గెట్టు పంచాయితీలో గొడ్డలితో దాడి .. చికిత్స పొందుతూ యువకుడు మృతి

గెట్టు పంచాయితీలో గొడ్డలితో దాడి .. చికిత్స పొందుతూ యువకుడు మృతి

యాదాద్రి, వెలుగు : గెట్టు పంచాయితీలో ఓ యువకుడిపై గొడ్డలితో దాడి చేయడంతో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన  భువనగిరి మండలం వడపర్తి గ్రామంలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. వడపర్తి గ్రామానికి చెందిన అన్నదమ్ములు మెడబోయిన వెంకయ్య, మెడబోయిన బాల్​నర్సింహ మధ్య భూవివాదం నెలకొంది. ఈనెల 22న బావి వద్ద ఇద్దరు అన్నదమ్ముల కుటుంబాలకు చెందిన వారు గొడవ పడ్డారు. దీంతో బాల్​ నర్సింహా కుమారుడు మల్లేశ్​ కోపంతో వెంకయ్య కుమారుడు భాను(30)తో గొడవకు దిగాడు. ఆవేశంలో తన తల్లి శంకరమ్మ చేతిలోని గొడ్డలిని మల్లేశ్ లాక్కుని భాను తలపై బలంగా కొట్టాడు. దీంతో అతడికి తీవ్ర రక్తస్రావం జరగడంతో కిందపడిపోయాడు. 

వెంటనే హైదరాబాద్​లోని ప్రైవేట్ హాస్పిటల్​కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున భాను మృతి చెందాడు. మృతదేహాన్ని వడపర్తికి తీసుకొచ్చి న్యాయం చేయాలని డిమాండ్​చేస్తూ కుటుంబ సభ్యులు రాస్తారోకో నిర్వహించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని వారికి నచ్చచెప్పే ప్రయత్నం చేసినా వినలేదు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు అక్కడే పికెటింగ్​ ఏర్పాటు చేశారు. భాను కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో దాడి చేసిన మల్లేశ్​తోపాటు అజయ్, శంకరమ్మను అరెస్ట్​చేసి రిమాండ్​కు తరలించారు.