నవాబుపేట మండలంలో యువతి దారుణ హత్య

నవాబుపేట మండలంలో యువతి దారుణ హత్య
  • కొన్నేండ్లుగా యువతితో సహజీవనం చేస్తున్న యువకుడు
  • హత్య అనంతరం పోలీసుల ఎదుట లొంగిపోయిన నిందితుడు

నవాబుపేట, వెలుగు : తన పరువు తీసిందన్న కోపంతో ఓ వ్యక్తి సహజీవనం చేస్తున్న యువతిని చున్నీతో ఉరి వేసి, కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. అనంతరం పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఈ ఘటన మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌ జిల్లా నవాబుపేట మండలంలో గురువారం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నవాబుపేట మండలంలోని కొల్లూరు గ్రామానికి చెందిన శ్రీరాం నరేశ్‌‌‌‌కు గతంలో హైదరాబాద్‌‌‌‌కు చెందిన స్వాతి అనే యువతితో వివాహమైంది. వీరికి ఒక కూతురు కూడా ఉంది. అయితే ఆస్తి విషయంలో భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో స్వాతి గతేడాది పుట్టింటికి వెళ్లిపోయింది.

 తర్వాత నరేశ్‌‌‌‌ ఓ ప్రైవేట్‌‌‌‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న టైంలో జడ్చర్ల మండలం మల్లెబోయిన్‌‌‌‌పల్లికి చెందిన, భర్తను వదిలేసిన గీతాంజలి (23) అనే యువతితో పరిచయం ఏర్పడింది. తాను భార్యతో విడాకులు తీసుకున్నానని నమ్మించి గీతాంజలితో సహజీవనం చేశాడు. వీరికి కూడా కూతురు పుట్టింది. అయితే నరేశ్‌‌‌‌ కొంతకాలంగా పట్టించుకోకపోవడం, మొదటి భార్యకు విడాకులు ఇవ్వలేదని తెలియడంతో గీతాంజలి, నరేశ్‌‌‌‌ మధ్య గొడవలు మొదలయ్యాయి. ఆమె బుధవారం కొల్లూరుకు వచ్చి కుటుంబసభ్యుల సమక్షంలో పంచాయితీ పెట్టింది. దీంతో గ్రామానికి వచ్చి తన పరువు తీసిందని గీతాంజలిపై కోపం పెంచుకున్న నరేశ్‌‌‌‌, పంచాయితీ ముగిసిన తర్వాత పుట్టింటి వద్ద వదిలిపెడతానని బైక్‌‌‌‌పై తీసుకెళ్లాడు.

 కాకర్జాల గ్రామ శివారులోకి చేరుకోగానే గీతాంజలి కళ్లలో కారం చల్లి, చున్నీతో గొంతు బిగించాడు. అపస్మారక స్థితికి చేరుకున్న ఆమెను కత్తితో పొడిచి హత్య చేశాడు. అనంతరం స్టేషన్‌‌‌‌కు వెళ్లి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. అతడు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గీతాంజలి డెడ్‌‌‌‌బాడీని గుర్తించారు. గురువారం ఉదయం రూరల్‌‌‌‌ సీఐ గాంధీనాయక్‌‌‌‌ ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతురాలి తల్లి కావలి నీలమ్మ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై విక్రం తెలిపారు.