
నిజామాబాద్ జిల్లా లో దారుణం జరిగింది. మద్యం మత్తులో ఓ దుర్మార్గుడు కన్నతల్లినే కడతేర్చాడు. జిల్లాలోని ఎడపల్లి మండలం మంగలపాడ్ గ్రామంలో ఈ అకృత్యం జరిగింది. గురువారం రాత్రి గంగాధర్ అనే వ్యక్తి పీకల దాకా మద్యం సేవించి ఇంటికి రాగానే భార్య కళావతి తో గొడవ పడి కొట్టబోయాడు. అతడి బారి నుంచి తప్పించుకునేందుకు ఇంటి నుండి ఆమె బయటకు పరుగు తీసింది. మత్తులో ఉన్న ఆ ప్రబుద్దుడు భార్య కనిపించలేదనే కోపంతో అక్కడే ఉన్న తల్లిని కొట్టాడు. వృద్ధురాలు కావడంతో కొడుకు కొట్టిన దెబ్బలకు తట్టుకోలేక ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.