ఎన్నికల అక్రమాలకు పాల్పడుతున్న బీజేపీ, సీఆర్పీఎఫ్ వాహనాల ద్వారా వెస్ట్ బెంగాల్‌కు డబ్బులు తరలిస్తున్నదంటూ మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు చేశారు. మంగళవారం కోల్‌కతాలో ఎన్నికల ప్రచార సభలో మాట్లాడిన ఆమె, బెంగాల్‌ను అవమానించినందుకు అమిత్‌షా.. చెవులు పట్టుకుని గుంజీలు తీయాలన్నారు. ‘‘బీజేపీ పార్టీ గల్లీ స్థాయి నేతలకు కూడా కేంద్ర పోలీసుల భద్రత కల్పించారు. వాళ్లంతా సీఆర్పీఎఫ్ వాహనాల ద్వారా అక్రమంగా డబ్బులు తరలిస్తూ ఓటర్లకు పంచుతున్నారు. కోల్‌కతా, విధాన్‌నగర్ పోలీస్ కమిషనర్లను ఎలక్షన్ కమిషన్ బదిలీ చేసిన తర్వాత డబ్బుల ప్రవాహం ఇంకా పెరిగింది.
డబ్బులు పంచిందెవరో, తీసుకున్నదెవరో ఎన్నికల తర్వాత అందరి పని పడతా’’అని మమత చెప్పారు. ‘కంగాళ్ బెంగాల్’ అంటూ రాష్ట్రాన్ని అవమానించేలా మాట్లాడినందుకు బీజేపీ చీఫ్ అమిత్‌షా గుంజీలు తీయాలని ఆమె మండిపడ్డారు. ‘‘అసలు కంగాళ్ అనే పదానికి అర్థం షాకు తెలుసా? ఎంత ధైర్యముంటే ఆయనా మాటంటాడు? బెంగాల్‌ని బికారి(కంగాళ్) అన్నందుకు షా తన రెండు చెవులు పట్టుకుని గుంజీలు తీయాలె”అని మమత ఫైరయ్యారు. ఆదివారం ఓ సభలో మాట్లాడిన బీజేపీ చీఫ్ షా.. మమత పాలనలో ‘సోనర్(బంగారు) బెంగాల్ కాస్తా కంగాళ్(బికారి) బెంగాల్’గా తయారైందని విమర్శించారు. మంగళవారం కోల్‌కతా సిటీలో ఆయన నిర్వహించిన రోడ్‌షో ఉద్రిక్తతలకు దారితీసింది. ఏడో ఫేజ్‌లో భాగంగా వెస్ట్ బెంగాల్ లోని 9 లోక్‌సభ స్థానాలకు 19న పోలింగ్ జరుగనుంది.