బెంగాల్ సర్కార్ ను ఏంచేద్దాం?..కేంద్రం తర్జనభర్జన

బెంగాల్ సర్కార్ ను ఏంచేద్దాం?..కేంద్రం తర్జనభర్జన

కోల్కతా/న్యూఢిల్లీవెస్ట్​బెంగాల్​లో ఎన్నికల తర్వాత కొనసాగుతున్న హింసా రాజకీయాలు మరింత వేడెక్కాయి. తమ పార్టీకి చెందిన నలుగురు కార్యకర్తల హత్యల్ని నిరసిస్తూ బీజేపీ సోమవారం 12 గంటల రాష్ట్ర బంద్​ నిర్వహించింది. హత్యలు చోటుచేసుకున్న నార్త్​ పరగణాస్​​ జిల్లాతోపాటు చాలా చోట్ల రాస్తా, రైల్​ రోకో చేపట్టారు. ఇంకొన్ని చోట్ల బీజేపీ, టీఎంసీ కార్యకర్తల మధ్య ఘర్షణలు కొనసాగాయి. బెంగాల్​ గవర్నర్​ కేసరినాథ్​ త్రిపాఠి సోమవారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్​ షాలను కలిసి రాష్ట్రంలో పరిస్థితుల్ని వివరించారు. హింస ఇలాగే కొనసాగిన పక్షంలో బెంగాల్​లో రాష్ట్రపతి పాలన విధించే దిశగా కేంద్రం ఆలోచిస్తున్నట్లు సమాచారం. దానిపై గవర్నర్ కూడా మాట్లాడటంతో ఊహాగానాలు పెరిగాయి.

మరోవైపు, కేంద్ర హోం శాఖ జారీచేసిన అడ్వైజరీ నోట్​పై అభ్యంతరం చెబుతూ టీఎంసీ సోమవారం మంత్రి అమిత్​ షాకు ఘాటు లేఖరాసింది. వెస్ట్​ బెంగాల్​లో మమత సర్కార్​ను కూలగొట్టేందుకు కేంద్రం, బీజేపీ కుట్రలు పన్నాయని, హోం శాఖ సూచనలు​ కూడా అందులో భాగమేనని లేఖలో మండిపడింది. నార్త్​పరగణాస్​ జిల్లా సందేశ్​ఖలీ ఏరియాలో నలుగురు బీజేపీ, ఒక టీఎంసీ కార్యకర్తల మృతదేహాలు లభ్యం కావడం, మరికొందరు కనిపించకుండా పోవడం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో శాంతిభద్రతలపై సీఎం మమతా బెనర్జీ సోమవారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన ఆమె, అల్లర్లకు కారణం కేంద్రం, బీజేపీలేనని ఆరోపించారు.

షా కళ్లుమూసుకుని సంతకం చేశారు

బెంగాల్​లో  ఏం జరుగుతున్నదో కనీసం రాష్ట్ర ప్రభుత్వాన్నైనా అడగకుండా కేంద్ర హోం శాఖ ఏకపక్షంగా అడ్వైజరీ జారీచేసిందని, కాబట్టే ఆ నోట్​ను తిరస్కరిస్తున్నామని టీఎంసీ సెక్రటరీ జనరల్​, మంత్రి పార్థ ఛటర్జీ చెప్పారు. ‘‘ఎన్నికల తర్వాత ఉత్తరప్రదేశ్​లో 25 మంది యాదవులు హత్యకు గురయ్యారు. గుజరాత్​లో కూడా హింస జరిగింది. మరి ఆ రాష్ట్రాలను కేంద్రం అడ్వైజ్​ చేయలేదెందుకు?  బెంగాల్​ బీజేపీ నేతలు రాసిచ్చిన నోట్​పై మంత్రి అమిత్​ షా కళ్లుమూసుకుని సంతకం చేసినట్లున్నారు.  ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్ని కైవసం చేసుకోవడానికి సంఘవిద్రోహశక్తులతో కలిసి బీజేపీ కుట్రలు చేస్తున్నదనడానికి తమ దగ్గర బలమైన ఆధారాలున్నాయి’’అని ఛటర్జీ తెలిపారు. అల్లర్లను నియంత్రించడానికి బెంగాల్ పోలీసులు అన్ని చర్యలు చేపట్టారని, ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని బెంగాల్​ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మలయ్​కుమార్​ డే పేర్కొన్నారు.

