ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలోని శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో (సింహాచలం ఆలయంగా ప్రసిద్ధి చెందింది) ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఓ భక్తుడు రూ.100కోట్ల చెక్కును హుండీలో వేశాడు. తీరా దాన్ని సమీప బ్యాంకులో చెక్ చేయగా.. అందులో కేవలం రూ.17మాత్రమే ఉండడంతో అంతా నిర్ఘాంతపోయారు.
ఇటీవల హుండీ లెక్కింపు చేపట్టిన సిబ్బందికి ఓ అవాక్కయ్యే పరిస్థితి ఎదురైంది. హుండీలోని డబ్బులను లెక్కిస్తుండగా ఈ రూ.100కోట్ల చెక్కు కనిపించడంతో ఆలయ సిబ్బంది దాన్ని తనిఖీ చేశారు. ఈ క్రమంలోనే నిర్ఘాంతపోయే నిజాన్ని కనుగొన్నారు. భక్తుడు ఇచ్చింది రూ.100కోట్లయితే.. ఆ అకౌంట్ లో ఉన్నది మాత్రం రూ. 17 మాత్రమే ఉండడంతో అంతా షాక్ అయ్యారు.
ఆలయ అధికారులు ఆగస్టు 23న హుండీ సేకరణల లెక్కింపు సందర్భంగా ఆలయంలో చెక్కును కనుగొన్నారు. ఈ పరిస్థితిని గుర్తించిన అనంతరం ఆలయ కార్యనిర్వాహక అధికారి త్రినాధరావుకు సమాచారం అందించారు. ఈ ఊహించని ఘటన గురించి తెలుసుకున్న ఆలయ అధికారులు వెరిఫికేషన్ కోసం MVP కాలనీలోని కోటక్ బ్యాంక్ శాఖను సంప్రదించారు. ఖాతాలో బొడ్డేపల్లి రాధాకృష్ణ పేరుపై ఉన్న ఈ చెక్కు 8313295434 నంబర్ కు చెందింది. అయితే ఈ ఖాతాలో కేవలం రూ.17 మాత్రమే ఉన్నట్లు తేలడంతో అంతా ఖంగుతిన్నారు.
కాగా, ఆగస్టు 23న లెక్కించిన హుండీ కానుకలు గత 16 రోజులకు సంబంధించి రూ.1.49 కోట్లకు చేరుకున్నాయి. ఇందులో దాదాపు 80 గ్రాముల బంగారం, 10 కిలోల వెండి కూడా ఉన్నాయి.