే ఇరవై కోట్ల టర్నోవర్

కంపెనీ పెట్టిన రెండేండ్లలోనే ఇరవై కోట్ల  టర్నోవర్

‘‘ఎన్నిసార్లు ఫెయిల్​ అయ్యామన్నది విషయం కాదు. ఆ ఫెయిల్యూర్​కి ఎలా రెస్పాండ్​ అవుతున్నామన్నది ముఖ్యం’’ అంటుంది  ‘మమాఎర్త్​’ ఫౌండర్​  గజల్​ అలగ్​.  ఈమె ఎంట్రప్రెనూర్​ జర్నీ చూస్తే.. తాను నమ్మింది అక్షరాల నిజమని అర్థం అవుతుంది. కంపెనీ పెట్టిన రెండేండ్లలోనే ఇరవై కోట్ల  రూపాయల టర్నోవర్​ సాధించింది. ఆ తర్వాతి మూడేండ్లలోనే 1,200 కోట్ల రూపాయల రెవెన్యూని చేరుకుంది.  అలాగని బిజినెస్​లో ఎలాంటి డిగ్రీలు చేయలేదు గజల్​. తన కొడుకుకి వచ్చిన ఓ  సమస్యకి సొల్యూషన్​ వెతుకుతూ ఇంత పెద్ద కంపెనీ పెట్టింది.

చండీగఢ్​​​లో  ఉమ్మడి కుటుంబంలో పుట్టి, పెరిగింది గజల్​. పెద్దగా ఆస్తిపాస్తులు లేవు. ‘నీ జీవితానికి సంబంధించిన నిర్ణయాలు నువ్వే తీసుకోవాలంటే.. నీ కాళ్లపై నువ్వు నిలబడాలి. ఆర్థికంగా ఒకరిమీద ఆధారపడకూడద’ని వాళ్ల నాన్న ఎప్పుడూ చెప్తుండేవాడు. అందుకే చిన్నప్పట్నించీ చదువులో ముందుంది గజల్​. గ్రాడ్యుయేషన్​ పూర్తవ్వకముందే ఉద్యోగం తెచ్చుకుంది. ఆ తర్వాత  పెండ్లి , తల్లి కాబోతుందన్న వార్త పట్టరాని సంతోషాన్నిచ్చాయి ఆమెకి. కానీ, కొడుకు అగస్త్యకి ఏ క్రీమ్​, లోషన్​ రాసినా వెంటనే ర్యాషెస్​ వచ్చేవి.  వాటిని తట్టుకోలేక కొడుకు ఏడుస్తుంటే.. తల్లిగా చూడలేకపోయింది. మార్కెట్​లో ఉన్న ఏ ప్రొడక్ట్ వాడినా ఇదే పరిస్థితి. ఏ హాస్పిటల్​కి వెళ్లినా సొల్యూషన్​ దొరకలేదు. చివరి ప్రయత్నంగా విదేశాల్లో తయారైన ప్రొడక్ట్స్​ని వాడింది. ఆశ్చర్యంగా అవి ఎలాంటి రియాక్షన్​ చూపించలేదు. అప్పుడు ఆలోచనలో పడింది. 

నువ్వెందుకు చేయకూడదన్నారు

ఆరోజు నుంచి ప్రొడక్ట్స్​​ లేబుల్స్​ని చెక్​ చేయడం మొదలుపెట్టింది గజల్​. ఇంటర్నేషనల్​​ ప్రొడక్ట్స్​.. అలాగే మన మార్కెట్​లో ఉన్న ప్రొడక్ట్స్ తయారీలో వాడుతున్న ఇంగ్రెడియెంట్స్​ని స్టడీ చేసింది. అందులో భాగంగా..చాలా దేశాల్లో పిల్లల స్కిన్​ కేర్​ ప్రొడక్ట్స్​కి సంబంధించి.. 1,500 లకి పైగా ఇంగ్రెడియెంట్స్​ని బ్యాన్​ చేశారని తెలుసుకుంది. కానీ, మన దగ్గర అలాంటి పరిస్థితులేం లేవు. దానివల్ల అసలు పిల్లలకి ఏ ప్రొడక్ట్ సేఫ్​  అన్నది పేరెంట్స్​ తెలుసుకోలేకపోతున్నారని అర్థం చేసుకుంది. పిల్లల కోసం ప్రొడక్ట్స్​ తయారుచేస్తున్న కంపెనీలకి వెళ్లింది. ‘ఇతర దేశాల్లో వాడుతున్న ఇంగ్రెడియెంట్స్​.. ఇక్కడ దొరకవా?’ అని అడిగితే.. అవన్నీ  ఇక్కడి నుంచే బయటి దేశాలకు వెళ్తున్నాయని చెప్పారు. అదే విషయాన్ని భర్త వరుణ్​ అలగ్​కి చెప్తే.. ‘నువ్వెందుకు ట్రై చేయకూడదు ’ అన్నాడు.  అప్పుడే ఆమె ఎంట్రప్రెనూర్​ జర్నీకి మొదటి అడుగు పడింది. 