బీజేపీ యూటర్న్​

బెంగాల్​లో రాష్ట్రపతి పాలన విధించాలంటూ కొద్దిరోజులుగా డిమాండ్ చేస్తున్న బీజేపీ.. ప్రధానితో గవర్నర్​ భేటీ తర్వాత యూటర్న్​ తీసుకుంది. రాష్ట్రపతి పాలన అవసరంలేదని, సీఎం మమతా బెనర్జీ కార్యక్రమాలపై నిషేధం విధిస్తే సరిపోతుందని ప్రకటన చేసింది. ‘‘టీఎంసీ సీట్లు గెల్చుకున్న స్థానాల్లో విజయోత్సవాలు చేసుకుంటున్నారు. అదే మేం గెలిచిన చోట్ల ర్యాలీలు తీస్తే పోలీసులు అడ్డుకుంటున్నారు. ఎన్నికల తర్వాత హింస కొనసాగడానికి ఇదే ప్రధాన కారణం. కాబట్టి సీఎం మమత, టీఎంసీ కార్యక్రమాలపై నిషేధం విధిస్తే పరిస్థితి అదుపులోకి వస్తుంది’’అని బీజేపీ జనరల్​ సెక్రటరీ కైలాశ్ విజయ్​ వర్గియా అన్నారు.

మోడీ, షాతో గవర్నర్ భేటీ..

సోమవారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్​ షాతో భేటీ అనంతరం బెంగాల్​ గవర్నర్​ త్రిపాఠి మీడియాతో మాట్లాడారు. పీఎం, హెచ్​ఎంను మర్యాదపూర్వకంగా కలిశానని, రాష్ట్రంలో పరిస్థితులపై బ్రీఫింగ్​ ఇచ్చానని చెప్పారు. ‘బీజేపీ నేతలు రాష్ట్రపతి పాలన డిమాండ్​పై మీరేమంటారు?’ అన్న ప్రశ్నకు మాత్రం, ‘‘అవసరం ఉండొచ్చు. అలాంటి డిమాండ్​ను కేంద్రం పరిశీలిస్తుంది. అయితే  ప్రధానితో ఈ అంశంపై చర్చించలేదు”అని త్రిపాఠి​ బదులివ్వడం గమనార్హం. బెంగాల్​ గవర్నర్​ బీజేపీ బ్లాక్​ అధ్యక్షుడిలా వ్యవహరిస్తున్నారన్న సీఎం మమత వ్యాఖ్యలపై స్పందిస్తూ,  బెంగాల్​లో ప్రతి పౌరుడూ గవర్నరేనని, ఎవరేమన్నా పట్టించుకోనని త్రిపాఠి చెప్పారు.

ఇదంతా బీజేపీ గేమ్ప్లాన్: మమత

లా అండ్​ ఆర్డర్​పై రివ్యూ మీటింగ్ తర్వాత సీఎం మమతా బెనర్జీ మీడియాతో మాట్లాడారు. బెంగాల్​లో అల్లర్లు సృష్టించేందుకు బీజేపీ కోట్ల రూపాయలు కుమ్మరిస్తున్నదని ఆరోపించారు. ‘‘ఇదంతా బీజేపీ గేమ్​ ప్లాన్​. సోషల్​ మీడియాలో తప్పుడు వార్తలు ప్రచారం చేస్తూ ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. వాళ్లను ప్రశ్నించేది, నిలదీసేది దేశంలో నేనొక్కదాన్నే. కాబట్టే నా గొంతు నొక్కాలని చూస్తున్నారు. అడ్డదారిలో బెంగాల్​లో అధికారం చేపట్టాలనుకుంటున్న బీజేపీ కలల్ని నెరవేరనివ్వను. రాష్ట్రంలో జరిగే హింసకు కేంద్రమే బాధ్యత వహించాలి. మా ప్రభుత్వం ఫెయిలైందని చెప్పడానికే పై నుంచి అడ్వైజరీ నోట్​పంపారు. దానికి సీఎస్​తోపాటు టీఎంసీ కూడా గట్టిగా బదులిచ్చారు.