
గూడూరు, వెలుగు: ఇచ్చిన అప్పును అడిగినందుకు ఓ వ్యక్తికి కక్ష గట్టి చంపి బావిలో పడేశారు. సీఐ సూర్య ప్రకాశ్, ఎస్సై గిరిధర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం తేజావత్ పంతుల్యతండాకు చెందిన తేజావత్ భద్రునాయక్ వద్ద అదేతండాకు చెందిన తేజావత్ వీరేందర్ రూ.50 వేలు అప్పుగా తీసుకున్నాడు. అప్పు తీసుకుని చాలా రోజులు అవుతున్నా తిరిగి ఇవ్వక పోవడంతో చాలా సార్లు వీరేందర్ ను భద్రు నిలదీశాడు. అప్పుగా ఇచ్చిన డబ్బుల కింద వీరేందర్ తన చెల్లి పెళ్లి కోసం అమ్మిన భూమిలో గుంటన్నర భూమిని భద్రునాయక్ దున్నుకుంటూ ఇబ్బంది పెట్టాడు.
దీంతో కోపం పెంచుకున్న వీరేందర్ ఎలాగైనా భద్రునాయక్‌ను చంపాలని నిర్ణయించుకొని, ఈ విషయాన్ని అదే తండాకు చెందిన సురేశ్, బదావత్ ఈర్య, తేజావత్ కిషన్‌కు చెప్పడంతో నలుగురు కలసి చంపడానికి ప్లాన్ వేసుకున్నారు. ఈ నెల 20న సాయంత్రం తేజావత్ కిషన్, బదావత్ ఈర్యతో కలసి గ్రామ సమీపంలోని కెనాల్ పై భద్రు నాయక్ కు ఫుల్‌గా మద్యం తాగించి, విషయాన్ని వీరేందర్ కు తెలియజేశారు.
అక్కడికి చేరుకున్న వీరేందర్ టవల్ తో భద్రు నాయక్ మెడ చుట్టూ గట్టిగా బిగించి ఊపిరి ఆడకుండా చేయగా, కిషన్, భద్రు నాయక్ అతడికి సహకరించారు. ఆ తరువాత భద్రు నాయక్ డెడ్‌బాడీని నక్కల బోడు దగ్గర ఉన్న బావిలో పడేశారు. మృతుడి భార్య నీల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. గురువారం వీరేందర్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. నిందితులను రిమాండ్ కు పంపినట్లు సీఐ తెలిపారు.