హిందూ ఫ్రెండ్ కోసం రంజాన్ దీక్షను విరమించాడు

హిందూ ఫ్రెండ్ కోసం రంజాన్ దీక్షను విరమించాడు

హిందూ ముస్లిం భాయీభాయీ అనే పదానికి నిదర్శనంగా నిలిచాడు ఓ ముస్లిం యువకుడు. హిందూ ఫ్రెండ్ కోసం పవిత్రమైన రంజాన్ రోజాను విరమించాడు. అనారోగ్యంతో బాధపడుతున్న తన  ఫ్రెండ్ కు అత్యవసరంగా రక్తం కావాలి. దీంతో అతడు రక్తదానం చేయాలనుకున్నాడు. కానీ రంజాన్ ఉపవాసం ఉండటంతో అతడు మీ తినకూడదు. దీంతో అటు ఫ్రెండ్ ప్రాణాలా..ఇటు దేవుడిపై ఉన్న భక్తి ముఖ్యమా అనుకున్నాడు. వెంటనే దేవుడికి భక్తితో మొక్కి తన ఉపవాసాన్ని విరమించుకున్నాడు. ఫ్రెండ్ కు రక్తదానం చేయడం కోసం పండ్లు, అన్నం తిన్నాడు. ఈ సంఘటన అసోంలో జరుగగా సోషల్ మీడియాలో ముస్లిం యువకుడు చేసిన మంచి పనికి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

అసోంలోని మంగలోదోయ్‌కి చెందిన పలావుల్లా అహ్మద్ అనే యువకుడు ఓ సూపర్ స్పెషాలిటీ హస్పిటల్ లో పనిచేస్తూ ఉంటాడు. అదే హస్పిటల్ లో తన ఫ్రెండ్ తపోష్ గొగోయ్‌ అనారోగ్యంతో చేరాడు. తపోష్ గొగోయ్‌కి ఆపరేషన్ చేయాలని తెలిపారు డాక్టర్లు. అందుకు బీ పాజిటివ్ బ్లడ్ అవసరం అయ్యింది. ఆ సమయంలో హస్పిటల్ లో బ్లడ్ అందుబాటులో లేదు. దీంతో వెంటనే పలావుల్లా అహ్మద్ ముందుకొచ్చాడు. బ్లడ్ డొనేట్ చేసిన తర్వాత డాక్టర్లు తక్షణ శక్తి కోసం ఓ పండో, లేకపోతే జ్యూస్ అందిస్తారు. అయితే, రంజాన్ ఉపవాస దీక్షలో ఉండగా, పగటిపూట ఆహారం తీసుకోకూడదు. ఉపవాస దీక్షలో ఉన్న పలావుల్లా అహ్మద్ తన దీక్షకు ఇబ్బంది లేకుండా రక్తదానం చేద్దామని అనుకున్నాడు. అయితే, రక్తదానం చేసిన తర్వాత వెంటనే ఏదైనా తక్షణ శక్తిని ఇచ్చే ఆహారం తీసుకోకపోతే సమస్య వస్తుందని తెలిసి తన దీక్షను విరమించాడు. ‘మొదట జీవితం, ఆ తర్వాతే మతం, కులం’ అంటున్నాడు అహ్మద్.