ఆసిఫాబాద్‌‌ జిల్లాలో మంత్రాలు చేస్తున్నాడన్న అనుమానంతో వ్యక్తి హత్య

ఆసిఫాబాద్‌‌ జిల్లాలో మంత్రాలు చేస్తున్నాడన్న అనుమానంతో వ్యక్తి హత్య
  • ఆసిఫాబాద్‌‌ జిల్లా తిర్యాణి మండలంలో దారుణం

తిర్యాణి, వెలుగు : మంత్రాలు చేస్తున్నాడన్న అనుమానంతో గొడ్డలితో దాడి చేసి ఓ వ్యక్తిని హత్య చేశారు. ఈ ఘటన కుమ్రంభీం ఆసిఫాబాద్‌‌ జిల్లా తిర్యాణి మండలం పీట్టగూడ గ్రామంలో శనివారం రాత్రి జరిగింది. రెబ్బెన సీఐ సంజయ్‌‌ తెలిపిన వివరాల ప్రకారం... మంగి గ్రామ పంచాయతీ పరిధిలోని పిట్టగూడకు చెందిన హన్మంత్‌‌రావు (50) శనివారం రాత్రి అదే గ్రామానికి చెందిన సీడాం వినోద్‌‌ ఇంటి సమీపం నుంచి వెళ్తున్నాడు. 

ఈ క్రమంలో హన్మంత్‌‌రావు మంత్రాలు చేస్తున్నాడని అనుమానించిన వినోద్‌‌ అతడితో గొడవ పడ్డాడు. ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో ఆగ్రహానికి గురైన వినోద్‌‌ గొడ్డలితో హన్మంత్‌‌రావుపై దాడి చేశాడు. గమనించిన హన్మంత్‌‌రావు భార్య బొజ్జబాయి అడ్డుకునే ప్రయత్నం చేయగా.. ఆమెపై కూడా దాడి చేసేందుకు యత్నించడంతో ఇంట్లోకి పరుగెత్తింది. తీవ్రంగా గాయపడ్డ హన్మంత్‌‌రావు అక్కడికక్కడే చనిపోయాడు. విషయం తెలుసుకున్న తిర్యాణి పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.