ధైర్యం చేశా.. 

‘పిల్లల ఒంటికి ఏది సేఫ్​? ఏది కాదు? అన్నది చెప్పాలనుకున్నా. నా కొడుకు లాంటి మరెందరో పిల్లల కోసం కెమికల్​ ఫ్రీ ప్రొడక్ట్స్​ని తేవాలనుకున్నా. ఇండియన్​ యూజర్స్​ ఛాయిస్​ మార్చాలనుకున్నా. అందుకు చాలా రీసెర్చ్​ చేశా. 2016 లో  ఇన్వెస్టర్ల చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగి రూ.90 లక్షలు జమచేసి ఆరు బేబీ ప్రొడక్ట్స్​ తీసుకొచ్చా. వాట్సాప్​ గ్రూప్​ల ద్వారా వేలమంది తల్లులతో కనెక్ట్​ అయి..  టెస్టింగ్​ కోసం వాళ్లకి ప్రొడక్ట్స్​​ పంపించా. వాళ్లలో చాలామంది ‘మీ ప్రొడక్ట్స్​ సేఫ్ అని మేము ఎలా నమ్మాలి? ’ అన్నారు. ఆలోచిస్తే ఆ  ప్రశ్నలు కరెక్టే అనిపించాయి. వాటికి సమాధానంగా ‘మేడ్​సేఫ్’​ అనే నాన్​ ప్రాఫిట్​ ఆర్గనైజేషన్​కి ప్రొడక్ట్స్​ శాంపిల్స్​ పంపించాం. వాళ్లు ఫలానా ప్రొడక్ట్స్​ పిల్లల స్కిన్​కి, ఎన్విరాన్​మెంట్​కి మంచిదా? కాదా? అని టెస్ట్​ చేస్తారు. అలా అన్ని విధాలా ప్రొడక్ట్స్​ సేఫ్​ అనిపించాకే మార్కెట్​లోకి తీసుకొచ్చాం.  నోటి మాట ద్వారానే ప్రొడక్ట్స్​ అన్నింటికీ మంచి రీచ్​ వచ్చింది. దాంతో చాలామంది తల్లులు.. ‘బిడ్డకి జన్మనిచ్చేది తల్లి కదా! మరి మా కోసం ప్రొడక్ట్స్​ తయారుచేయరా’ అని అడిగారు. వాళ్లకోసం కెమికల్స్​ లేని ప్రొడక్ట్స్​ తయారుచేశాం. ఆ తర్వాత కొద్దిరోజులకు  ఒక క్యాంపెయిన్​కి వెళ్తే ‘‘అమ్మల కోసమేనా..నాన్నలు కూడా బిడ్డల్ని జాగ్రత్తగా చూసుకుంటారు కదా!’’ అన్నారు. దాంతో పిల్లల కోసం మొదలు పెట్టిన మమాఎర్త్​ని ఫ్యామిలీ బ్రాండ్​గా మార్చాం. వ్లాగర్స్​, యూట్యూబర్స్​తో కలిసి మార్కెటింగ్​ చేయించాం.  దీనంతటికి మా ఆయన వరుణ్​ చాలా సపోర్ట్​ చేశారు. మమాఎర్త్​ కో– ఫౌండర్​గా  కంపెనీని జనాల్లోకి తీసుకెళ్లడానికి అన్ని విధాల ప్రయత్నించారు. 

‘అప్పటివరకు సంపాదించుకున్న ఐదు పది కూడా బిజినెస్​లోనే పెడుతుంటే...మా అమ్మానాన్న కూడా ‘ఏం చేస్తున్నావో తెలుస్తోందా’? అని అడిగారు . అయినా.. మా మీద మాకున్న నమ్మకంతో ముందుకెళ్లాం. మా ప్రొడక్ట్స్​ని​ ఒక బ్రాండ్​గా తీర్చిదిద్దడానికి రేయింబవళ్లు కష్టపడ్డాం. రోజుకి రెండుమూడు గంటలు మాత్రమే  పడుకున్న రోజులున్నాయ్​. ఆ కష్టమే ఈ రోజు మమాఎర్త్​ని​ ఇక్కడి వరకు తీసుకొచ్చింది. ఎలాంటి బిజినెస్​ డిగ్రీ, ఎక్స్​పీరియెన్స్​ లేకుండా నేను ఇక్కడి వరకు రాగలిగినప్పుడు.. తలుచుకుంటే ఎవరైనా రాగలరు. దానికి కావాల్సిందల్లా అనుకున్నది సాధించాలన్న పట్టుదల, మొండితనమే’.